భారత సైన్యం తిరుపతిలో నిర్వహిస్తున్న ‘స్వర్ణిమ్ విజయ్ వర్ష్’ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏపీ సీఎం జగన్ పాల్గొన్నారు.
తిరుపతి: బంగ్లాదేశ్ విముక్తి పోరాటం (ఇండో పాక్ వార్)కు 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా భారత సైన్యం తిరుపతిలో ‘స్వర్ణిమ్ విజయ్ వర్ష్’కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ సీఎం జగన్ సైన్యంలో రాష్ట్రానికి చెందిన వీర జవాన్లకు అత్యధిక సహాయం ప్రకటించారు.
''మన రాష్ట్ర సాహస యోధులకు లేదా వారి కుటుంబ సభ్యులకు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏమి ఇస్తున్నామని రివ్యూ చేశాక, ఇక మీదట వారికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న గ్యాలంట్రీ అవార్డులకు తోడు పరమవీర చక్ర, అశోక చక్రలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు రూ.10 లక్షలు ఇస్తున్నాం. దాన్ని పది రెట్లు పెంచి కోటి రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే మహావీర చక్ర, కీర్తి చక్ర అవార్డులు పొందిన వారికి ఇప్పటి వరకు రూ.8 లక్షలు ఇస్తున్నాం. ఆ మొత్తాన్ని పది రెట్లు పెంచి ఇక నుంచి వారికి రూ.80 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా వీర చక్ర, శౌర్య చక్ర అవార్డులు పొందిన సైనికులు లేదా వారి కుటుంబ సభ్యులకు ఇప్పటి వరకు రూ.6 లక్షలు ఇస్తున్న వారికి ఇక నుంచి రూ.60 లక్షలు ఇస్తాం. సరిహద్దుల్లో పోరాడి వీర మరణం పొందిన సైనికులకు ప్రభుత్వం ఇప్పటికే రూ.50 లక్షలు ఇస్తోంది. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని అమలు చేస్తోంది'' అని జగన్ తెలిపారు.
undefined
''దేశం కోసం సరిహద్దుల్లో కాపలా కాస్తూ మన భూభాగాన్ని, మనల్ని కంటికి రెప్పలా కాచుకుంటున్న ఈ సాహస యోధుల గురించి, మన సైనికుల గురించి ఎంత చెప్పినా కూడా అది తక్కువే అవుతుంది. అటువంటి మన వీరులకు, త్యాగధనులకు, భారత మాత ముద్దుబిడ్డలకు మనం ఏం ఇవ్వగలం? ఇదే అంశం మీద మనం ఏం చేశాము?. అని చెప్పి ఆలోచన చేశాము ఇక్కడికి రాక ముందు. అందులో భాగంగానే భారీగా ఆర్థిక సాయాన్ని పెంచాం'' అని జగన్ తెలిపారు.
read more స్వర్ణిమ్ విజయ్ వర్ష్: రిటైర్డ్ మేజర్ వేణుగోపాల్‌ను సత్కరించిన జగన్
బంగ్లాదేశ్ విముక్తి కోసం పోరాడిన యోధులను గుర్తిస్తూ పరమ వీర చక్ర, మహావీర చక్ర అవార్డులు పొందిన వారి గ్రామాల మీదుగా విజయ జ్యోతి (దివిటీ) కొనసాగుతోంది. నాటి యుద్ధంలో పాల్గొని మహావీర చక్ర బిరుదు పొందిన మన తెలుగు తేజం రిటైర్డ్ మేజర్ జనరల్ వేణుగోపాల్ గారిని వెతుక్కుంటూ ఈ విజయ జ్యోతి మన తిరుపతికి వచ్చింది. ఈ విజయ జ్యోతిని అందుకున్న సీఎం జగన్, దాన్ని వేదికపై ఏర్పాటు చేసిన ప్లాట్‌ఫామ్‌పై ఉంచారు. ఈనెల 20 వరకు ఆ జ్యోతి తిరుపతిలో ఉంటుంది.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కె.నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఎంపీ పి.మిధున్‌రెడ్డి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్, భారత రక్షణ విభాగానికి చెందిన పలువురు ఉన్నతాధికారులు, మాజీ సైనికులు, పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.