అచ్చెన్నాయుడు, జెసి అరెస్టులపై...హెచ్చార్సీని ఆశ్రయించిన టిడిపి

By Arun Kumar PFirst Published Jun 17, 2020, 1:09 PM IST
Highlights

ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిల అరెస్టులపై తాజాగా జాతీయ మానవ హక్కుల కమిషన్ కు తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేశారు. 

అమరావతి: ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులను ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేస్తోందంటూ టిడిపి నాయకులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిల అరెస్టులపై తాజాగా జాతీయ మానవ హక్కుల కమిషన్ కు తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేశారు.  అచ్చెన్నాయుడు అరెస్టుపై టీడీఎల్పీ ఉపనేత రామానాయుడు, జేసీ కుటుంబ సభ్యులు అరెస్టుపై ఎమ్మెల్సీ గౌరివాణి శ్రీనివాసులు హెచ్చార్సీకి ఫిర్యాదు చేశారు. 

వైసిపి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఫ్యాక్షనిజాన్ని సాగిస్తోందని... ప్రతీకార చర్యలతో  మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజకీయ ప్రత్యర్థులైన తెలుగుదేశం నేతలు, క్యాడర్ పై హింస కొనసాగిస్తోందని...తప్పుడు కేసులు పెట్టి బెదిరిస్తున్నారని అన్నారు. ఇందులో భాగంగానే అచ్చెన్నాయుడిని అక్రమంగా అరెస్టు చేశారని హెచ్చార్సీకి తెలిపారు.

read more   మండలిలో ''గడ్డం''పై వివాదం... ఛైర్మన్ షరీఫ్, చంద్రబాబులూ రౌడీలేనా: మంత్రి అనిల్

''అచ్చెన్నాయుడు అరెస్టులో వైసిపి ఆదేశాలకు అనుగుణంగా ఎసిబి అధికారులు వ్యవహరించారు. కనీసం కుటుంబ సభ్యులకు కనీస సమాచారం ఇవ్వలేదు. శస్త్రచికిత్స గాయంతో బాధపడుతున్న ఆయనను శ్రీకాకుళం నుండి దాదాపు 600 కిలోమీటర్లు రోడ్డు మార్గం ద్వారా ప్రయాణింపచేశారు. ఆయన అరెస్టు అమానుషమే కాకుండా సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉంది'' అని ఫిర్యాదులో  పేర్కొన్నారు. 

''వైసిపి వ్యూహాత్మకంగా నాయకులను అరెస్టులు చేయించి ప్రతిపక్షాలపై కక్ష సాధించింది. తమ ఒత్తిళ్ళకు లొంగని  ప్రతిపక్ష పార్టీ నేతలపై ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయిస్తోంది. ఇందులో భాగంగానే మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను అరెస్టు చేశారు. ప్రతీకారం తీర్చుకోవాలనే తపనతోనే ఈ అరెస్టులు జరిగాయి'' అని వివరించారు. 

రాష్ట్రంలో జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనలను అడ్డుకోవాలని... ప్రతిపక్ష నాయకుల అరెస్టుల వ్యవహారంలో  జోక్యం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని టిడిపి నేతలు హెచ్చార్సీకి విజ్ఞప్తి చేశారు. 

 

click me!