
తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హెచ్చరికలు జారీచేశారు. పార్టీ నాయకులతో చంద్రబాబు మంగళవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. పార్టీలో గ్రూప్ రాజకీయాలను సహించేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీలో గ్రూప్‌లకు చెక్ పడాల్సిందేనన్నారు. ఈ విషయంలో ఎవరికీ మినహాయింపులు ఉండబోవని స్పష్టం చేశారు. జగన్ పాలనతో వైసీపీ పని అయిపోయిందని.. జరగబోయేది వన్ సైడ్ ఎన్నికలేనని అన్నారు. ఇంతటి ప్రజా వ్యతిరేకత ఏ ప్రభుత్వంపైనా చూడలేదన్నారు.
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఉన్న కసి.. పాలనపై ప్రజల అసంతృప్తే మహానాడు సక్సెస్‌కు కారణమని అన్నారు. ఓట్ల తొలగింపుపై స్థానిక నేతలు అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు సూచించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతి, అక్రమాలపై స్థానికంగా పోరాటం చేయాలని చెప్పారు.
ఇదిలా ఉంటే.. సోమవారం టీడీపీ ముఖ్యనేతలతో ఆన్‌లైన్ ద్వారా చంద్రబాబు నాయుడు పలు అంశాలు చర్చించారు. ఒంగోలులో జరిగిన మహానాడు ప్రజా విజయమని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు. ప్రజాసమస్యలపై మరింతగా పోరాడాలని పార్టీ నాయకులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. టీడీపీ ముఖ్యనేతలతో ఆన్‌లైన్ ద్వారా చంద్రబాబు నాయుడు పలు అంశాలు చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఇకపై విరామం లేకుండా మరింత దూకుడుగా ప్రజా సమస్యలపై పోరాడాలని పార్టీ శ్రేణులకు సూచించారు. అరాచక, విధ్వంసక పాలనపై తిరుగుబాటుకు మహానాడు వేదికైందని చెప్పారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు మహానాడుతో భరోసా వచ్చిందన్నారు. మహానాడు విజయాన్ని పార్టీ క్యాడర్‌తో పాటు ప్రజలు కూడా ఆస్వాదిస్తున్నారని చెప్పారు.
రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ రాజకీయాలకే అనర్హుడని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ పన్ను పోటు, ధరల భారంపై బాదుడే బాదుడు కార్యక్రమం కొనసాగుతోందన్నారు. క్విట్ జగన్ సేవ్ అంధ్ర ప్రదేశ్ నినాదాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలలో భాగంగా నెలకు రెండు జిల్లాల్లో పర్యటించనున్నట్లు చెప్పారు.