జగన్ సర్కార్ విద్యుత్ సంస్కరణలకు తూట్లు పొడిచిందని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ స్లాబులను మార్చారని ఆయన చెప్పారు.
అమరావతి:జగన్ సర్కార్ విద్యుత్ సంస్కరణలకు తూట్లు పొడిచిందని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ స్లాబులను మార్చారని ఆయన చెప్పారు.
బుధవారం నాడు టీడీపీ చీఫ్ చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.డాక్టర్ సుధాకర్ ను ప్రభుత్వం వేధింపులకు గురి చేసిందన్నారు. మాస్కుల గురించి అడిగినందుకు ఆయనను సస్పెండ్ చేశారన్నారు. డాక్టర్ సుధాకర్ విషయంలో తమ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.
ప్రభుత్వ తప్పులు ఎత్తిచూపితే కేసులు పెడుతున్నారన్నారు. ఎల్జీ పాలీమర్స్ విషయంలో రంగనాయకమ్మ సోషల్ మీడియాలో పోస్టు పెడితే కేసు పెడతారా అని ఆయన ప్రశ్నించారు. కరోనా విషయంలో ఏపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందన్నారు.
విద్యుత్ చార్జీల పెంపును బాబు తీవ్రంగా ఖండించారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోనూ, అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడ విద్యుత్ సంస్కరణలను తాను తీసుకొచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
రాజకీయపరంగా ఇబ్బందులను ఎదుర్కొంటూ కూడ తాను విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చినట్టుగా చెప్పారు.సంస్కరణలు తీసుకొచ్చి నాణ్యమైన విద్యుత్ ను వినియోగదారులకు అందించామన్నారు బాబు.
2014లో అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తాను సీఎంగా ఎన్నికయ్యే నాటికి రాష్ట్రంలో విద్యుత్ కొరత తీవ్రంగా ఉందన్నారు. రెండు మాసాల్లో రాష్ట్రంలో విద్యుత్ కొరతను అధిగమించినట్టుగా చెప్పారు. ఇప్పటివరకు రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేకుండా చూశామన్నారు.
also read:డాక్టర్ సుధాకర్ వాంగ్మూలం రేపటి లోపుగా నమోదు చేయాలి: ఏపీ హైకోర్టు ఆదేశం
విద్యుత్ సంస్కరణలకు తూట్లు పొడిచే విధంగా జగన్ సర్కార్ వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. 9529 మెగావాట్ల నుండి 19680 మెగావాట్లకు విద్యుత్ ఉత్పత్తిని పెంచినట్టుగా చంద్రబాబు ఈ సందర్భంగా ప్రస్తావించారు. పవన, సౌర విద్యుత్ ఉత్పత్తికి రాష్ట్రంలో తొలిసారిగా శ్రీకారం చుట్టిన ఘనత తమ ప్రభుత్వానిదేనని ఆయన చెప్పారు.
ఈ కారణాలతోనే తాను ఐదేళ్ల పాటు విద్యుత్ ఛార్జీలు పెంచలేదన్నారు. భవిష్యత్తులో కూడ ఛార్జీలు పెంచనని చెబుతూనే ఇంకా విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని ప్రకటించారు.