మండలికి కీలక బిల్లులు, టీడీపీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ దూరం: చంద్రబాబు ఫోన్

By narsimha lodeFirst Published Jun 17, 2020, 12:55 PM IST
Highlights

మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ కు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు బుధవారం నాడు ఫోన్ చేశారు.  శాసనమండలిలో సీఆర్‌డీఏ రద్దు బిల్లు,  ఏపీ పాలనా వికేంద్రీకరణ బిల్లులను అడ్డుకొనే వ్యూహాంతో టీడీపీ ముందుకు వెళ్తోంది. 


అమరావతి:మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ కు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు బుధవారం నాడు ఫోన్ చేశారు.  శాసనమండలిలో సీఆర్‌డీఏ రద్దు బిల్లు,  ఏపీ పాలనా వికేంద్రీకరణ బిల్లులను అడ్డుకొనే వ్యూహాంతో టీడీపీ ముందుకు వెళ్తోంది. ఈ తరుణంలో మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ తో బాబు ఫోన్ లో మాట్లాడారని సమాచారం.

గత ఏడాది జనవరి 20వ తేదీన ఏపీ అసెంబ్లీలో ఈ రెండు బిల్లులు పాసయ్యాయి. ఏపీ శాసనమండలిలో ఈ రెండు బిల్లులను ప్రవేశపెట్టారు. ఈ రెండు బిల్లులను టీడీపీ సభ్యులు సెలెక్ట్ కమిటికి పంపాలని పట్టుబట్టారు. సెలెక్ట్ కమిటిని ఏర్పాటు చేయాలని కూడ చైర్మెన్ ఆదేశాలు జారీ చేశారు. కానీ ఇంతవరకు సెలెక్ట్ కమిటి ఏర్పాటు కాకపోవడంపై టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

గత జనవరిలోనే టీడీపీ నిర్ణయానికి వ్యతిరేకంగా శాసనమండలిలో ఆ పార్టీకి చెందిన పోతుల సునీత, శివానందరెడ్డిలు ఓటు చేశారు. మరో ఎమ్మెల్సీ శమంతకమణి శాసనమండలికి గైరాజరయ్యారు. 

పోతుల సునీత, శివానందరెడ్డి, శమంతకమణిలు టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు.  కేఈ ప్రభాకర్ కూడ గతంలోనే టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. అప్పటి నుండి ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

ప్రస్తుతం మరోసారి శాసనమండలి ముందుకు సీఆర్‌డీఏ రద్దు బిల్లు, ఏపీ పాలనా వికేంద్రీకరణ బిల్లులు వచ్చాయి.  ఈ తరుణంలో అధికార పార్టీని ఇరుకున  పెట్టేందుకు గాను  టీడీపీ నాయకత్వం జాగ్రత్తలు తీసుకొంటుంది.

వైసీపీలో చేరిన ముగ్గురు ఎమ్మెల్సీలకు టీడీపీ విప్ జారీ చేసింది. శాసనమండలికి కచ్చితంగా హాజరుకావాలని టీడీపీ ఈ ముగ్గురు ఎమ్మెల్సీలకు విప్ జారీ చేసింది.

పార్టీకి దూరంగా ఉంటున్న మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ కు చంద్రబాబు ఇవాళ ఫోన్ చేశారు. చిన్న చిన్న సమస్యలే తప్ప.. పార్టీతో ఇబ్బందులు లేవని కేఈ ప్రభాకర్ పార్టీ చీఫ్ చంద్రబాబుకు చెప్పినట్టుగా సమాచారం. 

వైసీపీ కండువా కప్పుకొన్న ముగ్గురు ఎమ్మెల్సీలు కూడ టీడీపీ జారీ చేసిన విప్ ను ధిక్కరిస్తే వారిపై చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది.ఇప్పటికే పోతుల సునీత, శివానందరెడ్డిలపై టీడీపీ ఫిర్యాదు చేసింది. రెండు సార్లు విచారణకు వీరిద్దరూ హాజరుకాలేదు. 

click me!