కర్నూల్ జిల్లాలో తృటిలో తప్పిన ప్రమాదం: డోన్ ఫ్లైఓవర్ రెయిలింగ్ గోడను ఢీకొట్టిన బస్సు, ముగ్గురికి గాయాలు

By narsimha lodeFirst Published Sep 2, 2021, 5:07 PM IST
Highlights

కర్నూల్ జిల్లాలోని డోన్ ఫ్లైఓవర్ పై గురువారం నాడు ప్రమాదం చోటు చేసుకొంది.ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి.  ఫై్ఓవర్ రెయిలింగ్ ను ఢీకొని బస్సు నిలిచిపోయింది. కారును తప్పించబోయి బస్సు రెయిలింగ్ ను ఢీకొంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

కర్నూల్: కర్నూల్ జిల్లాలో గురువారం నాడు పెద్ద ప్రమాదం తప్పింది. డోన్‌లో ఫ్లైఓవర్ పై సేఫ్టీ వాల్ ను బస్సు ఢీకొనడంతో పెచ్చులు కింద పడడంతో ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు.డోన్‌ పట్టణంలో  రైల్వే ట్రాక్ ఉంది. దీంతో రైళ్లు వెళ్లే సమయంలో గేటు వేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో డోన్ లో  ఫ్లైఓవర్ ను నిర్మించారు. ఇదే ప్రాంతంలో మార్కెట్ ఉంది.

అనంతపురం నుండి కర్నూల్ వైపు సూపర్ లగ్జరీ బస్సు వస్తోంది. ఈ బస్సుకు ఎదురుగా ఆటో, కారు వస్తున్నాయి. ఆటోను ఓవర్ టేక్ చేసి కారు ముందుకు వచ్చే క్రమంలో  డోన్ ఫ్లైఓవర్ పై ఆర్టీసీ బస్సు కు ఎదురుగా వచ్చింది. దీంతో  కారును తప్పించే క్రమంలో బస్సు డ్రైవర్ బస్సును ఎడమ వైపుకు తిప్పాడు.దీంతో ఫ్లైఓవర్ రెయిలింగ్ గోడ(సేఫ్టీవాల్) కు ఢీకొని బస్సు ఆగిపోయింది. బస్సు ఓ చక్రం గాలిలో ఉంది. బస్సులోని కొంత బాగం రెయిలింగ్ లో ఇరుక్కుపోయింది. దీంతో రెయిలింగ్ పెచ్చులు కిందపడ్డాయి.

అదే సమయంలో స్కూల్ కు బైక్ పై వెళ్తున్న ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వంశీకృష్ణ,  ఆదిత్య, నూర్ భాషా లకు గాయాలు కావడంతో స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు.  ఈ ముగ్గురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆయనను కర్నూల్ ఆసుపత్రికి తరలించారు. రెయిలింగ్ గోడను తట్టుకొని బస్సు నిలిచిపోకపోతే పెద్ద ప్రమాదం జరిగేది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 25 మంది ప్రయాణీకులున్నారు. 

click me!