వైసీపీ ‘అసెంబ్లీ బహిష్కరణ’ పై టిడిపి ఎదురుదాడి

Published : Oct 27, 2017, 04:13 PM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
వైసీపీ ‘అసెంబ్లీ బహిష్కరణ’ పై టిడిపి ఎదురుదాడి

సారాంశం

వైసీపీ అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయంపై టిడిపి ఎదురుదాడి మొదలుపెట్టంది.   భవిష్యత్తులో జరిగే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని ప్రధాన ప్రతిపక్షం నిర్ణయించిన సంగతి అందరికీ తెలిసిందే కదా? అప్పటి నుండి అధికార టిడిపి మండిపడుతోంది.

వైసీపీ అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయంపై టిడిపి ఎదురుదాడి మొదలుపెట్టంది.  భవిష్యత్తులో జరిగే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని ప్రధాన ప్రతిపక్షం నిర్ణయించిన సంగతి అందరికీ తెలిసిందే కదా? వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన శాసనసభాపక్షం పై నిర్ణయం తీసుకుంది. అప్పటి నుండి అధికార టిడిపి మండిపడుతోంది.

జగన్ పై టిడిపి నేతలు తమ ఇష్టం వచ్చినట్లు ధ్వజమెత్తుతున్నారు. బహుశా ప్రతిపక్ష నేత సభలో లేనపుడు తాము తిట్టటానికి ఎవరూ లేకపోతే ఎలా అనుకున్నదేమో టిడిపి. అందుకే నేరుగా ‘శాసనసభకు రండి’ అని పిలవకుండా ‘జగన్ అసెంబ్లీ నుండి పారిపోయారు’ అని కవ్వింపు డైలాగులు మొదలుపెట్టారు.  

సరే, ఆ విషయాన్ని పక్కనపెడితే అసెంబ్లీని తాము ఎందుకు బహిష్కరిస్తున్నామో వైసీపీ శాసనసభాపక్ష ఉపనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టంగా ప్రకటించారు. అంతేకాకుండా జగన్ ఆధ్వర్యంలో జరిగిన నిర్ణయాన్ని పలువురు వైసీపీ నేతలు మీడియా సమావేశాల్లో కూడా సమర్ధించుకున్నారు.

ఇంతకీ వారి వాదనేంటి ? వైసీపీ తరపున గెలిచిన 21 మంది ఎంఎల్ఏలను చంద్రబాబునాయుడు ప్రలోభాలకు గురిచేసి ఫిరాయింపులకు పాల్పడ్డారని. పైగా నలుగురుకి మంత్రిపదవులను కట్టబెట్టారన్నది రెండో ఆరోపణ. అందుకే వారిచేత రాజీనామాలు చేయించే వరకూ సభలోకి అడుగుపెట్టమని ప్రకటించింది వైసీపీ.

ఇపుడు జరగాల్సిందేంటి? వైసీపీ ఆరోపణలు నిజామా ? కాదా? అన్న విషయమై టిడిపి క్లారిటీ ఇవ్వాలి. వైసీపీ ఎంఎల్ఏలను తాము ప్రలోభాలకు గురిచేయలేదని, తామెవరినీ టిడిపిలోకి చేర్చుకోలేదని అన్నా చెప్పాలి. లేకపోతే వైసీపీ ఆరోపణలు అబద్దాలని అన్నా ఖండించాలి. ఈ రెండింటిలో టిడిపి ఏదీ చేయటం లేదు.

ఫిరాయించిన ఎంఎల్ఏలందరికీ స్వయంగా చంద్రబాబే పచ్చ కండువాలు కప్పి మరీ టిడిపిలోకి ఆహ్వానించిన సంగతి అందరూ చూసిందే. కాబట్టి వైసీపీ ఆరోపణలను ఖండించలేక, వాస్తవాలని అంగీకరించలేక టిడిపి నానా అవస్తలు పడుతోంది.

అందుకనే, వైసీపీ ఆరోపణలను ప్రస్తావించకుండా ‘జగన్ ఆర్ధిక నేరగాడని, జగన్ లాంటి ప్రతిపక్ష నేత ఉండటం ఏపి దురదృష్టమ’న్న ఆవు వ్యాసాన్ని వినిపిస్తున్నారు టిడిపి నేతలు. అసెంబ్లీ సమావేశాలను ఎగ్గొంటేందుకే జగన్ పాదయాత్రను పెట్టుకున్నాడంటూ ఎదురుదాడులకు దిగుతున్నారు.

అసెంబ్లీ సమావేశాల తేదీ నిర్ణయమైంది ఎప్పుడు? జగన్ తన పాదయాత్రను ప్రకటించిందెప్పుడు? అన్న కనీస ఆలోచన కూడా టిడిపి నేతల్లో లోపించటం ఆశ్చర్యంగా ఉంది. పోనీ వైసీపీ అసెంబ్లీకి ఎందుకు రావాలో కూడా టిడిపి చెప్పలేని స్ధితిలో ఉండటం విడ్డూరంగా ఉంది.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu Speech | సెమీ క్రిస్మస్ వేడుకల్లో చంద్రబాబు నాయుడు | Asianet News Telugu
Kandula Durgesh Super Speech: ప్రతీ మాట ప్రజా సంక్షేమం కోసమే మాట్లాడాలి | Asianet News Telugu