కింద భూమి కనిపిస్తేనేగా ఆకాశంలో ఎగిరే విమానాలు ల్యాండ్ అయ్యేది... కానీ విజయవాడలో ఉదయంపూట అలాంటి పరిస్థితులు వుండటంలేదు. అందువల్ల గమ్యానికి చేరుకున్నా విమానాలు గాల్లోనే చక్కర్లు కొట్టాల్సి వస్తోంది.
విజయవాడ : రాజకీయ, వ్యాపార ప్రముఖులతో పాటు సాధారణ ప్రయాణికులతో విజయవాడ విమానాశ్రయం బిజీగా వుంటుంది. ఇలా రాష్ట్రంలోని ప్రధానమైనదిగా గుర్తింపు పొందిన విమానాశ్రయంలోనే కొద్దిరోజులుగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. గన్నవరంలో వాతావరణ పరిస్థితులు ఇటీవల పూర్తిగా మారిపోయి ఉదయంపూట విపరీతమైన పొగమంచు కురుస్తోంది. దీంతో ల్యాండింగ్ కు పరిస్థితులకు అనుకూలించక విమానాలు గాల్లో చక్కర్లు కొడుతూ ఎదురుచూడాల్సి వస్తోంది. ఇలా గమ్యానికి చేరుకుని కూడా ప్రయాణికులు, విమాన సిబ్బంది ఇబ్బందిపడాల్సి వస్తోంది.
ఇవాళ(ఆదివారం) ఉదయం కూడా గన్నవరం విమానాశ్రయ పరిసరాల్లో దట్టమైన పొగమంచు కురిసింది. దీంతో వివిధ ప్రాంతాలనుండి ప్రయాణికులతో చేరుకున్న విమానాల ల్యాండింగ్ కు ఇబ్బందులు తలెత్తాయి. పొగమంచు దట్టంగా కమ్మేయడంతో రన్ వే కనిపించక గాల్లోనే విమానాలు చక్కర్లు కొట్టాయి. ఇలా హైదరాబాద్ తో పాటు బెంగళూరు, చెన్నైల నుండి విజయవాడకు చేరుకున్న మూడు ఇండిగో విమానాల ల్యాండింగ్ ఇబ్బందికరంగా మారింది. కొద్దిసేపు విమానాశ్రయ ప్రాంతంలోనే గాల్లో చక్కర్లుకొట్టిన విమానాలు పొగమంచు తగ్గాకే ల్యాండ్ అయ్యాయి.
గత గురువారం ఉదయం కూడా ఇలాంటి పరిస్థితే గన్నవరం విమానాశ్రయంలో చోటుచేసుకుంది. పొగమంచు కారణంగా హైదరాబాద్, చెన్నై ల నుండి ప్రయాణికులతో చేరుకున్న ఇండిగో విమానాలు ఎయిర్ పోర్టులో ల్యాండ్ కాలేక గాల్లోనే తిరగాల్సి వచ్చింది. విమానాశ్రయ సిబ్బంది పరిస్థితిని సమీక్షించి పొగమంచు కాస్త తగ్గగానే విమానాల ల్యాండింగ్ కు అనుమతిచ్చారు.
గత కొద్దిరోజులుగా గన్నవరంలో వాతావరణ పరిస్థితి ఇలాగే వుందని... విపరీతమైన పొగమంచు కారణంగా ఉదయం విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోందని తెలిపారు. ఈ పొగమంచు కారణంగా స్థానికులు, వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జాతీయ రహదారులపై ఉదయంపూట ప్రయాణించేందుకు సాహసం చేయడంలేదు వాహనదారులు. కానీ గత్యంతరం లేకపోకపోవడంతో పెద్ద వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. విపరీతంగా కురుస్తున్న పొగమంచుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని... దగ్గరకు వచ్చేవరకు వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నట్లు డ్రైవర్లు చెబుతున్నారు.