
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య వెనక ఉన్న అసలైన దోషులెవరో సీబీఐ తేల్చాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కోరారు. వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేయడంపై రఘురామకృష్ణరాజు స్పందించారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిల వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా? అనేది విచారించాలని అన్నారు. మరిన్ని ఆధారాలు సమకూర్చుకుని.. హత్యకు సూత్రధారులు ఎవరనేది కూడా తేల్చాలని డిమాండ్ చేశారు.
వైఎస్ భాస్కర్ రెడ్డి స్వయంగా సీఎం జగన్ సతీమణి భారతి రెడ్డికి మేనమామ అని.. కడప ఎంపీ సీటు ఎలాగూ అవినాశ్ రెడ్డికి కన్ఫర్మ్ అని తెలిసిన తర్వాత కూడా ఎందుకు చంపడమని ప్రశ్నించారు. ఈ హత్య కేసును టీడీపీ నేతలు బీటెక్ రవి, ఆది నారాయణ రెడ్డి మీదకు నెట్టివేయాలని తొలుత చూశారని విమర్శించారు.
వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయడంతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి షాక్ గురై ఉంటారని ఎద్దేవా చేశారు. మొదటి నుంచి ఈ కేసుపై ఎక్కువగా మట్లాడుతుంది సజ్జలేనని అన్నారు. వైసీపీ నేతలు ఆదివారం ఉదయం నుంచి ఎవరు మాట్లాడటం లేదని.. ఇది దురదుష్టకరమని అన్నారు. 48 గంటల్లో ఇంకో అరెస్ట్ ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
ఇదంతా వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత విజయమని.. నిజ దోషులు ఎవరన్నది ఆమెకు తెలుసునని అన్నారు. ఆమె ఇదే పట్టుదలతో ముందుకు వెళ్ళి తండ్రి రుణం తీర్చుకోవాలని కోరారు.