40 మంది ఎమ్మెల్యేలు వస్తామని అంటున్నారు.. వైసీపీ పిచ్చి ప్రేలాపనలు ఆపాలి: అచ్చెన్నాయుడు

By Sumanth KanukulaFirst Published Mar 28, 2023, 5:37 PM IST
Highlights

ఏపీలో అధికార వైసీపీపై తెలుగుదేశం పార్టీ నేత అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారనే ఆరోపణలు చేస్తున్న వైసీపీ  వైసీపీ పిచ్చి ప్రేలాపనలు ఆపాలని అన్నారు. 

హైదరాబాద్: ఏపీలో అధికార వైసీపీపై తెలుగుదేశం పార్టీ నేత అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారనే ఆరోపణలు చేస్తున్న వైసీపీ  వైసీపీ పిచ్చి ప్రేలాపనలు ఆపాలని అన్నారు. టీడీపీ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలను ఎంతకు కొన్నారో సీఎం జగన్ చెప్పాలని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పొలిట్ బ్యూరో సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయానికి తీసుకున్నారు. 

ఎన్టీఆర్ శతజయంతి సందర్బంగా 100 సభలు నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది. పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 40శాతం యువతకే టికెట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.. వంద రూపాయల నాణేన్ని విడుదల చేస్తోన్న కేంద్రం, ప్రధానమంత్రికి అభినందనలు తెలుపుతూ పొలిట్ బ్యూరో తీర్మానం చేసింది. 

పొలిట్ బ్యూరో సమావేశం అనంతరం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ..వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు గురిచేసినా నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుందని అన్నారు. ఏపీకి చెందిన 13, తెలంగాణకు చెందిన 4 అంశాలను పొలిట్ బ్యూరోలో చర్చించామని చెప్పారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ముఖ్యమంత్రి కనీసం‌ సమీక్ష జరకకపోవటం దుర్మార్గమని విమర్శించారు. 

వైసీపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు తమను సంప్రదించలేదని అన్నారు. అయితే వైసీపీ నుంచి 40 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తామని అంటున్నారని చెప్పారు. మేమొస్తాం.. మేమొస్తాం.. అంటూంటే.. వారి  అభ్యర్థనలతో చెవులు గుయ్‌మంటున్నాయని అన్నారు. మంచి చెడ్డలు చూసి ఎవరిని చేర్చుకోవాలో, ఎవరిని చేర్చుకోకూడదో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 

ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగింది రహస్య ఓటింగ్ అని.. ఎవరూ ఎవరికి ఓటు వేసిందనేది  ఎలా తెలుస్తోందని ప్రశ్నించారు. అలాంటిది రహస్య ఓటింగ్‌ ఓటింగ్ వివరాలు ఎలా తెలిశాయో సజ్జల సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. సీక్రెట్ ఓటింగ్‌కు విఘాతం కలిగించే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. 

click me!