ఆ వ్యవసాయ కూలీల కుటుంబాలకూ కోటి రూపాయల పరిహారం: టిడిపి మాజీ ఎమ్మెల్యే డిమాండ్

By Arun Kumar PFirst Published May 16, 2020, 11:39 AM IST
Highlights

విశాఖ గ్యాస్ లీకేజీ మృతుల మాదిరిగానే ప్రకాశం జిల్లా ప్రమాదంలో మృతిచెందిన వ్యవసాయ కూలీల కుటుంబాలకూ కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని టిడిపి మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. 

గుంటూరు: విశాఖ జిల్లా వెంకటాపురంలో ఎల్జీ గ్యాస్ లీక్ ఘటనలో చనిపోయిన వారికి కోటి రూపాయల పరిహారం అందించినట్లే ప్రకాశం జిల్లా ట్రాక్టర్ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం అందించాలని తాడికొండ టీడీపీ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రాణం ఎవరిది అయిన ఒకటేనని... ప్రకాశం జిల్లా  ప్రమాద మృతులకు ప్రభుత్వం రూ.5 లక్షలు పరిహారం ప్రకటించి చేతులు దులుపుకొన్నారని అన్నారు. ''వీరిది కూడా పేద కుటుంబమే కదా అని ముఖ్యమంత్రి గారు'' అని తెలిపారు.  

ఇక ఇవాళ టిడిపి ప్రతినిధి బృందం ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం రాపర్ల గ్రామాన్ని సందర్శించనుంది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ట్రాక్టర్ పై వెళుతూ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురయి మృతిచెందిన వారి కుటుంబాలను ఈ ప్రతినిధి  బృందం పరామర్శించనుంది. మృతులంతా దళితులు, రైతు కూలీలే ఉన్నారు.  

మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో టిడిపి ప్రతినిధి బృందం శనివారం దుర్ఘటన ప్రదేశం సందర్శించనుంది. ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కూడా పరామర్శించనున్నారు టిడిపి నేతలు.

ప్రకాశం జిల్లా నాగులప్పలపాడు మండలం రాపర్ల సమీపంలో మిర్చి కూలీలతో వెళుతున్న ట్రాక్టర్ కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టి ప్రమాదానికి గురయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 9 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో కరెంట్ తీగలు మీద పడటం వల్లే ఇంతటి విషాదం చోటు చేసుకుంది. 

లాక్‌డౌన్ కొనసాగుతున్నా వ్యవసాయ పనులకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించడంతో రాపర్ల సమీప గ్రామాలకు చెందిన కూలీలు ట్రాక్టర్‌పై పనులకు వెళ్లారు.
పనులు ముగించుకుని ట్రాక్టర్‌పై తిరిగి ఇళ్లకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన సమయంలో టాక్టర్లలో దాదాపు 10 నుంచి 15 మంది వరకు వుండగా కొందరు ప్రాణాలతో బయటపడ్డారు. 

click me!