బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు.. కేసీఆర్ జాతీయ పార్టీపై ఏమన్నారంటే..?

By Siva KodatiFirst Published Oct 5, 2022, 2:48 PM IST
Highlights

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న కనకదుర్గమ్మను దర్శించుకున్నారు టీడీపీ అధినేత , ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు. రాజధాని ప్రజల సంకల్పమని.. దీనిపై రోజుకొక మాట మాట్లాడటం సరికాదని చంద్రబాబు హితవు పలికారు.
 

దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న కనకదుర్గమ్మను దర్శించుకున్నారు టీడీపీ అధినేత , ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం వేద పండితులు చంద్రబాబు దంపతులకు ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత మీడియాతో మాట్లాడుతూ.. దసరా రోజున అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా వుందన్నారు. పెద్దసంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆయన అన్నారు. 

 

 

పుష్కరాల సందర్భంగా ఘాట్‌రోడ్‌ను అభివృద్ధి చేశామని.. 150 కోట్లతో ఇంద్రకీలాద్రిపై వసతులు కల్పించామని చంద్రబాబు గుర్తుచేశారు. రాష్ట్రాన్ని చల్లగా కాపాడమని అమ్మవారిని కోరానని.. ఈరోజున పూజ చేసి ఏ కార్యక్రమం చేసినా ఫలిస్తుందని టీడీపీ అధినేత అన్నారు. దుర్గమ్మ తల్లి సాక్షిగా రాజధాని ఇక్కడే వుండాలని అన్ని రాజకీయ పార్టీలు ఆమోదించాయని చంద్రబాబు నాయుడు గుర్తుచేశారు. వైసీపీ కూడా ఇదే చెప్పిందని.. అన్ని దేవాలయాల్లో పూజలు చేసి పవిద్ర మట్టి, నీరు తెచ్చామని ఆయన పేర్కొన్నారు. రాజధాని ప్రజల సంకల్పమని.. దీనిపై రోజుకొక మాట మాట్లాడటం సరికాదని చంద్రబాబు హితవు పలికారు. మాట తప్పడం మంచి పద్ధతి కాదని... అలాంటి వారిని అమ్మవారు ఉపేక్షించరని టీడీపీ అధినేత హెచ్చరించారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ ప్రకటనపై చంద్రబాబును ప్రశ్నించగా.. ఆయన చిరు నవ్వులు చిందిస్తూ వెళ్లిపోయారు తప్పించి స్పందించేందుకు నిరాకరించారు. 

 

 

కాగా... శరన్నవరాత్రి వేడుకల్లో చివరి రోజయిన ఇవాళ (బుధవారం) విజయవాడ కనకదుర్గమ్మ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు. దసరా పండగ రోజున అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి భక్తులు, భవాని దీక్షదారులు భారీగా ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. దీంతో క్యూలైన్లు నిండిపోయి అమ్మవారి దర్శనానికి సమయం పడుతోంది. నవరాత్రి వేడుకల్లో వివిధ రూపాల్లో దర్శనమిచ్చే అమ్మవారిని రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు కూడా దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రముఖ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇవాళ అమ్మవారిని దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రిపైకి చేరుకున్న బాలయ్యకు ఆలయ మర్యాదలతో అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. దగ్గరుండి దర్శనం చేయించిన అధికారులు లడ్డూ ప్రసాదం, అమ్మవారి చిత్రపటం అందించగా... పండితులు వేద ఆశీర్వచనం అందించారు. 

click me!