వైసీపీ డీఎన్ఏలోనే అరాచకం... ఉత్సవ విగ్రహంలా మహిళా హోంమంత్రి: మాజీ మంత్రి ఆలపాటి

By Arun Kumar PFirst Published Jun 15, 2021, 11:45 AM IST
Highlights

మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక నియంత పాలనలో ఉన్నామా? అన్న అనుమానం ఈ ప్రభుత్వ పాలనను చూస్తే కలుగుతోందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. 

అమరావతి: ప్రజా రాజధాని అమరావతి పరిధిలోని ఉంగుటూరు గ్రామ మహిళా సర్పంచ్ భర్త సోమశేఖర్ పై వైసీపీ నాయకులు చేసిన దాడిని ఖండించారు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్. దాడికి పాల్పడిన రాయపాటి శివపై రౌడీ షీట్ ఓపెన్ చేసి వెంటనే అరెస్ట్ చేయాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు.  

''సోమశేఖర్ పై రెండు నెలల్లో ఆరుసార్లు దాడి జరిగినా పోలీసులు ఎందుకు పట్టించుకోలేదు?  మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక నియంత పాలనలో ఉన్నామా? రాజ్యాంగం అంటే విలువ లేని ప్రభుత్వానికి న్యాయం, చట్టం అంటే లెక్క ఉంటుందనుకోవడం అవివేకమే అవుతుంది.  అధికార అహంతో వైసీపీ నాయకులు విచ్చల విడిగా ప్రవర్తిస్తున్నారు'' అని మండిపడ్డారు. 

read more  ఈ పది డిమాండ్ల సాధనకు ప్రభుత్వంతో ఢీ... నిరసనకు పిలుపునిచ్చిన చంద్రబాబు

''ప్రజాస్వామ్య బద్దంగా గెలవడమే వారు చేసిన తప్పా? సర్పంచ్ గా గెలిచినా అభివృద్ధి పనులు చేస్తే దాడులు చేస్తారా? ఎటూ మీరు అభివృద్ధి చేయరు, చేసే వారిని ఆపడం సిగ్గుచేటు. దళిత, మహిళ హోం మంత్రిని ఉత్సవ విగ్రహంలా మార్చేశారు. ఆమె సొంత జిల్లాల్లోనే ఇలాంటి దాడులు జరుగుతున్నా పట్టించుకోకపోవడం హేయం'' అన్నారు. 

''అభివృద్ధి పథంలో ముందుంచాల్సిన రాష్ట్రాన్ని అరాచకాలు, అకృత్యాలు, అన్యాయాల్లో ముందంజలో ఉంచారు. రెండేళ్ల జగన్ రెడ్డి పాలనలో కక్షసాధింపు చర్యలు తప్ప ప్రజలు ఒరిగిందేమి లేదు'' అని మాజీ మంత్రి ఆలపాటి విరుచుకుపడ్డారు.

click me!