రాప్తాడు అడుగుతోంది... సమాధానం చెప్పడానికి సిద్దమా జగన్? : చంద్రబాబు సవాల్

By Arun Kumar PFirst Published Feb 18, 2024, 3:06 PM IST
Highlights

'సిద్దం' సభలతో ఎన్నికల ప్రచారాన్ని చేపడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కొన్ని ప్రశ్నలు సంధించారు.  వాటికి సమాధానం చెప్పాలంటూ సవాల్ విసిరారు. 

అమరావతి : ఎన్నికల సమయం కావడంతో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. ముఖ్యంగా  అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి-జనసేన కూటమి నాయకుల మధ్య మాటలయుద్దం తారాస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారానికి సిద్దమవగా టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు ఆసక్తికర ట్వీట్ చేసారు. రాప్తాడులో వైసిపి తలపెట్టిన 'సిద్దం' సభను టార్గెట్ చేస్తూ జగన్ కు పలు ప్రశ్నలు సంధించారు చంద్రబాబు. 

''రాప్తాడు అడుగుతోంది....జాకీ పరిశ్రమను ఎందుకు తరిమేశావని? అనంత అడుగుతోంది కియా అనుబంధ పరిశ్రమలు ఏమయ్యాయని? సీమ రైతన్న అడుగుతున్నాడు నాటి డ్రిప్ పథకాలు ఎక్కడని? సమాధానం చెప్పి సభ పెడతావా....సభలో సమాధానం చెపుతావా?'' అంటూ జగన్ ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసారు టీడీపీ అధినేత చంద్రబాబు. 

వెనకబడిన అనంతపురం జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు గత టిడిపి ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని చంద్రబాబు పేర్కొన్నారు.ఇందులో భాగంగానే రాప్తాడు వద్ద 129 కోట్ల పెట్టుబడితో జాకీ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చిందన్నారు. దీంతో ఏపిఐఐసి ద్వారా ప్రభుత్వం 27 ఎకరాల భూమిని ఆ సంస్థకు కేటాయించిందన్నారు. ఇలా జాకీ పరిశ్రమ ఏర్పాటుకు అంతా సిద్దమవుతుండగా ఎన్నికలు వచ్చి ప్రభుత్వం మారిపోయిందని చంద్రబాబు తెలిపారు. 

Also Read  చంద్రబాబుకు రక్తాభిషేకం... టికెట్ కోసం ఏకంగా రక్తాన్నే చిందించిన బుద్దా వెంకన్న

వైసిపి పాలనలో జాకీ పరిశ్రమ ఏర్పాటుకు అడుగులు ముందుకు పడలేదు... వైసిపి ప్రజాప్రతినిధులు భారీగా ముడుపులు డిమాండ్ చేయడంతో ఆ సంస్థ తన పెట్టుబడులను వెనక్కి తీసుకుందని చంద్రబాబు తెలిపారు. అనంతపురం ప్రాంతానికి చెందిన ఓ వైసిపి నాయకుడు ఏకంగా రూ.20 కోట్లు డిమాండ్ చేసినట్లు ఆ సంస్థ ప్రతినిధులు బయటకు వచ్చిందని చంద్రబాబు గుర్తుచేసారు. 

అంతటితో ఆగకుండా తమవారికే సబ్ కాంట్రాక్టులు ఇవ్వాలని... రికమండ్ చేసినవారికే కంపనీలో ఉద్యోగాలు ఇవ్వాలని జాకీ సంస్థను వైసిపి నేతల బెదిరించారని టిడిపి అధినేత తెలిపారు. ఈ వేధింపులపై అనేకసార్లు జాకీ సంస్థ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది... వైసిపి నాయకులు వేధింపులు మరీ ఎక్కువ కావడంతో చివరకు ఆనాటి రాష్ట్ర పరిశ్రమల మంత్రిత్వశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మురుగేశన్ కు కూడా జాకీ సంస్థ లెటర్ రాసిందని తెలిపారు. పరిశ్రమ స్థాపనకు ప్రభుత్వం ఇచ్చిన భూమిని వెనక్కి ఇచ్చేస్తున్నట్లు... పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనను విరమించుకుంటున్నట్లు పరిశ్రమల సెక్రటరీకి రాసిన లేఖలో పేజ్ ఇండస్ట్రీస్ సెక్రటరీ పేర్కొన్నారని చంద్రబాబు తెలిపారు. 
 

click me!