
కొవ్వూరు : తూర్పు గోదావరి జిల్లాలో టిడిపి నాయకుడి దారుణ కలకలం రేపింది. కొవ్వూరు మండలంలోని వేములూరు, నందమూరు గ్రామాల టిడిపి ఇంచార్జి, వేములూరు ఉపసర్పంచ్ సత్యవరప్రసాద్(51) ను గుర్తుతెలియని దుండగులు అతి దారుణంగా హతమార్చారు. ఒంటిపై దుస్తులు లేకుండా ఇంటి వరండాలో వరప్రసాద్ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
వేములూరు టిడిపి నాయకుడు సత్యవరప్రసాద్ పంచాయితీ నిధుల వినియోగంలో అవినీతి జరుగుతోందని ఆరోపిస్తూ తోటి టిడిపి పంచాయితీ వార్డ్ మెంబర్లతో కలసి పోరాటం చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడి హత్యకు గురవడం రాజకీయ కలకలం రేపింది. వరప్రసాద్ ను రాజకీయ ప్రత్యర్థులు హతమార్చారా..? మరేదైనా కారణంతో హత్య చేసారా? అన్నది తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
టిడిపిలో యాక్టివ్ గా పనిచేసే సత్యవరప్రసాద్ వేములూరు ఉపసర్పంగ్ గా ఎన్నికయ్యాడు. అయితే భార్య శ్రీకళ ఉద్యోగం నిమిత్తం జంగారెడ్డిగూడెంలో, చదువుల కోసం కొడుకు రాజమండ్రిలో, కూతురు ఏలూరులో వుంటున్నారు. దీంతో సత్యవరప్రసాద్ ఒక్కరే స్వగ్రామంలోని సొంతింట్లో నివాసముంటున్నాడు.
Read More భార్యమీద బీరు సీసాతో దాడి చేసిన భర్త.. తీవ్రగాయాల పాలైన మహిళ..
నిన్న(ఆదివారం) ఉదయం స్థానికులు కొందరు సత్యవరప్రసాద్ కోసం ఆయన ఇంటికి వెళ్లారు. ఇంటి వరండాలో సత్యప్రసాద్ మృతదేహం బట్టలేవీ లేకుండా దుప్పటికప్పి వుండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని ఒంటిపై గాయాలతో పడివున్న ఉపసర్పంచ్ మృతదేహాన్ని పరిశీలించారు. దవడకు గాయం, చెవిలోంచి రక్తస్రావం జరిగినట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఇంట్లో గొడవ జరిగిన తర్వాత వరండాలోకి తీసుకువచ్చి తలను గోడకేసి కొట్టి సత్యవరప్రసాద్ ను చంపి వుంటారని అనుమానిస్తున్నారు. అయితే అతడిని ఎవరు చంపారో తెలియాల్సి వుంది. ఈ హత్యపై సమగ్ర దర్యాప్తు చేయాలని మాజీ మంత్రి జవహర్ డిమాండ్ చేసారు.