
తెలుగుదేశంపార్టీలో వైసీపీ బాగానే వేడి పుట్టించింది. రెండు రోజుల ప్లీనరిలో చివరి రోజున జగన్మోహన్ రెడ్డి చేసిన హామీలపై జనాల్లో చర్చ సంగతి ఎలాగున్నా టిడిపిలో మాత్రం విస్తృతంగా చర్చ జరుగుతున్న విషయం మాత్రం వాస్తవం. ఎందుకంటే, సోమవారం చంద్రబాబు అధ్యక్షతన ఎంపిల సమావేశం జరిగింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు సమావేశమయ్యారు. అయితే, సమావేశంలో ఎక్కువ భాగం జగన్ ఇచ్చిన హామీలపైనే చర్చ జరిగిందట.
స్వయంగా చంద్రబాబే చర్చను లేవదీసారు. జగన్ ఇచ్చిన హామీలేవీ అమలు అయ్యే అవకాశాలు లేవని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అదే విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్ళాలంటూ స్పష్టంగా ఆదేశించారు. పార్టీ శ్రేణుల్లో కూడా అదే విషయాన్ని చెప్పి జనాల్లోకి వెళ్ళాలంటూ చెప్పారు. ఇక, మంత్రులు, పార్టీ నేతల సంగతి చెప్పేదేముంది.
ఎప్పుడైతే జగన్ వేదిక మీదనుండి హామీలిచ్చారో వెంటనే మంత్రులు జగన్ కు వ్యతిరేకంగా మీడియా సమావేశాలు పెట్టడం మొదలుపెట్టారు. ఒకరి తర్వాత మరొకరుగా మొత్తం ఆరుగురు మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఎంఎల్ఏలు వరుసపెట్టి జగన్ విమర్శించటమే పనిగా పెట్టుకున్నారు. అంటే మంత్రుల స్ధామయి నుండి జిల్లాల్లోని క్రిందిస్ధాయి వరకూ జగన్ హామీలపై దుమ్మెత్తిపోయాలన్న ఆదేశాలు వచ్చిన విషయం స్పష్టమవుతోంది.
జగన్ ఇచ్చిన అన్నీ హామీల్లోకి మద్యం విషయంలో ఇచ్చిన హామీపైనే టిడిపిలో ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఒకవైపేమో ప్రభుత్వం వేలాది మద్యం షాపులను, వందలాది బార్లకు లైసెన్సులు మంజూరు చేసింది. ఇంకోవైపు జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్లలోపు బార్లు, వైన్ షాపులను తీసేయాల్సిందని ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం తుంగలో తొక్కేసిన వైనం అందరూ చూసిందే.
మద్యం ఆదాయం కోసం రాష్ట్ర రహదారులన్నింటినీ ప్రభుత్వం జిల్లా రహదారులుగా కుదించేసింది. దాంతో మద్యంపై యావత్ మహిళాలోకం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మొదలుపెట్టటం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. అటువంటి సమయంలో జగన్ ఇచ్చిన హామీపై జనాల్లో చర్చ మొదలైంది. సరే అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు అమలు చేసేది లేనిది తర్వాత తెలుస్తుంది. ముందైతే హామీనిచ్చేసారు, జనాల్లో సానుకూలంగా స్పందనా కనిపిస్తోంది. దాంతో టిడిపి మండిపోతోంది.