ఆ విగ్రహాల జోలికొస్తే... అంతుచూసేవరకు నిద్రపోం: వైసిపి ప్రభుత్వానికి ఉమ స్ట్రాంగ్ వార్నింగ్

By Arun Kumar P  |  First Published Feb 3, 2021, 4:57 PM IST

గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మసీదులు, చర్చిలు, దేవాలయాలపై ఎలాంటి దాడులు జరిగలేవని మాజీ మంత్రి బోండా ఉమ అన్నారు. 


విజయవాడ: రాష్ట్రంలో అనేకమంది ముఖ్యమంత్రులను చూశామని... కానీ జగన్మోహన్ రెడ్డి అంత చెత్తగా ఎవ్వరూ పాలించలేదని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు.జగన్ అధికారంలోకివచ్చాక ఎన్నడూలేని విధంగా రాష్ట్రంలో హిందూ మతమే లక్ష్యంగా 161 వరకు ఘటనలు జరిగాయని... అవన్నీ వాస్తవమో కాదో ఈప్రభుత్వం చెప్పాలని ఉమా డిమాండ్ చేశారు. 

గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడుకూడా ఇటువంటి ఘటనలు జరగలేదన్పారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎక్కడా ఒక్క మసీదుపై గానీ, చర్చిపై గానీ, దేవాలయంపై గానీ దాడి జరిగింది లేదన్నారు. ఈనాడు ప్రభుత్వ అసమర్థత వల్లే మత మార్పుడులు చేసేవారు రెచ్చిపోతున్నారని... ప్రభుత్వ కనుసన్నల్లో జరగుతున్న బలవంతపు మత మార్పిడులకు టీడీపీ అడ్డుగా ఉందన్న దురాలోచనతో కావాలనే ప్రతిపక్షంపై పాలకులు ఎదురుదాడి చేస్తున్నారన్నారు.  ముఖ్యమంత్రిగా అన్నిమత విశ్వాసాలను కాపాడాల్సిన బాధ్యత జగన్ పై లేదా అని ఉమ ప్రశ్నించారు. 

Latest Videos

undefined

వ్యవస్థలన్నింటినీ చేతుల్లో ఉంచుకున్న ప్రభుత్వం టీడీపీపై నిందలేయడం ఏమిటని ప్రశ్నించారు. టీడీపీ వారు ఎక్కడైనా అటువంటి చర్యలకు పాల్పడి ఉంటే ప్రభుత్వం పోలీసులు సాక్ష్యాధారాలతో సహా ఎందుకు బయటపెట్టడం లేదన్నారు. రాష్ట్రంలో 32వేల దేవాలయాల్లో సీసీ కెమెరాలు పెట్టించామని డీజీపీ చెప్పారని, మరి అలాంటప్పుడు వాటిలో రికార్డైన దృశ్యాలను ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదన్నారు. ప్రవీణ్ చక్రవర్తి వంటి పాస్టర్లు బహిరంగంగా తాము దేవాలయాలను, విగ్రహాలను ధ్వంసం చేశామని చెప్పుకుంటుంటే అతనిపై ఏం చర్యలు తీసుకున్నారని బొండా నిలదీశారు. 

అసలు దోషులను పట్టుకోకుండా, ప్రభుత్వం తిరిగి రాజకీయ అంశాలకే ప్రాధాన్యతనిస్తూ టీడీపీకి అంటగట్టాలని చూస్తోందన్నారు. తెలుగుదేశం కార్యకర్తలు, నేతలను దేవాలయాలపై దాడులకు లింకుపెడుతూ, వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మరని ఉమా తేల్చిచెప్పా రు. దేవాలయాలపై దాడిఘటనలో ఏంచర్యలు తీసుకున్నారో, దోషుల్లో ఎందరిని అరెస్ట్ చేశారో చెప్పకుండా ప్రతిపక్షాన్ని బూచిగా చూపడం సిగ్గుచేటన్నారు. దేవాలయాలపై దాడులన్నీ వైసీపీ ప్రభుత్వ మద్ధతుతోనే జరుగుతున్నాయని టీడీపీ ఆధారాలతో సహా నిరూపించిందని...రామతీర్థంలో వైసీపీ ప్రభుత్వ మద్ధతుతోనే రాములవారి శిరస్సు ఖండింపబడిందన్నారు. చంద్రబాబునాయుడు రామతీర్థం వెళ్లేవరకూ జగన్ ఆ ఉదంతంపై ఎందుకు మాట్లాడలేదన్నారు? రామతీర్థం ఘటనతో కడుపుమండి ప్రజలు ఏవిధంగా వ్యవహరించారో విజయసాయి రెడ్డివాహనంపై జరిగిన దాడే రుజువన్నారు.  

read more  మీ ఇంట్లో ఆడవాళ్లు లేరా? అయినా కుటుంబ చరిత్ర అలాంటిది: పెద్దిరెడ్డిపై అనురాధ వ్యాఖ్యలు

అంతర్వేది రథం తగలబడినప్పుడు పోలీస్ అధికారులు తలా ఒకమాట చెప్పారని... ఒకరు తేనెతుట్టే అంటే, మరొకరు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అని చెప్పారన్నారు. అంతర్వేధి రథం తగలబడిన ఘటనను సీబీఐకి అప్పగించామని చెప్పిన ప్రభుత్వం ఆ కేసు విచారణను తాడేపల్లి ప్యాలెస్ లో డస్ట్ బిన్ లో పడేసిందా? అని బొండా ఎద్దేవా చేశారు. బిట్రగుంటలో రథం కాలిపోతే దానిపై ఎటువంటి విచారణ జరగలేదన్నారు. ఈ విధంగా 161 ఘటనలు జరిగితే, ప్రవీణ్ చక్రవర్తి వంటివారు తామేచేశామని చెబుతుంటే, ప్రభుత్వం ఎందుకు ఘటనలకు కారకులైనవారిని అరెస్ట్ చేయలేక పోయింది?  ప్రవీణ్ చక్రవర్తి ఎవరు, అతనికి బ్రదర్ అనిల్ కుమార్ కు ఉన్నసంబంధాలేమిటి? సదరు పాస్టర్ కు కడపలో బ్యాంక్ ఎకౌంట్ ఎందుకుంది? ఆ అకౌంట్ కు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరి మద్థతుతో ప్రవీణ్ చక్రవర్తి దేవాలయాలపై దాడులుచేశాడు అనేఅంశాలపై ప్రభుత్వం ఎందుకు లోతైన విచారణ జరపడంలేదు? అని ప్రశ్నించారు. 

ప్రభుత్వ మద్ధతు లేకుండా 161 ఘటనలు జరిగాయంటే ఎవరూ నమ్మేస్థితిలో లేరన్న బొండా ప్రవీణ్ చక్రవర్తి వంటివారు తాముచేసిన దురాగతాలను బహరంగంగా చెబుతున్నా అతన్ని పాలకులు ఎందుకు ఉపేక్షిస్తున్నారన్నా రు.  హిందూమత పరిరక్షకులు, స్వామీజీలు జగన్ మద్ధతుతోనే రాష్ట్రంలో హిందూమతంపై దాడులు జరుగుతున్నాయని బహిరంగంగానే చెబుతున్నారన్నారు. హిందూమతం కోసం, దాని రక్షణకోసం ఎన్నోఏళ్లనుంచి పనిచేస్తున్నవారే ప్రభుత్వతీరుని తప్పుపడుతున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాకే ఇలా ఎందుకు జరుగుతున్నాయనే ఆలోచన ప్రతి ఒక్కరిలోనూ ఉందన్నారు. 

అచ్చెన్నాయుడు తన సమీప బంధువుతో ఫోన్ లో మాట్లాడితే, ఆయనపై హత్యాయత్నం కేసులుపెట్టి  జైలుకు పంపిన ప్రభుత్వం, ప్రవీణ్ చక్రవర్తి అనే వ్యక్తి బహిరంగంగా సోషల్ మీడియాలో తాను చేసింది చెప్పినా, జగన్ అండ్ కో అతనిపై ఎందుకు చర్యలు తీసుకోలేకపోయిందో సమాధానం చెప్పాలని బొండా ఉమా నిలదీశారు. రాజమహేంద్రవరంలో టీడీపీవారే పూజారికి డబ్బులిచ్చి విగ్రహాన్ని ధ్వంసం చేయించారని చెప్పిన అధికార పార్టీ,  ఆ ఘటనలో పూజారులే విగ్రహాన్ని ధ్వంసం చేశారని చెప్పి, నేరాన్ని వారిపై మోపిందన్నారు. తాను నిత్యం కొలిచే దైవాన్ని ఏ అర్చకుడు తనకు తానుగా ధ్వంసం చేయడనే ఇంగితంకూడా లేకుండా ప్రభుత్వం, పాలకులు ఇటువంటి కథలు అల్లడం సిగ్గుచేటన్నారు. దేవాలయాలపై దాడులకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్ ఇప్పటి వరకు కొండనుతవ్వి ఎలుకనుకూడా పట్టలేకపోయిందన్నారు. 

తిరుమల తిరుపతి బస్ టిక్కెట్ల వెనకాల అన్యమత ప్రచారానికి సంబంధించిన సమాచారాన్ని ముద్రించిన ప్రభుత్వం, టీడీపీ ఆందోళనతో వెనక్కుతగ్గిందన్నారు. స్వామివారి కార్యక్రమాలను ప్రసారం చేయాల్సిన ఎస్వీబీసీ ఛానల్లో పోర్న్ సైట్ల లింకులు రావడం ఎంతటి దారుణమో ఆలోచించాలన్నారు. శ్రీశైలంలో, సింహాచలంలో, అన్నవరంలో జరిగిన ఘటనలపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందన్నారు. కనకదుర్గమ్మ గుడిలో వెండిసింహాలు మాయమైతే ఏంచర్యలు తీసుకున్నారన్నారు. పనికిమాలిన దేవాదాయమంత్రి ఇవేవీ తనకు పట్టవన్నట్టు తిరుగుతన్నా, అతనిపై ప్రభుత్వం ఒక్కటంటే ఒక్కచర్యకూడా తీసుకోలేదన్నారు. తనకువచ్చే కలెక్షన్లలో వాటాను అతను తాడేపల్లికి ఇస్తున్నాడు కాబట్టే అతన్ని వదిలేశారని ఉమ ఆరోపించారు. 

ఇటీవల ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాటలతోనే వైసీపీ భవిష్యత్ ప్రణాళిక ఏమిటో తేలిపోయిందన్నారు. విగ్రహాలు ధ్వంసాల పేరుతో జగన్ ప్రభుత్వం తన రాజకీయ ఎజెండాను సజ్జల మాటల్లోనే బహిర్గతం చేసిందన్నారు. వంగవీటి మోహన్ రంగా, డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ విగ్రహాల ధ్వంసానికి టీడీపీ ప్రణాళికలు వేస్తోందని ఆయన చెబుతుంటే, అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏం పీకుతోందని మాజీ ఎమ్మెల్యే మండిపడ్డారు.   అంబేద్కర్, రంగా విగ్రహాల ధ్వంసంతో ప్రశాంతమైన గ్రామాల్లో చిచ్చుపెట్టడానికి ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నట్లు తేలిపోయిందన్నారు. కాపులు, ఎస్సీలకు మధ్యచిచ్చుపెట్టేలాచేసి బీసీలు, ఇతరవర్గాలకు మధ్య కలహాలు రాజేసేలా ప్రభుత్వం తన కుటిల రాజకీయాలను అమలు చేయబోతోందని సజ్జల మాటలతోనే తేలిపోయిందన్నారు. 

రాముడి తలను ఖండించినవారు రంగా, అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేయడానికి వెనుకాడరనే వాస్తవాన్ని గ్రహించి, ప్రతి ఒక్కరూ వారి వారి ప్రాంతాల్లోని విగ్రహాలను వారే కాపాడుకోవాలని బొండా పిలుపునిచ్చారు. అంబేద్కర్, రంగా విగ్రహాలపై దాడి జరిగితే ప్రభుత్వం అంతు చూసేదాకా తగ్గబోమని ఉమా ఈసందర్భంగా తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్ లో ప్రభుత్వం, ప్రతిపక్షాలపై నిందలేయడం మానుకోవాలన్నారు బోండా ఉమ.

click me!