
చిత్తూరు: టిడిపి జాతీయ అద్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మూడు రోజుల కుప్పం పర్యటన నేటి(గురువారం)తో ప్రారంబమయ్యింది. ఇవాళ ఉదయమే విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లిన చంద్రబాబు అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కుప్పం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు కుప్పంలో ఘన స్వాగతం లభించింది. టిడిపి నాయకులు, కార్యకర్తలతో పాటు స్థానిక ప్రజలు కూడా చంద్రబాబు రోడ్ షోలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... స్థానిక టిడిపి నాయకులకు ధైర్యం నూరిపోశారు. అధికార పార్టీ నాయకులు, స్థానిక పోలీసులను బెదిరింపులకు టిడిపి నాయకులు, కార్యకర్తలు అధైర్యపడవద్దని అన్నారు. మరో ఏడాదిన్నరలో జరిగే జమిలి ఎన్నికలు జరుగుతాయని... అధికారంలోకి వచ్చాక వీరికి చక్ర వడ్డీతో చెల్లిస్తానని హెచ్చరించారు. ఇప్పుడు జరుగుతున్నవన్నీ వ్రాసి పెడుతున్నానని.. మీరు కూడా వ్రాసి పెట్టండని టిడిపి శ్రేణులకు చంద్రబాబు సూచించారు.
read more నామినేషన్ వేస్తే చంపేశారు.. గెలిస్తే చంపేశారు.. చివరకు ఏజెంట్లనూ చంపేశారు: లోకేష్ ఆవేధన
''నేను పులివెందులకు సాగునీరు ఇచ్చాను... జగన్ కుప్పంకు హంద్రీనివా నీరు ఎందుకు ఇవ్వరు? దోపిడీ రాజకీయలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తూ తద్వారా లబ్ది పొందుతున్నారు. భయపెట్టి ఓట్లు వేసుకోవడం నీచమైన పని. ప్రజలు తిరుగుబాటు చేస్తారు అప్పుడు పరుగులు పెడతారు'' అనిహెచ్చరించారు.
''నేను అనుకోని ఉంటే ఈ పుంగనూరు నేత ఎమ్మెల్యేగా కూడా గెలిచేవాడు కాదు. పుంగనూరు మహానేత కాదు మహా మేతగాడు. అయినా కుప్పంలో మీ పెత్తనం ఏమిటి. ఖబర్దార్... నేను అనుకుంటే నీవు 22ఏళ్ల తెదేపా హయాంలో రాజకీయల్లో కొనసాగేవాడివా'' అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు.