ప్రధాన దేవాలయాల్లో బ్రాహ్మణేతరులను అర్చకులుగా నియమించడానికి చర్చలు జరగాలి: మంత్రి కొట్టు సత్యనారాయణ

By Sumanth KanukulaFirst Published May 31, 2022, 4:11 PM IST
Highlights

ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన దేవాలయాల్లో బ్రాహ్మణేతరులను అర్చకులుగా  నియమించడానికి చర్చలు జరగాలని చెప్పారు. పండితులు అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు.

ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన దేవాలయాల్లో బ్రాహ్మణేతరులను అర్చకులుగా  నియమించడానికి చర్చలు జరగాలని చెప్పారు. పండితులు అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు. అనువంశిక అర్చకత్వం కొన్ని దేవాలయాల్లో మాత్రమే ఉందని తెలిపారు. దళిత వాడల్లో దళితులనే అర్చకులుగా నియమించడం ఎప్పటి నుంచో ఉందన్నారు. ఎండోమెంట్ ట్రిబ్యునల్‌కు సంబంధించి కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.

దేవాదాయ శాఖకు సంబంధించి 5 వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని మంత్రి చెప్పారు. అదనపు న్యాయ సలహాదారు పోస్టు కోసం ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. దేవాదాయ శాఖలో అవినీత లేదని చెప్పలేమని వ్యాఖ్యానించారు. అవినీతిని అరికట్టడానికి విజిలెన్స్ సెల్ ఏర్పాటు చేయనున్నట్టుగా తెలిపారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని పైలెట్ ప్రాజెక్ట్‌గా తీసుకున్నట్టుగా చెప్పారు.  

ఇదిలా ఉంటే.. దాతలు ఇచ్చిన విరాళాలు, సీజీఎఫ్‌ (కామన్ గుడ్ ఫండ్స్) నిధులు దుర్వినియోగం కాకుండా త్వరలో ఆలయాల జీర్ణోద్ధరణ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు దేవదాయశాఖ మంత్రి, ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ సోమవారం తెలిపారు. . సీజీఎఫ్‌ పనులు, ఇంజనీరింగ్‌ విభాగంపై సోమవారం విజయవాడలో ఆయన సమీక్ష నిర్వహించారు. పలు ఆలయాల్లో జరుగుతున్న ఇంజనీరింగ్ పనుల గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇతర శాఖల్లో ఇంజనీరింగ్‌ పనులకు, దేవదాయశాఖలో ఇంజనీరింగ్‌ పనులకు చాలా తేడా ఉంటుందని, ఆలయాల నిర్మాణాలు ఆగమ శాస్త్రాన్ని పరిగణనలోకి తీసుకుని చేపట్టాలని సూచించారు.

వాస్తు, శిల్పం దృష్టిలో ఉంచుకుని నాణ్యత విషయంలో రాజీ పడకుండా.. నిర్మాణాలు  కనీసం వందేళ్లు చెక్కు చెదరకుండా ఉండేలా పనులు చేపట్టాలన్నారు. సిబ్బంది కొరతతో ఇబ్బంది పడుతున్నామని అధికారులు ఆయన దృష్టికి తీసుకురాగా.. ఎనిమిది మంది ఏఈలు, ఇద్దరు అసిస్టెంట్‌ స్థపతులను ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన తీసుకునేందుకు అనుమతిచ్చారు. ప్రస్తుతం రూ.322 కోట్లతో జరుగుతున్న పనులను, ఇకముందు అనుమతులు ఇవ్వబోతున్న రూ. 200 కోట్ల పనులను  వేగంగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇకపై సీజీఎఫ్‌ నిధుల కోసం పంపే ప్రతిపాదలు కచ్చితంగా నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే స్వీకరించాలని స్పష్టంచేశారు. దాతలు ఇచ్చే విరాళాలు వృథా కాకుండా చూడాలన్నారు.

click me!