
తెలుగుదేశంపార్టీలో టెన్షన్ మొదలైంది. అమిత్ షా అపాయింట్మెంట్ కావాలని టిడిపి అడిగినా అమిత్ నుండి ఇంతవరకూ ఎటువంటి సమాధానం రాలేదట. తెలంగాణా పర్యటనలో ఉన్న అమిత్ ను హైదరాబాద్ లో కలిసేందుకు చంద్రబాబునాయుడు అపాయింట్మెంట్ కావాలని కబురు చేసారట. తెలంగాణాలో మూడు రోజుల పర్యటన ముగించుకుని ఎటూ అమిత్ విజయవాడకే వస్తారు.
ఈ నెల 25న విజయవాడలో అమిత్ షా బూత్ లెవల్ అధ్యక్షులతో సమావేశం జరుగుతోంది. కాబట్టి చంద్రబాబు విజయవాడలోనే కలవచ్చు. అయితే, బుధవారం అమిత్ హైదరాబాద్ లోనే ఉంటారు. మినీమహానాడులో పాల్గొనేందుకు చంద్రబాబు కూడా హైదరాబాద్ కు వస్తున్నారు. ఎటుతిరిగీ ఇద్దరూ హైదరాబాద్ లోనే ఉండబోతున్నారు కాబట్టి ఇక్కడే కలిస్తే పోలా అని చంద్రబాబు అనుకున్నారట.
అయితే, చంద్రబాబు నుండి వచ్చిన ప్రతిపాదనకు అమిత్ షా ఇంత వరకూ సమాధానం ఇవ్వలేదు. పైగా చంద్రబాబును చాలా లైట్ గా తీసుకున్నారట. ఎందుకంటే, ప్రధానమంత్రి-జగన్ భేటీపై మంత్రులు, నేతలు తమ ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేసారు. మొత్తం ఎపిసోడంతా అమిత్ షా, ప్రధాని వద్దకు చేరిందట. సరే కారణాలేదైనా గానీ చంద్రబాబుకు అపాయింట్మెంట్ విషయంలో అమిత్ ఇప్పటి వరకూ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదట.
దానికితోడు తెలంగాణాలో టిడిపితో పొత్తు విషయమై మాట్లాడుతూ, ఏపిలో పొత్తుందని మాత్రం చెప్పారు. తెలంగాణా విషయాన్ని ప్రస్తావించగా ఇప్పటికి ఇంత వరకే చెప్పదలుచుకున్నట్లు సమాధానం ఇవ్వంట గమనార్హం. మరి రాత్రి హైదరాబాద్ కు వచ్చిన తర్వాతేమైనా మాట్లాడుతారేమో చూడాలి.