సుబ్బయ్య హత్య.. ఏం జరిగిందో కమీషనర్ చెప్పాలి: చంద్రబాబు డిమాండ్

By Siva KodatiFirst Published Dec 29, 2020, 6:13 PM IST
Highlights

పొద్దుటూరు టిడిపి నాయకుడు నందం సుబ్బయ్య హత్య నేపథ్యంలో కడప జిల్లా నేతలతో పార్టీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బయ హత్య పూర్వాపరాలను చంద్రబాబుకు వివరించారు కడప టిడిపి నేతలు

పొద్దుటూరు టిడిపి నాయకుడు నందం సుబ్బయ్య హత్య నేపథ్యంలో కడప జిల్లా నేతలతో పార్టీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బయ హత్య పూర్వాపరాలను చంద్రబాబుకు వివరించారు కడప టిడిపి నేతలు.

4 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి కడప పర్యటన, అనంతరం జిల్లా అడిషనల్ ఎస్పీ బదిలీ, ఇవాళ నందం సుబ్బయ్య హత్య..అన్నీ వైసిపి కుట్రలో భాగంగానే అని టిడిపి నాయకులు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు.

వారం రోజులుగా ప్రెస్ మీట్ల ద్వారా, సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా వైసిపి ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి అవినీతిని, ఆయన బావమరిది దుర్మార్గాలు, మట్కా మాఫియా దందాలను బైటపెట్టాడన్న కక్షతోనే సుబ్బయ్యను అతిదారుణంగా హత్య చేశారని తెలిపారు.

మున్సిపల్ కమిషనర్ కబురు చేశారని పిలిపించి వాళ్ల కళ్లెదుటే 10అడుగుల ముందే చంపేశారంటే ఇంతకన్నా రాక్షస పాలన ఏముందని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే అవినీతిపై తన వద్ద ఉన్న సాక్ష్యాధారాలన్నీ ఈ రోజు ప్రెస్ మీట్ లో బయటపెడ్తానని సుబ్బయ్య చెప్పాడని, ఆలోపే హతమార్చారని తెలిపారు.

ఎమ్మెల్యే బెదిరింపులపై ముందే ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదని, సకాలంలో చర్యలు తీసుకుని ఉంటే సుబ్బయ్య ప్రాణాలు కోల్పోయేవాడు కాదని పేర్కొన్నారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ సుబ్బయ్య భార్య అపరాజిత కన్నీరు మున్నీరైంది.

Also Read:14 కేసుల్లో నిందితుడు.. ఎందరో శత్రువులు: సుబ్బయ్య హత్యపై శివప్రసాద్ రెడ్డి స్పందన

ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి, ఆయన బావమరిది కూడబలుక్కుని తన భర్తను హత్య చేశారని వాపోయింది. తనకెవరూ లేరంటూ ఇద్దరు చిన్నారులతో ఎలా బతకాలంటూ రోదించింది. సుబ్బయ్య కుటుంబానికి పార్టీపరంగా అన్నివిధాలా అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలని చంద్రబాబు ఆమెను ఓదార్చారు.

అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ, ‘‘ రాష్ట్రంలో మున్నెన్నడూ లేని  దుర్మార్గ పాలన, కిరాతక పాలన, ఉన్మాద పాలన చూస్తున్నామన్నారు. ప్రెస్ మీట్లు పెట్టాడని, సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టాడని బీసీ నాయకుడు నందం సుబ్బయ్య ప్రాణాలు తీస్తారా అంటూ చంద్రబాబు మండిపడ్డారు.

వైసిపి అవినీతి కుంభకోణాలను బైటపెట్టడం సుబ్బయ్య చేసిన నేరమా అంటూ బాబు నిలదీశారు. అవినీతికి పాల్పడిన వాళ్లను, మట్కా దందాలు చేసేవాళ్లను వదిలేసి, వాటిని బైటపెట్టిన వాళ్లను చంపేస్తారా అని ఆయన ప్రశ్నించారు.

జగన్ జంగిల్ రాజ్‌గా రాష్ట్రాన్ని మారుస్తారా..? పోగాలం దాపురించింది కాబట్టే ఇటువంటి ఉన్మాద చర్యలకు పాల్పడుతున్నారని ప్రతిపక్షనేత వ్యాఖ్యానించారు. ఇళ్ల పట్టాలలో వైసిపి అవినీతిని బైటపెట్టిన నందం సుబ్బయ్యను పట్టాల పంపిణీ కార్యక్రమం వద్దకు పిలిపించి హతమార్చడం కన్నా కిరాతకం మరొకటి లేదన్నారు.

నేరస్తులపై కఠిన చర్యలు లేకపోవడం వల్లే నేరాలు-ఘోరాలు పెచ్చుమీరాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.తామేం నేరం చేసినా తమను ఎవరూ ఏమీ చేయలేరనే ధీమాతో ఉన్మాదులంతా పేట్రేగి పోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

కమిషనర్ కబురు చేసి పిలిపించారని, ఆయన కళ్లెదుటే చంపారనే విషయంపై మున్సిపల్ కమిషనర్ సమాధానం చెప్పాలి, సుబ్బయ్య హత్య వెనుక కుట్ర కోణాన్ని బహిర్గతం చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. నిందితులపై కఠిన చర్యలు చేపట్టేదాకా రాజీలేని పోరాటం చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 

click me!