మంత్రి పేకాట దందా పట్టుకున్న...ఆ ఎస్సైది ఆత్మహత్యా, హత్యా?: చంద్రబాబు సంచలనం

By Arun Kumar P  |  First Published Jan 19, 2021, 3:52 PM IST

వైసిపి పాలనలో కాణిపాకం, శ్రీశైలం, విజయవాడ, అన్నవరం, అంతర్వేది, సింహాచలం ఇలా దేనినీ వదిలి పెట్టలేదని... రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాలు అన్నింటిపై దాడులు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.


గుంటూరు: తిరుపతి ఉపఎన్నికల్లో విజయమే లక్ష్యంగా స్థానిక టిడిపి శ్రేణులను సంసిద్దం చేస్తోంది తెలుగుదేశం పార్టీ. ఇందులో భాగంగా తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ టిడిపి గ్రామ కమిటీ, బూత్ కమిటీల ప్రతినిధులతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పార్టీ బలోపేతానికి పలు సలహాలు, సూచనలిచ్చారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... వైసిపి దుర్మార్గాలపై ప్రజల్లో తిరుగుబాటు ప్రారంభమైందన్నారు. పరిటాల భోగిమంటల్లో రైతు వ్యతిరేక జీవోల దగ్దం, ఛలో రామతీర్థం ఆందోళనలకు హాజరైన జనసమూహాలే ఇందుకు నిదర్శనమన్నారు. తెలుగుదేశం సెక్యులర్ పార్టీ అని... ఏ ప్రార్ధనా మందిరంపై దాడి జరిగినా  సహించదన్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా అన్నిమతాలను టిడిపి గౌరవించిందని... ప్రజల మనోభావాలను కాపాడిందని చంద్రబాబు అన్నారు.

Latest Videos

undefined

''జగన్ రెడ్డి సీఎం అయ్యాక 150పైగా ఆలయాలపై దాడులు, దేవుళ్ల విగ్రహాల ధ్వంసం చేశారు. బలవంతపు మతమార్పిళ్లను ప్రోత్సహిస్తున్నారు. విగ్రహాలను ధ్వంసం చేసి క్రీస్తు గ్రామాలుగా చేస్తున్నామని, తానే వందలాది దేవుళ్ల విగ్రహాలను కాలితో తన్నానని ఒక ఫాస్టర్ చెప్పిన వీడియోలే ప్రత్యక్ష సాక్ష్యం'' అన్నారు.

''గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో 7కొండలను 2కొండలకు తగ్గించడంపై ప్రజలంతా ఖండించారు. నేనే స్వయంగా కాలినడకన తిరుమల వెళ్లాను, భక్తుల మనోభావాలను కాపాడాం. ఇప్పుడు మళ్లీ జగన్ రెడ్డి సిఎం అయ్యాక తిరుమల తిరుపతి పవిత్రతకు కళంకం తెచ్చారు. భార్య బైబిల్ పట్టుకుని తిరిగే వ్యక్తిని టిటిడి ఛైర్మన్ చేశారు, ఒకే సామాజిక వర్గం పెత్తనంగా టిటిడిని మార్చారు. యధేచ్చగా మద్యం- మాంసం విక్రయాలు, అన్యమత ప్రచారం, బలవంతపు మత మార్పిళ్లను ప్రోత్సహిస్తున్నారు. ఎస్వీబిసి ఛానల్ ఛైర్మన్ అసభ్య ప్రవర్తన, భక్తులకు అసభ్య వీడియో లింకులు పంపడం, ఆర్టీసి టిక్కెట్లపై జెరూసలెం యాత్ర విశేషాలు, తిరుమల కొండపై శిలువ గుర్తులు... తిరుపతిలో వీళ్లు చేయని అపచారం లేదు'' అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

''కాణిపాకం, శ్రీశైలం, విజయవాడ, అన్నవరం, అంతర్వేది, సింహాచలం... దేనినీ వదిలి పెట్టలేదు, పుణ్యక్షేత్రాలు అన్నింటిపై దాడులు చేస్తున్నారు. 13జిల్లాలలో వందలాది విగ్రహాలను విధ్వంసం చేశారు. దేవుళ్ల రథాలకు నిప్పుపెట్టడమే కాదు, చివరికి ముస్లిం దర్గాలకు కూడా నిప్పుపెట్టే నీచానికి దిగజారారు. ఆలయాలపై దాడులు, విధ్వంసాలపై ఒకరోజు ఉన్మాదుల పని అని చెప్పిన డిజిపి మరురోజే టిడిపి, బిజెపి వాళ్లే కారణమని చెప్పడం దిగజారుడుతనం'' అని మండిపడ్డారు.

read more  తాగింది దిగేవరకే నాని ప్రతాపం... ఊరిమీద పడే ఆంబోతులా: అచ్చెన్న సీరియస్

''ప్రజల ప్రాణాలు తీయడమే వైసిపికి నిత్యకృత్యమైంది. ఇన్ని హత్యలు, ఆత్మహత్యలు, అనుమానాస్పద మరణాలు, అత్యాచారాలు 67ఏళ్ల రాష్ట్ర చరిత్రలో చూడలేదు. 20నెలల్లో 2వేల మంది రైతుల ఆత్మహత్యలు, 16మంది టిడిపి కార్యకర్తల హత్య, 1,350చోట్ల భౌతికదాడులు, 400మంది మహిళలపై అఘాయిత్యాలు....తంబళ్లపల్లిలో గంగిరెడ్డి హత్య, పుంగనూరులో దళిత యువకుడు ఓం ప్రతాప్ అనుమానాస్పద మృతి... నిన్న సుళ్లూరుపేటలో టిడిపి నాయకుడు వెంకటేష్ పై 15మంది కత్తులతో దాడి.. ప్రశాంతమైన చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కూడా హింసా విధ్వంసాలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని రావణకాష్టంలా తయారు చేశారు. ఉన్మాదుల రాజ్యంగా మార్చారు'' అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

''భవిష్యత్తులో తనపై పోటీ చేస్తాడనే అక్కసుతోనే బిటెక్ రవిపై తప్పుడు కేసులు పెట్టి సిఎం జగన్ రెడ్డి వేధిస్తున్నారు. అత్యాచారానికి గురైన ఎస్సీ మహిళ కుటుంబానికి న్యాయం చేయాలని కోరితే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడం హేయం.  ఇటువంటి ముఖ్యమంత్రిని, మంత్రులను, ఎమ్మెల్యేలను రాష్ట్రచరిత్రలో చూడలేదు. వీళ్లా మంత్రులు, వీళ్లా ఎమ్మెల్యేలు అని ప్రజలే నిలదీస్తున్నారు. ఒక ఎమ్మెల్యే ఏకంగా జిల్లా ఎస్పీని బహిరంగ సభలోనే బెదిరిస్తాడు, తేల్చుకుందాం రమ్మని సవాల్ చేస్తాడు. ఇంకో ఎమ్మెల్యే వేధింపులు భరించలేక ఏకంగా మహిళా ఎంపిడివో అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ లో ధర్నా చేయడం... మరో ఎమ్మెల్యే తన ఆక్రమణలో 7ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని నిస్సిగ్గుగా చెప్పడం, ఈ రోజు బూతుల మంత్రి, ప్రతిపక్ష నాయకుడిని ఇంటికొచ్చి తంతాననడం...వైసిపి రౌడీ రాజకీయాలకు నిదర్శనం'' అని అన్నారు.

''గుడివాడలో మంత్రి పేకాట దందా పట్టుకున్న ఎస్సై ఆత్మహత్య... అది ఆత్మహత్యనా, హత్యనా, అనుమానాస్పద మరణమా..? ఇళ్లస్థలాల్లో అవినీతిని బైటపెట్టిన చేనేత నాయకుడు నందం సుబ్బయ్యను పిలిపించి ఇళ్లస్థలాల ప్రాంగణంలోనే హత్య చేయడం, గండికోట పరిహారం పంపిణీలో అక్రమాలు బైటపెట్టిన కానిస్టేబుల్ గురుప్రతాప్ రెడ్డిని గ్రామసభ జరిగిన గుళ్లోనే హతమార్చడం..రోడ్లు వేయలేదని గిద్దలూరు ఎమ్మెల్యేను నిలదీసిన జనసేన కార్యకర్త అనుమానాస్పద మరణం.. మద్యం నాసిరకం బ్రాండ్లను నిలదీసిన పుంగనూరు దళిత యువకుడు ఓం ప్రతాప్ అనుమానాస్పద మృతి.. అబ్దుల్ సలామ్ కుటుంబంతో సహా రైలుకింద పడి సామూహిక ఆత్మహత్యలు..ఎస్పీ కార్యాలయం ఎదుటే అబ్దుల్ సత్తార్ ఆత్మహత్యాయత్నం...వైసిపి రాక్షసకాండకు ప్రత్యక్ష సాక్ష్యాలు. ఈ అరాచకాలు అన్నింటికీ జగన్ రెడ్డే కారణం'' అని పేర్కొన్నారు.

'' శాంతిభద్రతలు అధ్వానం కావడానికి డిజిపినే కారణం. పదవుల కోసం వైసిపితో కుమ్మక్కైన కొందరు పోలీసులే కారణం..వీళ్ల అండదండలు చూసుకునే  రాష్ట్రంలో క్రిమినల్ గ్యాంగ్స్ రెచ్చిపోతున్నాయి. ఎన్టీఆర్ కూడా ఇటువంటి దాడులు, విధ్వంసాల బాధితుడే.. గతంలో ఎన్టీఆర్ ఆస్తులను కూడా ధ్వంసం చేశారు, దగ్దం చేశారు. అయినా వెనుకడుగు వేయకుండా ధైర్యంగా పోరాడాం. ధైర్యానికి మారుపేరు ఎన్టీఆర్..ఎన్టీఆర్ స్ఫూర్తితో ప్రతి టిడిపి కార్యకర్త మనోధైర్యంతో ముందడుగు వేయాలి'' అని సూచించారు.

''పోరాటం టిడిపికి కొత్తకాదు, పోరాటాలతోనే టిడిపి రాటుతేలింది. పోరాడేవాళ్లే నాయకులుగా ప్రజల గుండెల్లో ఉంటారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల భవిష్యత్తు కోసం రాజీలేని పోరాటం చేయాలి. జగన్ రెడ్డి శిశుపాలుడిని మించిపోయాడు, 20నెలల్లోనే వందలాది తప్పులు చేశాడు.. వైసిపి పతనానికి తిరుపతి ఉప ఎన్నికతో నాంది పలకాలి.  తిరుపతి నుంచే వైసిపి దాడులకు అడ్డుకట్ట పడాలి. హింసా విధ్వంసాలను వెంకటేశ్వర స్వామి సహించడు. తిరుపతిలో టిడిపి గెలుపుతో వైసిపి విధ్వంసకాండకు అడ్డుకట్ట వేయాలి'' అని తెలిపారు.

''ఇళ్ల స్థలాల పేరుతో వేల కోట్లు మింగేస్తున్న పార్టీకి ఓటేస్తారా ఎవరైనా..? టిడిపి హయాంలో కట్టిన ఇళ్లను పేదలకు ఇవ్వకుండా వేధించే వైసిపికి ఓటేస్తారా..? ముంపు భూములు, స్మశానాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చే పార్టీకి ఎవరైనా ఓటేస్తారా..? నెలకు రూ 750 పించన్ ఎగ్గొట్టిన పార్టీకి పించన్ల లబ్దిదారులు ఎవరైనా ఓటేస్తారా..? మీటర్లు పెట్టే పార్టీకి ఏ ఒక్క రైతు అయినా ఓటేస్తారా..? రైతు భరోసా ఏడాదికి రూ 6వేలు ఎగ్గొట్టిన పార్టీకి ఏ రైతు అయినా ఓటేస్తారా..? హార్టీ కల్చర్ సబ్సిడి ఎగ్గొట్టిన వైసిపికి ఉద్యాన రైతులు ఓటేస్తారా..? పరిశ్రమలు, ఉద్యోగాలు పోగొట్టిన పార్టీకి యువతరం ఎవరైనా ఓటేస్తారా..? అత్యాచారాల రాష్ట్రంగా ఏపిని చేసిన వైసిపికి మహిళలు ఎవరైనా ఓటేస్తారా..? బిసి, ఎస్సీ,ఎస్టీ ముస్లిం మైనారిటిలపై దాడులు చేసే పార్టీకి బడుగు బలహీన వర్గాల ప్రజలు ఓటేస్తారా..? వీటన్నింటినీ వివరించి ప్రజలను చైతన్యపరచాలి'' అని పార్టీ శ్రేణులకు చంద్రబాబు ఆదేశించారు.

  

click me!