
తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు రేపటి నుంచి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. 28న కందుకూరులో, 29న కావలిలో, 30న కోవూరులో జరిగే కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొంటారు. ఈ సందర్భంగా పలు వర్గాల ప్రజలతో ఆయన సమావేశం కానున్నారు.
దీనికి సంబంధించి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పర్యటనలకు జగన్ సర్కార్ అడ్డంకులను కలిగిస్తోందన్నారు. కావలిలో తెలుగుదేశం వర్గీయులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా తొలగించారనిబీద రవిచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. కావలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఇంటూరు నాగేశ్వరరావు స్థానిక నేతలతో సమావేశమై చంద్రబాబు పర్యటన ఏర్పాట్లపై చర్చించారు.
ALso REad: వచ్చే ఎన్నికల్లో గుడివాడ నుండి నేనే పోటీ చేస్తా: రావి వెంకటేశ్వరరావు
ఇదిలావుండగా.. గుడివాడలో టీడీపీ, వైసీపీ వర్గీయుల ఘర్షణకు సంబంధించి రెండు వర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇరువర్గాలకు చెందిన 14 మందిపై పోలీసులు కేసులు పెట్టారు. ఈ నెల 25వ తేదీన రాత్రి గుడివాడలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. గుడివాడలో రంగా వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించవద్దని తనను వైసీపీ నేతలు బెదిరించారని రావి వెంకటేశ్వరరావు ఆరోపించారు. ఈ విషయమై టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు మెరుగుమాల కాశీ సహా మరో నలుగురిపై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే తనపై దాడి చేశారని కానిస్టేబుల్ హకీం ఫిర్యాదు చేయడంతో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు సహా టీడీపీ శ్రేణులపై కేసు నమోదు చేశారు. టీడీపీ, వైసీపీ వర్గాలకు చెందిన 14 మందిపై కేసులు నమోదు చేసినట్టుగా పోలీసులు ప్రకటించారు.