రాజ్యసభ ఎన్నికలు: వైసీపీ, టీడీపీ బలాబలాలు.. ఆ ఎమ్మెల్యేలపై అనర్హతవేటు పడితే పరిస్థితులు ఏమిటీ?

By Mahesh K  |  First Published Jan 30, 2024, 3:58 PM IST

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వెలువడటానికి క్రితం నుంచే రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయం ముందుకు వచ్చింది. ఈ ఎన్నికల్లో రెబల్ ఎమ్మెల్యేల ఫ్యాక్టర్ పై చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే వైసీపీ, టీడీపీల బలాబలాలు, రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే బలాలు ఎలా మారుతాయి?
 


రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. టీడీపీకి చెందిన కనకమేడల రవీంద్రకుమార్, బీజేపీకి చెందిన సీఎం రమేశ్, వైసీపీకి చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు ఏప్రిల్ నెలలో రిటైర్ కానున్నారు. ఈ మూడు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలోనే ఏ పార్టీకి ఎంతమంది ఎమ్మెల్యేల బలం ఉన్నది? ఏ పార్టీ ఎన్ని రాజ్యసభ సీట్లను గెలుచుకోగలుగుతుందనే చర్చ జరుగుతున్నది. బలాబలాల కంటే కూడా రెబల్ ఎమ్మెల్యేల ఫ్యాక్టర్ కీలకంగా మారింది.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లు, టీడీపీ 23 సీట్లను గెలుచుకుంది. జనసేన నుంచి గెలిచిన రాపాక వరప్రసాద్ వైసీపీ వైపు నిలబడ్డారు. దీంతో వైసీపీ బలం 152కు పెరిగింది. అయితే, ఆ తర్వాత రాజకీయ పరిణామాల్లో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతు ఇచ్చారు. వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీకి మద్దతుగా నిలిచారు. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గతంలో ఇచ్చిన రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. వైసీపీకి చెందిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే రాజీనామా చేశారు.

Latest Videos

రాజ్యసభకు ఎన్నికల విధానం ప్రకారం, ఓటు వేసే అర్హతున్నవారి మొత్తం ఎమ్మెల్యేల సంఖ్యను, ఎన్నికలు జరుగుతున్న రాజ్యసభ స్థానాలతో విభజించి ఒక ఓటు అదనంగా చేర్చితే వచ్చే ఓట్లు (175/(3+1)=44)ఈ ఎన్నికల్లో గెలవడానికి అవసరం. అంటే.. మొత్తం 175 ఎమ్మెల్యేలు మూడు రాజ్యసభ సీట్ల కోసం ఓటింగ్ చేయాలంటే.. ఎంపీగా గెలవాలంటే 44 ఓట్లు పొందాలి.

Also Read: స్పీకర్ నిర్ణయంపై ఉత్కంఠ:ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్న టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ

రెబల్ ఫ్యాక్టర్:

ఒక వేళ ఉభయ పార్టీల రెబల్స్ అయిన 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే.. వారంతా ఓటింగ్‌కు అనర్హులవుతారు. వీరితోపాటు రాజీనామాలు చేసిన గంటా శ్రీనివాసరావు, ఆళ్ల రామకృష్ణారెడ్డిలనూ తీసివేస్తే 165 మంది ఓటింగ్‌లో పాల్గొంటారు. అలాగైతే.. ఒక ఎంపీ అభ్యర్థి కనీసం 41 ఓట్లు గెలుచుకోవాలి. వైసీపీ వద్ద ఐదుగురు ఎమ్మెల్యేల సంఖ్య తగ్గి 147 మంది బలంగా ఉంటుంది. రెబల్స్ అందరిపై అనర్హత వేటు పడితే వైసీపీ సులువుగా మూడు రాజ్యసభ స్థానాలను గెలుచుకోగలదు. ఒక వేళ రెబల్స్‌పై వేటు పడకున్నా.. మూడు రాజ్యసభ స్థానాలను గెలుచుకోవడానికి అవసరమైన బలంగా వైసీపీ వద్ద ఉన్నది. రెబల్స్ టీడీపీకి అనుకూలంగా మారినా.. వైసీపీకి నష్టమేమీ ఉండదు. అసెంబ్లీ ఎన్నికల ముంగిట్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో పొరపాట్లు జరగరాదని వైసీపీ జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఇదే కారణంతో ప్రతిపక్షం ఎలాగైనా ఒక్క సీటు గెలవాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టే అవకాశాలూ ఉంటాయి. అందుకే క్రాస్ వోటింగ్ జరగకుండా, ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశం లేకుండా వైసీపీ జాగ్రత్త పడుతున్నది.

click me!