వైసీపీ నేత, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీ వైపు చూస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అందుకు బలం చేకూరుస్తున్నాయి. మైలవరం , పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ ప్రైవేట్‌గా సర్వేలు చేపట్టినట్లుగా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. టికెట్ల కోసం నేతలు లాబీయింగ్ చేస్తున్నారు. టికెట్ దక్కదని సంకేతాలు అందితే చాలు పార్టీ మారేందుకు క్షణం కూడా ఆలోచించడం లేదు. ఇక రాష్ట్ర రాజకీయాలకు గుండెకాయ వంటి కృష్ణా జిల్లాలో ఏ నేత ఏ పార్టీలో వుంటాడో అర్ధం కావడం లేదు. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన కీలక నేతల్లో ఎక్కువ మంది కృష్ణా జిల్లాకు చెందినవారే. రాష్ట్ర రాజకీయాలను శాసించే ప్రధాన సామాజిక వర్గాలకు ఈ జిల్లానే కేంద్రం. అందుకే అన్ని పార్టీలు ఈ జిల్లాకు ప్రాధాన్యతనిస్తాయి.
ఇదిలావుండగా.. వైసీపీ నేత, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీ వైపు చూస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అందుకు బలం చేకూరుస్తున్నాయి. మైలవరం , పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ ప్రైవేట్‌గా సర్వేలు చేపట్టినట్లుగా తెలుస్తోంది. ఈ రెండు చోట్లా పార్టీ అభ్యర్థులుగా వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్లతో సర్వే నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యేగా వున్న వసంత.. తెలుగుదేశంలో చేరుతారని చాలాకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పెనమలూరు నుంచి వైసీపీ అభ్యర్ధిగా, ప్రస్తుత పెడన ఎమ్మెల్యే, మంత్రి జోగి రమేష్‌ను ఆ పార్టీ ఖరారు చేసింది.
దీంతో జోగికి చెక్ పెట్టడానికి టీడీపీ కృష్ణ ప్రసాద్‌ను రంగంలోకి దించాలని భావిస్తోంది. జోగి, వసంత వర్గాల మధ్య ఇప్పటికే మైలవరంలో ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ పంచాయతీ పలుమార్లు తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయం వరకు వెళ్లింది. అయినప్పటికీ వైసీపీ అధిష్టానం చర్యలు తీసుకోకపోవడం కృష్ణ ప్రసాద్ అసంతృప్తిగా వున్నట్లుగా తెలుస్తోంది. ఈ గొడవ జరుగుతున్న సమయంలోనే వసంత కృష్ణప్రసాద్ తండ్రి.. మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
రాష్ట్రంలో కమ్మ వర్గానికి అన్యాయం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పును ఎవరు అడ్డుకోలేక పోవడం విచారకరమని అన్నారు. రాష్ట్ర కేబినెట్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన మంత్రి వసంత నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై వైసీపీలో కలకలం రేగడంతో కృష్ణప్రసాదవ్ స్పందించారు. అమరావతికి మద్దతుగా తన తండ్రి వసంత నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవించడం లేదని వాటిని ఖండిస్తున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పును తన తండ్రి తప్పుపట్టడం తను సమర్థించనని పేర్కొన్నారు. రాజధాని విషయంలో తన వ్యక్తిగత అభిప్రాయం ఎలా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి నిర్ణయమే తనకు శిరోధార్యమని స్పష్టం చేశారు. తన తండ్రి వసంత నాగేశ్వరరావు నోరు చాలా ప్రమాదకరమని, ఎప్పుడూ ఎవరో ఒకరిని ఇరకాటంలో పెట్టడం ఆయన నైజం అని వ్యాఖ్యానించారు.
కొన్నాళ్లు మైలవరం కృష్ణ ప్రసాద్, పెడనలో రమేశ్ ఎవరి పనులు వారు చేసుకుంటూ బిజీగా వుంటున్నారు. అయితే తమపైనా, తమ పార్టీ నేతలపైనా నిత్యం నోరుపారేసుకునే జోగి రమేష్‌ను ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించాలని తెలుగుదేశం పార్టీ కృతనిశ్చయంతో వుంది. ఇప్పటికే పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథి వైసీపీకి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో జోగి రమేష్‌ను అభ్యర్ధికి దించారు జగన్. పార్థసారథి టీడీపీలో చేరినా.. ఆయనను నూజివీడుకు షిప్ట్ చేసేలా మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు చంద్రబాబు. జోగి రమేష్‌పై పీకలదాకా వున్న వసంత కృష్ణ ప్రసాద్ రేపు టీడీపీలో చేరి పెనమలూరు నుంచి పోటీ చేసేలా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్లుగా టాక్.
లేదు .. జోగి రమేష్‌ను మైలవరానికి పంపినా, అక్కడా ఆయనకు ప్రత్యర్ధిగా వసంత కృష్ణ ప్రసాద్‌నే ఖరారు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారట. అందుకే రెండు నియోజకవర్గాల్లో వసంత, దేవినేని ఉమాల పేర్లతో సర్వే చేయిస్తున్నారట. రెండింట్లో ఒకదానిని వసంతకు కేటాయించి, మరో దానిని ఉమాకు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఇదంతా జరగడానికి ముందు.. అసలు వసంత కృష్ణప్రసాద్ వైసీపీని వీడుతారా లేదా అన్నది తెలియాల్సి వుంది. ఆ విషయంపై క్లారిటీ వస్తే అన్ని ప్రచారాలకు చెక్ పడినట్లే.