
అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ (tdp) నిర్ణయించింది. ఏపీ అసెంబ్లీకి హాజరయ్యేందుకు టీడీఎల్పీ (tdlp meeting) మొగ్గు చూపడంతో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు (chandrababu naidu) ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే చంద్రబాబు మినహా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి వెళ్లనున్నారు. సభకు వెళ్లకూడదని పొలిట్‌బ్యూరో నిర్ణయించినప్పటికీ ఆ నిర్ణయాన్ని కాదని అసెంబ్లీకి వెళ్లేందుకు టీడీపీఎల్పీ సభ్యులు ఆసక్తి చూపించారు.
అంతకుముందు సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలా? వద్దా? అనే అంశంపై గత కొన్ని రోజులుగా టీడీపీలో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో శనివారం మధ్యాహ్నం పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన వర్చువల్‌గా సమావేశమైన టీడీపీ శాసనసభాపక్షం దీనిపై స్పష్టత ఇచ్చింది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలకు చంద్రబాబు మినహా మిగిలిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కావాలని నిర్ణయించారు. సభకు హాజరుకాకుంటే ప్రత్యామ్నాయ కార్యక్రమాలపై తొలుత ఈ భేటీలో చర్చ జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా బడ్జెట్ సమావేశాలకు వెళ్లాలని, చర్చలో పాల్గొనాలని మాజీ మంత్రి, సీనియర్ నేత యనమల రామకృష్ణుడు (yanamala rama krishnudu) సూచించారు. ఈ నేపథ్యంలో సీనియర్ నేతల సూచనల మేరకు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాల్సిందేనని నిర్ణయించారు.
మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు (Andhra Pradesh Assembly budget session ) ముహుర్తం ఖారారు అయింది. మార్చి 7వ తేదీన ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించనున్నారు. మార్చి 8న ఇటీవల గుండెపోటుతో మరణించిన పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి అసెంబ్లీ సంతాప తీర్మానం చేసి నివాళులర్పించనుంది. మార్చి 11న ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సభలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మార్చి 7వ తేదీన అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు.
ఇక, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్ భారతి దంపతులు రాజ్‌భవన్‌లో సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. దాదాపు అరగంట పాటు పలు అంశాలపై గవర్నర్, సీఎం చర్చించారు. త్వరలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ గవర్నర్ దృష్టికి తీసుకువచ్చి ఆయన అనుమతి తీసుకున్నారు. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించాలని గవర్నర్‌ను ఆహ్వానించారు. అలాగే ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్ విభజన ప్రక్రియ గురించి గవర్నర్ బిశ్వ భూషణ్‌కు సీఎం జగన్ వివరించారు. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా జిల్లాల పునర్ విభజన జరుగుతుందని, ప్రజల నుండి వినతులను స్వీకరించి ఆమోద యోగ్యమైన రీతిలో నూతన జిల్లాలను ఆవిష్కరించనున్నామని తెలిపారు