జగన్ ఏం చేసి చిప్పకూడు తిన్నాడో సజ్జలకు తెలియదా?: మాజీ మంత్రి బండారు ఎద్దేవా

By Arun Kumar PFirst Published Jun 25, 2021, 1:14 PM IST
Highlights

మూడు రాజధానులంటున్న జగన్మోహన్ రెడ్డి తన అవినీతిలో భాగస్వామి అయిన విజయసాయిని విశాఖలో పెట్టి భూములు కొల్లగొట్టే కార్యక్రమాన్ని అప్పగించాడని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఆరోపించారు.

విశాఖపట్నం: భారతదేశ చరిత్రలో విశాఖపట్నానికి ప్రత్యేక చరిత్ర ఉందని, విశాఖవాసులు శాంతికాముకులని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. అలాంటి నగరాన్ని, ప్రజలను దోచుకోవాలని సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎప్పటినుంచో ఉందని... అందులో భాగంగానే గతంలో ఆయన తన తల్లిని విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీచేయించాడని సత్యనారాయణమూర్తి తెలిపారు. అప్పుడు అది సాధ్యపడలేదని... అందుకే 2019లో ముఖ్యమంత్రి అయ్యాక ఆయన కన్ను మరోసారి విశాఖపై పడిందన్నారు.

బిల్డ్ ఏపీలో భాగంగా విశాఖ భూములను అమ్మకానికి పెట్టిన ప్రభుత్వ తీరుపై ప్రతిపక్ష నేతలమైన తామంతా కోర్టులను ఆశ్రయించడం జరిగిందన్నారు. మూడు రాజధానులంటున్న జగన్మోహన్ రెడ్డి తన అవినీతిలో భాగస్వామి అయిన విజయసాయిని విశాఖలో పెట్టి భూములు కొల్లగొట్టే కార్యక్రమాన్ని అప్పగించాడని ఆరోపించారు. సాగర నగరంలోని భూములను అమ్మేసి ఆ సొమ్మంతా ఇడుపులపాయకు, పులివెందులకు తరలించాలని ముఖ్యమంత్రి చూస్తున్నాడని సత్యనారాయణమూర్తి ఆక్షేపించారు.

కేపిటల్ సిటీ ముసుగులో విశాఖలోని భూములను అమ్మడం ఎంతమాత్రం మంచిది కాదన్నారు. నిజంగా విశాఖను అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఉంటే రాష్ట్ర ఖజానా నుంచి సొమ్ము కేటాయించాలన్నారు. దిక్కుమాలిన కార్పొరేషన్ల పేరుతో విశాఖ భూములను దిగమింగడానికే ప్రభుత్వం కుటిల  ప్రయత్నాలుచేస్తోందని బండారు మండిపడ్డారు. 

ఏపీ బిల్డ్ ఆపరేషన్ అంటూ తొలుత ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారని, తరువాత ఆంధ్రప్రదేశ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్, తాజాగా విశాఖపట్నం బీచ్ కారిడార్ రోడ్డు ప్రాజెక్ట్ ను తెరపైకి తెచ్చారన్నారు. విశాఖ బీచ్ కారిడార్ డెవలప్ మెంట్ పేరుతో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో మొత్తం బూటకమేనని సత్యనారాయణమూర్తి మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డికి నిజంగా విశాఖను అభివృద్ధి చేయాలని ఉంటే పులివెందులకు కేటాయించినట్టే ప్రత్యేకంగా నిధులు ఎందుకు కేటయించడం లేదని ప్రశ్నించారు. రూ.600కోట్లను పులివెందుల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేటాయించాడని, అక్కడి భూములు అమ్మే ఆ నిధులు కేటాయించాడా? అని మాజీమంత్రి నిలదీశారు. 

read more  సీఎం ఇంటికి కూతవేటు దూరంలో గ్యాంగ్ రేప్... ఇదీ మహిళల పరిస్థితి: జాతీయ మహిళా కమీషన్ కు అనిత లేఖ

ప్రభుత్వ, కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం రూ.5వేల కోట్లతో విశాఖను అభివృద్ధి చేస్తుందని చెప్పడం విశాఖవాసులను వెర్రివాళ్లను చేయడమే అవుతుందన్నారు. గతంలో విశాఖపట్నం ఫర్ సేల్ అనుకున్నామని.. ఇప్పుడదే సరికొత్తగా విశాఖపట్నం ఫర్ మార్ట్ గేజ్ గా మారిందన్నారు. బ్రిషీష్ వారికంటే ఘోరంగా జగన్మోహన్ రెడ్డి విశాఖ భూములను, అక్కడి ప్రజలను తనఅవినీతి కోసం తనఖా పెట్టడానికి సిద్ధమయ్యాడని మాజీమంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు.

విశాఖ నగరాన్ని ముఖ్యమంత్రి నడిరోడ్డుపై అమ్మకానికిపెట్టినా నోరెత్తలేని దుస్థితిలో ఆ జిల్లా మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారన్నారు. టీడీపీ హాయాంలో విశాఖకు వచ్చిన పరిశ్రమలను, తెలంగాణకు తరలిపోయేలా చేసిన ఏ1, ఏ2లు ఉక్కునగరాన్ని అభివృద్ధి చేస్తారనుకోవడం అత్యాశే అవుతుందన్నారు. గతంలో ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీబిల్డ్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్లను ఎలాగైతే న్యాయస్థానాల ద్వారా అడ్డుకున్నామో అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చిన విశాఖ బీచ్ కారిడార్ కార్పొరేషన్ ను అడ్డుకొని తీరుతామని బండారు తేల్చిచెప్పారు.

జగన్మోహన్ రెడ్డిపై కేసులున్నాయా? అని అమాయకంగా ప్రశ్నిస్తున్న సజ్జల అబద్ధాల్లో ఆరితేరాడని తేలిపోయిందన్నారు. 16నెలలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు జైల్లో ఉన్నాడో, ఏం చేస్తే చిప్పకూడు తినాల్సి వస్తుందో సజ్జలకు తెలియదా? అని మాజీమంత్రి ఎద్దేవా చేశారు. లోటస్ పాండ్, బెంగుళూరు ప్యాలెస్, ఇడుపులపాయ ఎస్టేట్, సాక్షి ఛానల్, దినపత్రిక, భారతి సిమెంట్స్, సరస్వతి పవర్స్ పరిశ్రమలు ఎక్కడినుంచి వచ్చాయో, ఏం చేస్తే వచ్చాయో సజ్జల చెప్పాలన్నారు. 

విశాఖపట్నాన్ని అమ్మేసి రేపు ఏం తెలియని వాడిలా మేమా.. విశాఖను అమ్మామా? అంటూ విజయసాయి, సజ్జల బొంకినా ఆశ్చర్యం లేదన్నారు. సీబీఐ, ఈడీలు జగన్మోహన్ రెడ్డిపై పెట్టిన కేసులు కేసులే కావంటున్న సజ్జల ముఖ్యమంత్రి ఎందుకు వాటికి భయపడి పదేపదే కేంద్ర పెద్దల కాళ్లు పట్టకుంటున్నాడో సమాధానం చెప్పాలన్నారు.  టీడీపీ కార్పొరేటర్ ను బెదిరించి తన పార్టీలోకి లాక్కున్న విజయసాయి అతనితో అక్రమ కాపురం చేస్తున్నాడన్నారు. విజయసాయి తనకు చెందిన కూర్మన్మపాలెం స్కామ్ బయటపడకుండా జాగ్రత్తపడటానికే టీడీపీ కార్పొరేటర్ ను తనవైపు తిప్పుకున్నాడన్నారు. విజయసాయిరెడ్డి కూర్మన్నపాలెంలో నిర్మిస్తున్న అక్రమ కట్టడాల బాగోతాన్ని ఈరోజు కాకుంటే రేపైనా ప్రజలముందు ఎండగడతామని సత్యనారాయణ మూర్తి తేల్చిచెప్పారు.   

తనకు కావాల్సిన అప్పులకోసం విశాఖ భూములను అమ్మే అధికారం ముఖ్యమంత్రికి ఎవరిచ్చారన్నారు.   పాలకుల ఆగడాలు, అరాచకాలు, భూకబ్జాలు, విక్రయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకొని తీరుతామని టీడీపీ సీనియర్ నేత తేల్చిచెప్పారు. విశాఖ వాసులు శాంతికాముకులు అయినంత మాత్రాన ఏం చేసినా సరిపోతుందని భావిస్తున్న విజయసాయి, సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డిలు పిల్లినైనా గదిలోపెట్టి  కొడితే పులి అవుతుందని గుర్తుంచుకోవాలని మాజీ మంత్రి సత్యనారాయణ మూర్తి హెచ్చరించారు. 

click me!