త్యాగానికి గంటా రెడీ: టీడీపీ నేతల టచ్ లోకి రాని అవంతి

By Nagaraju penumalaFirst Published Feb 14, 2019, 1:19 PM IST
Highlights

ఈ పరిణామాలను గమనించిన తెలుగుదేశం పార్టీ మంత్రిర గంటా శ్రీనివాసరావును రంగంలోకి దింపింది. దీంతో అవంతి శ్రీనివాస్ కోసం తాను భీమిలి నియోజకవర్గాన్ని వదులుకోవడానికి సిద్ధమంటూ ప్రకటించారు. మరి గంటా త్యాగంతోనైనా ఎంపీ అవంతి శ్రీనివాస్ అలక వీడుతారా లేక వైసీపీ తీర్థం పుచ్చుకుంటారా అన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.  

విశాఖపట్నం: అనకాపల్లి టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్‌ పార్టీ వీడకుండా ఉండేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయనకు అత్యంత సన్నిహితులను రంగంలోకి దింపినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. 

అవంతి శ్రీనివాస్ ఎవరికి టచ్ లో లేకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చెయ్యడంతో టీడీపీ నేతల బుజ్జగింపులు కూడా బెడసికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి గంటా శ్రీనివాసరావు రంగంలోకి దిగారు. అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ కోసం భీమిలి టికెట్ వదులుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు మంత్రి గంటా శ్రీనివాస్ స్పష్టం చేశారు. 

భీమిలి టికెట్ వల్లే పార్టీ వీడుతున్నారంటే ఆ సీటు తనకు వద్దని గంటా తెగేసి చెప్పారు. ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే అధిష్టానం నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదని తెలుస్తోంది. ఇకపోతే భీమిలి నియోజకవర్గం నుంచి గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 

2009లో అవంతి శ్రీనివాస్ ప్రజారాజ్యం పార్టీ తరుపున భీమిలి నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. ఆ తర్వాత పీఆర్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన నేపథ్యంలో 2014లో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ సమయంలో భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం, విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు.

 చంద్రబాబు నాయుడు అనకాపల్లి ఎంపీగా పోటీ చెయ్యాలని ఆదేశించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అందుకు అంగీకరించారు. అనకాపల్లి ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. అయితే 2019 ఎన్నికల్లోనైనా భీమిలి టికెట్ ఇవ్వాలని చంద్రబాబును కోరారు. 

అందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా ప్రచారం జరిగింది. అయితే భీమిలి నియోజకవర్గంలో మంత్రి గంటా శ్రీనివాసరావుకు ప్రతికూల పరిస్థితి ఉందని 2019 ఎన్నికల్లో పోటీచేస్తే ఓడిపోవడం ఖాయమని చంద్రబాబు చేయించిన సర్వేలో తేలిందని దీనిపై చంద్రబాబు గంటాకు టికెట్ ఇచ్చేది లేదని స్పష్టం చేశారని గతంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. 

ఆ ప్రచారం కాస్త మంత్రి గంటా శ్రీనివాసరావు చెవిన పడటంతో ఆయన అలకపాన్పు ఎక్కారు. చంద్రబాబు నాయుడు విశాఖపట్నం పర్యటనకు వచ్చిన హాజరుకాలేదు. సుమారు వారం రోజులపాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో అధిష్టానం బుజ్జగింపులకు దిగింది. ఆ సమయంలో భీమిలి నియోజకవర్గం గంటా శ్రీనివాసరావుకేనని స్పష్టం చేసింది. 

రాబోయే ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గం నుంచి గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తారని హామీ రావడంతో అలకవీడిన గంటా శ్రీనివాసరావు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఆనాటి నుంచి ఎంపీ అవంతి శ్రీనివాసరావు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. 

భీమిలి టికెట్ తనకు ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పోనీ విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం టికెట్ అయినా ఇవ్వాలని పట్టుబట్టారు. విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గానికి గట్టి పోటీ ఎదురైంది. పార్టీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, మరో కీలక నేత టికెట్ ఆశిస్తున్నారు. 

వారిద్దరిలో ఎవరికో ఒకరికి ఇవ్వాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. దీంతో విశాఖ ఉత్తర నియోజకవర్గం ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించకపోవడంతో అవంతి శ్రీనివాస్ అలకబూనారు. ఆ నాటి నుంచి మెుక్కుబడిగా సమావేశాలకు హాజరవుతున్నారు. 

పార్లమెంట్ సమావేశాలకు కూడా నామ్ వాస్తే అన్నట్లు వచ్చారని సన్నిహితులు చెప్తున్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ ఇస్తామని హామీ ఇవ్వడంతో అవంతి శ్రీనివాస్ పార్టీ మారనున్నారని సమాచారం. 

ఈ పరిణామాలను గమనించిన తెలుగుదేశం పార్టీ మంత్రిర గంటా శ్రీనివాసరావును రంగంలోకి దింపింది. దీంతో అవంతి శ్రీనివాస్ కోసం తాను భీమిలి నియోజకవర్గాన్ని వదులుకోవడానికి సిద్ధమంటూ ప్రకటించారు. మరి గంటా త్యాగంతోనైనా ఎంపీ అవంతి శ్రీనివాస్ అలక వీడుతారా లేక వైసీపీ తీర్థం పుచ్చుకుంటారా అన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.  
 

ఈ వార్తలను కూడా చదవండి

టీడీపీకి అవంతి రాజీనామా, రేపు జగన్‌ను కలిసే అవకాశం

చంద్రబాబుకు మరో షాక్: వైసీపీలోకి అవంతి, ముహూర్తం ఖరారు

చంద్రబాబుకు మరో షాక్: వైసీపీలోకి అవంతి, ముహూర్తం ఖరారు

టీడీపీకి మరోషాక్: వైసీపీలోకి సిట్టింగ్ ఎంపీ..?

click me!