వైఎస్, చంద్రబాబుల పాదయాత్రలు ప్రశాంతంగానే.. జగన్‌కు రైతులంటే భయం అందుకే ఇలా : బొండా ఉమా

By Siva KodatiFirst Published Oct 22, 2022, 3:11 PM IST
Highlights

అమరావతి రైతుల పాదయాత్రను చూసి జగన్ వెన్నులో వణుకుపుడుతోందన్నారు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు. అమరావతి రైతుల పాదయాత్ర ప్రశాంతంగా సాగుతున్నా.. వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అమరావతి రైతుల పాదయాత్ర విరామం, ఏపీ హైకోర్టు తీర్పు తదితర అంశాలపై టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి రైతుల పాదయాత్రను చూసి జగన్ వెన్నులో వణుకుపుడుతోందన్నారు. రైతులను చూసి జగన్ భయపడుతున్నారని.. అందుకే అడుగడుగునా వారి పాదయాత్రకు ఆటంకాలను సృష్టించారని బొండా ఉమా అన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబుల పాదయాత్రలు ప్రశాంతంగా జరిగాయని.. ప్రస్తుతం కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పాదయాత్ర కూడా ప్రశాంతంగానే సాగుతోందని ఉమా పేర్కొన్నారు. అయితే అమరావతి రైతుల పాదయాత్ర ప్రశాంతంగా సాగుతున్నా.. వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ప్రభుత్వం చెప్పినట్లుగా పోలీసులు చేస్తున్నారని.. అడుగడుగునా రైతుల పాదయాత్రను అడ్డుకుంటున్నారని బొండా ఉమా మండిపడ్డారు. అలాంటి పోలీసు అధికారులను వదిలిపెట్టేది లేదని ఆయన హెచ్చరించారు. మహిళా రైతులను బూటు కాళ్లతో తన్నడం సరికాదని... హైకోర్టు ఆదేశాలను కూడా పోలీసులు పాటించడం లేదని బొండా ఉమా ఆరోపించారు. 

Latest Videos

Also REad:అమరావతి రైతుల సంచలన నిర్ణయం.. పాదయాత్రకు తాత్కాలిక బ్రేక్.. కారణమిదే..

ఇదిలా ఉంటే.. తాము చేపట్టిన పాదయాత్రను అడ్డుకుంటున్నారని అమరావతి పరిరక్షణ సమితి, రైతులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. పాదయాత్రలో 600 మందికి మాత్రమే పరిమితం చేయాలని ఆదేశించింది. ఎలాంటి సంఘ వ్యతిరేక శక్తులు చొరబడకుండా, శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చూసేందుకు పాదయాత్రలో పాల్గొనేందుకు అనుమతించిన వారిని మినహాయించి ఎవరినీ అనుమతించవద్దని కోర్టు పోలీసులను ఆదేశించింది. అలాగే ప్రత్యర్థి వర్గానికి చెందిన ఏ వర్గానికి అయినా పాదయాత్రకు సమీపంలో ఉండకుండా అనుమతులు ఇచ్చేటపుడు చూసుకోవాలని పోలీసులను ఆదేశించింది. పాదయాత్రలో నాలుగు వాహనాలకు మించి అనుమతించరాదని కోర్టు పోలీసులను ఆదేశించింది. ఇక, రైతుల పాదయాత్రకు సంఘీభావాన్ని తెలియజేయాలనుకునే  వ్యక్తులు యాత్రలో చేరకుండా.. రోడ్డుకు ఇరువైపల ఉండ సంఘీభావం తెలపాలని హైకోర్టు స్పష్టం చేసింది. 
 

click me!