పోటీగా నామినేషన్... దళిత మహిళలపై వైసిపి గూండాల అసభ్య ప్రవర్తన: చంద్రబాబు సీరియస్

By Arun Kumar PFirst Published Feb 19, 2021, 10:50 AM IST
Highlights

ప్రజాస్వామ్యంలో ఎవరికైనా స్వేచ్ఛగా పోటీచేసే హక్కు ఉందనే విషయాన్ని జగన్ రెడ్డి, వైసీపీ నేతలు గుర్తించాలని టిడిపి చీఫ్ చంద్రబాబు సూచించారు.

అమరావతి: పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తామంటూ రాజధాని పరిధిలోని ఎస్సీలపై వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేయడం సీఎం జగన్ రెడ్డి ఫ్యాక్షన్ పాలనకు నిదర్శనమని టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా స్వేచ్ఛగా పోటీచేసే హక్కు ఉందనే విషయాన్ని జగన్ రెడ్డి, వైసీపీ నేతలు గుర్తించాలని సూచించారు.

''పెద్దకూరపాడు నియోజకవర్గంలోని లింగాపురం గ్రామ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ వేశారనే కోపంతో దాడి అత్యంత హేయం. దళితులు రాజకీయాల్లోకి రాకూడదా? పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయకూడదా.? వైసీపీ నేతల దాడి ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ. ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించలేని పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. ప్రజా మద్దతు ఉందని చెప్పుకోవడం సిగ్గుచేటు'' అని చంద్రబాబు విమర్శించారు. 

read more   పంచాయతీ: దమ్ముంటే పోలీసులు లేకుండా గెలవండి.. వైసీపీ నేతలకు కోట్ల సవాల్

''వైసీపీ గూండాలను గ్రామాల మీదకు వదిలి బడుగు బలహీన వర్గాల ప్రజలపై దాడులకు పాల్పడుతారా.? ఇళ్లకు వెళ్లి బెదిరించడమే కాకుండా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం అత్యంత హేయం. కులం పేరుతో దూషించి, రాళ్లతో దాడి చేసిన వైసీపీ నేతలపై ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయకపోవడం పోలీసు వ్యవస్థను ఎంతగా నీరుగారుస్తున్నారో అర్ధమవుతోంది. ఫిర్యాదు చేసి నిందితులను అరెస్టు చేయాలని అర్ధరాత్రి నుంచి స్టేషన్ బయటే పడిగాపులు కాస్తున్నా పోలీసులు పట్టించుకోకపోవడం పోలీసు వ్యవస్థ పనితీరుకు నిదర్శనం. ఇప్పటికైనా పోలీసులు దాడికి పాల్పడిన వైసీపీ నేతలపై కేసు నమోదు చేయాలి. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలి'' అని చంద్రబాబు సూచించారు. 
 

click me!