
విజయవాడ : వైసిపి ప్రభుత్వం ప్రభుత్వ పథకాలకు ఎంత కుదిరితే అంత తక్కువమందికి ఇవ్వాలని చూస్తోందని టిడిపి నేత బోండా ఉమా ఆరోపించారు. చివరకు ఒంటిమీద మంచి బట్టలు ఉన్నా ప్రభుత్వ పథకాలు రద్దు చేస్తున్నారని అన్నారు. ఇలా ఇప్పటివరకు రూ.10 లక్షల కోట్లు అప్పులు చేసిన జగన్ సర్కార్ కేవలం రూ.2 లక్షల కోట్ల సంక్షేమ పథకాలను మాత్రమే అమలు చేస్తోందన్నారు. మిగతా రూ.8 లక్షల కోట్లు ఏమయ్యాయి అని బోండా ఉమ ప్రశ్నించారు.
పదవి కాలం పూర్తవుతున్నా జగన్ ప్రభుత్వం ఇంతవరకు రాజధానిని అభివృద్ది చేయలేదు... అయినా రాజధాని ఎక్కడో స్పష్టత వుంటేగా అభివృద్ది చేయడానికి అంటూ ఉమ ఎద్దేవా చేసారు. టిడిపి హయాంలో చేపట్టిన రాజధాని నిర్మాణ పనులను వైసిపి ప్రభుత్వం ఎక్కడికక్కడ ఆపేసిందన్నారు. అమరావతి నిర్మాణంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలు తప్ప ఒక్కటయినా నిరూపించారా? అని ప్రశ్నించారు. అయినా సర్వాధికారాలు చేతుల్లో పెట్టుకున్న మీరు టిడిపి నాయకులు తప్పుచేసివుంటే ఇంతకాలం ఆగేవారా... ఒక్కరూపాయి అవినీతి జరిగినట్లు నిరూపణ కాలేదు కాబట్టే ఆరోపణలకే పరిమితం అయ్యారని బోండా ఉమ పేర్కొన్నారు.
జగన్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని... ప్రజల మద్దతు పూర్తిగా కోల్పోయిందని ఉమ అన్నారు. వైసిపి పాలనలో రాష్ట్రంలో అన్ని వ్యవస్థ పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు. ఈ ఐదేళ్లలో ఏం చేసారో కూడా చెప్పుకోలేని పరిస్థితిలో వైసిపి వుంది... అందువల్లే గత ఎన్నికలకు ముందులాగే మళ్లీ మోసాలకు తెరతీసారని అన్నారు.
Read More ఆ ముగ్గురికే మళ్లీ టికెట్లు ఖాయం... వైసిపి అభ్యర్థులను ప్రకటించిన సజ్జల (వీడియో)
టిడిపి 2047 విజన్ తో ముందుకు వెళితే వైసిపి మాత్రం 2024లో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు జైలుకు వెళ్లే విజన్ తో ముందుకు వెళుతున్నారని అన్నారు. టిడిపి అధికారంలోకి రాగానే అవినీతి, అక్రమాలకు పాల్పడిన నాయకులు, అధికారులు జైలుకెళ్లడం ఖామయని ఉమ హెచ్చరించారు.
ఇక వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఏడుకొండలు ఎక్కుతుండగా ఓ చిన్నారిపై చిరుత దాడిచేసి చంపిన ఘటనపై బోండా ఉమ స్పందించారు. ఇంత సీరియస్ ఘటన జరిగితే టిడిపి ఛైర్మన్ భూమన ఇంత నిర్లక్ష్యంగా భక్తులకు కర్రలు ఇస్తామని అంటాడా... భక్తులకు రక్షణ కల్పించడం చేతకాదా అని నిలదీసారు. చిరుత తరమడాని ఇస్తామన్న కర్రలతోనే భక్తులు వీళ్ళకి బడితపూజా చేయాలని బోండా ఉమ సూచించారు.