విశాఖ ఎంపీ కుటుంబం కిడ్నాప్ వెనక విజయసాయి రెడ్డి...: బోండా ఉమ సంచలనం

Published : Jun 16, 2023, 04:57 PM IST
విశాఖ ఎంపీ కుటుంబం కిడ్నాప్ వెనక విజయసాయి రెడ్డి...: బోండా ఉమ సంచలనం

సారాంశం

విశాఖపట్నంలో కలకలం రేపిన అధికార వైసిపి ఎంపీ ఎంవివి సత్యనారాయణ కుటుంబసభ్యుల కిడ్నాప్ వ్యవహారంపై టిడిపి నేత బోండా ఉమ సంచలన వ్యాఖ్యలు చేసారు. 

విశాఖపట్నం : అధికార వైసిపి ఎంపీ ఎంవివి సత్యనారాయణ కుటుంబసభ్యులు,  ఆడిటర్ జీవి కిడ్నాప్ విశాఖపట్నంలో కలకలం సృష్టించాయి. ఎంపీ భార్య, కొడుకును వారి ఇంట్లోనే బంధించిన కిడ్నాపర్లు ఆడిటర్ జివిని కూడా అక్కడికి రప్పించి బందీని చేసారు. ఇలా ఏకంగా అధికారపార్టీ ఎంపీ కుటుంబసభ్యులనే కిడ్నాప్ చేసారంటే దీని వెనక పెద్దతలల హస్తం వుందని టిడిపి నేత బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. వైసిపి ఉత్తరాంధ్ర ఇంచార్జ్ గా పనిచేసిన ఎంపీ విజయసాయి రెడ్డిపై అనుమానం వ్యక్తంచేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసారు. 

విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్ర వైసిపి ఇంచార్జిగా వున్న సమయంలో భారీగా భూములు కబ్జా చేసారని బోండా ఉమ ఆరోపించారు. అంతకు ముందునుంచే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే మరో ఎంపీ  ఎంవివి సత్యనారాయణ కూడా ఈ భూ అక్రమాల్లో పాలుపంచుకున్నారని పేర్కొన్నారు. ఇలా కొట్టేసిన భూములు, ఆస్తుల పంపకాల్లో అధికారపార్టీ ఎంపీలిద్దరికి తేడాలు వచ్చాయని... దీంతో వ్యవహారం కిడ్నాప్ ల వరకు వెళ్లిందని బోండా ఉమా సంచలన వ్యాఖ్యలు చేసారు.  

విశాఖపట్నం కేంద్రంగా విజయసాయిరెడ్డి సాగించిన భూ కబ్జాలు, దోపిడీలకోసం తయారుచేసిన ముఠాలే తాజాగా వైసీపీ ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసాయని బోండా ఉమ అన్నారు. తమ అవినీతిపై ప్రశ్నించేవారిని, దోపిడీకి అడ్డొచ్చేవారిని బెదిరించడానికి రౌడీ ముఠాలను వైసిపి నాయకులు పెంచి పోషించారని... ఆ విషనాగులే సొంత పార్టీ ఎంపీ కుటుంబాన్ని కాటేయడానికి ప్రయత్నించాయని అన్నారు. 

Read More  బాపట్ల విద్యార్థి సజీవదహనం కేసులో ట్విస్ట్... వైసిపి గూండాల హత్యేనన్న ఎమ్మెల్యే

గతంలోనే విజయసాయి రెడ్డికి ఎంపీ ఎంవివితో భూముల విషయంలో విబేధాలు వచ్చాయని... దీంతో ఒకరి అవినీతి, అక్రమాలను మరొకరు బైటపెట్టుకోవడంతో ఇది మరింత ముదిరిందని బోండా ఉమ తెలిపారు. దీంతో ఉత్తరాంధ్ర వైసిపి ఇంచార్జ్ బాధ్యతల నుండి విజయసాయిని తప్పించిన జగన్ తన బాబాయ్ వైవి సుబ్బారెడ్డికి అప్పగించారని వెల్లడించారు. ఈ క్రమంలో విజయసాయి రెడ్డి, ఎంవివి కొట్టేసిన దాంట్లో సుబ్బారెడ్డి వాటా అడిగారని... స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా తమకూ వాటా కావాలని అడిగారని అన్నారు. ఇలా వైసిపి నాయకులకు వాటాల విషయంలో విబేధాలు తలెత్తి చివరకు ఎంపీ కుటుంబసభ్యుల కిడ్నాప్ వరకు వెళ్ళిందన్నారు. 

టిడిపి ప్రభుత్వ పాలనలో విశాఖపట్నంతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతమంతా ప్రశాంతంగా వుండేదని బోండా ఉమ తెలిపారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక విశాఖలో దోపిడీలు, దొమ్మీలు, కిడ్నాప్ లతో అల్లకల్లోలంగా మారిందన్నారు. సొంత పార్టీ ఎంపీ కుటుంబానికి రక్షణ ఇవ్వలేని ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలను ఏం రక్షిస్తారని ఉమ ప్రశ్నించారు. ఎంపీ కుటుంబసభ్యుల కిడ్నాప్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారితే ముఖ్యమంత్రి జగన్ మాత్రం తనకేమీ పట్టదన్నట్లు వున్నాడని బోండా ఉమ అన్నారు. 

రాజధాని పేరుతో విశాఖలో వాలిన వైసీపీ నేతల భూకబ్జాలు, దోపిడీ, ఆస్తుల లూఠీకి పాల్పడ్డారని... ఈ బాగోతం ఎక్కడ బయటపడుతుందోననే జగన్ సొంతపార్టీ ఎంపీ కుటుంబసభ్యుల కిడ్నాప్ అయినా నోరెత్తడంలేదన్నారు. ఎంపీ కుటుంబసభ్యుల కిడ్నాప్ ఉదంతంపై సమగ్ర దర్యాప్తు జరిపించి దోషుల్ని  శిక్షించే దమ్ము, ధైర్యం ముఖ్యమంత్రికి ఉన్నాయా? అని బోండా ఉమ ప్రశ్నించారు. టిడిపి హయాంలో ఫైనాన్షియల్ క్యాపిటల్ గా విరసిల్లిన విశాఖపట్నం జగన్ హయాంలో క్రైమ కేపిటల్ గా మారిందని టిడిపి నేత బోండా ఉమ పేర్కొన్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్