సీఎం జగన్ ఉన్మాదం... వీరికంటే తాలిబన్లే నయం: చంద్రబాబు సీరియస్ (వీడియో)

By Arun Kumar PFirst Published Sep 2, 2021, 5:08 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టించి ఉన్మాదిలా రాక్షసానందం పొందుతున్నాడని... వైసిపి నాయకుల కంటే తాలిబన్లే నయమని టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 

అమరావతి: జగన్ రెడ్డి పాలనతో రాష్ట్రం విధ్వంసానికి గురవుతోందని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడిన తొలి ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం ఎంతో కష్టపడి తీసుకొచ్చిన ఏపీ బ్రాండ్ ను కోల్పోయామని... వైసిపి రెండేళ్ల పాలనలోనే రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని చంద్రబాబు పేర్కొన్నారు. 

తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఇంఛార్జ్ లు, ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కూడా తప్పైపోతోందన్నారు. 

''జగన్ రెడ్డి అక్రమాలు, అవినీతి చేసినా చూస్తూ ఊరుకోవాలా? రాష్ట్ర అప్పులు రూ.5.35 లక్షల కోట్లకు చేరాయి. జగన్ రెడ్డి వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా రాక్షసంగా వ్యవహరిస్తున్నారు. నేడు ఉపాధి హామీ పథకంలో మస్టర్ల కుంభకోణానికి పాల్పడుతున్నారు'' అని ఆరోపించారు. 

వీడియో

''విశాఖలో ఏ-2 విజయసాయిరెడ్డి భూఅక్రమాలకు పాల్పడుతున్నారు. అసలు విశాఖలో విజయసాయిరెడ్డికి ఏం పని? దళారిగా పనిచేసే సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు డీజీపీ మాదిరిగా పనిచేస్తూ అందరినీ బెదిరిస్తున్నారు. వైసీపీ నేతల కంటే తాలిబన్లే నయం'' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

read more  టీడీపీ ఆఫీస్‌కి బుచ్చయ్య చౌదరి: చంద్రబాబుతో భేటీ

''ఏం చేసినా వీరి ఆటలు సాగుతాయనే విధంగా వ్యవహరిస్తున్నారు. పోలీసులు చట్టాలను గౌరవించాలి. టీడీపీ నేతలపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడాన్ని మానుకోవాలి. తప్పుడు కేసులు నమోదు చేసిన పోలీసులపై ప్రైవేటు కేసులు వేస్తాం. ప్రజాస్వామ్యంలో ఏకపక్ష విధానాలు సరికాదు. జగన్ రెడ్డి అరాచక విధానాలకు కొంతమంది పోలీసులు బానిసలయ్యారు. ఇది సొంత రాజ్యాంగం కాదు.. భారత రాజ్యాంగం ప్రకారం వ్యవహరించాలి'' అని చంద్రబాబు హెచ్చరించారు. 

''రాష్ట్రంలో గత రెండేళ్లుగా ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకులను రకరకాలుగా వేధించారు. ప్రతిపక్షాలపై కేసులు పెట్టి ఉన్మాదిలా పైశాచిక ఆనందం పొందేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారు. తప్పుడు కేసులు, గృహ నిర్బంధాలు చేస్తున్నారు. నిన్నటికి నిన్న పెట్రోల్ డీజిల్ ధరలపై ఆందోళన చేసిన చింతమనేని ప్రభాకర్ విశాఖలో దేవాలయానికి వెళ్తే చింతపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనుమానాస్పదంగా తిరుగుతున్నారంటూ గంజాయి స్మగ్లింగ్ కేసు పెట్టే ప్రయత్నం చేశారు. మాజీ ఎమ్మెల్యేను కూడా గుర్తుపట్టలేనంత దుస్థితిలో పోలీసులున్నారా.?'' అని మండిపడ్డారు. 

''ఉపాధి హామీ పనుల బిల్లులు చెల్లించకుండా.. పనులు చేసిన టీడీపీ నేతల్ని వేధిస్తున్నారు. రెండేళ్ల పోరాటం తర్వాత బిల్లుల్ని చెల్లించేలా విజయం సాధించాం. చివరికి ఐఏఎస్ అధికారుల్ని కోర్టుకు పిలిచిన తర్వాత కూడా బిల్లులు చెల్లించకపోయేసరికి జైల్లో పెడతామని కోర్టులు హెచ్చరించే పరిస్థితి తీసుకొచ్చారు. నాడు ప్రజలకు మేలు చేయాలని ప్రయత్నాలు చేస్తే.. దాన్ని కూడా ఈ ముఖ్యమంత్రి రాజకీయం చేసి ఇబ్బందులు పెడుతున్నారు'' అన్నారు. 

''మనం ప్రజాబలంతో ప్రతిఘటించాలి. ప్రజలు కూడా తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. చేసిన పాపాలు బయటపడతాయనే భయంతో తప్పుడు కేసులు పెడుతున్నారు. అక్రమ అరెస్టులతో అడ్డుకుంటున్నారు. ఎస్సెస్సీ బోర్డు డైరెక్టర్ మహిళా ఉద్యోగులను వేధించే పరిస్థితి. ప్రజా చైతన్యమే సమస్యలకు పరిష్కారం. భవిష్యత్ లో జగన్ రెడ్డి విధ్వంస విధానాలపై తిరుగుబాటు తప్పదు. తల్లికి, చెల్లికి న్యాయం చేయలేనివారు రాష్ట్రానికి ఏం చేస్తారు? బాబాయిని ఎవరు చంపారో తేల్చలేని వారు రాష్ట్రానికి ఏం చేస్తారు? ప్రభుత్వ వైఫల్యాలపై టీడీపీ పెద్దఎత్తున పోరాటాలు చేస్తుంది. సమైక్య శక్తిగా అందరం పోరాడదాం'' అని చంద్రబాబు పిలుపునిచ్చారు. 


 

click me!