ఏపీలో గాలివాన బీభత్సం.. మహానాడు ప్రాంగణంలో కుప్పకూలిన కటౌట్, నారా లోకేష్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

By Siva KodatiFirst Published May 28, 2023, 6:39 PM IST
Highlights

రాజమండ్రిలో జరుగుతున్న తెలుగుదేశం మహానాడు సభా ప్రాంగణం వద్ద యువ నేత నారా లోకేష్ సహా తదితరులు తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. భారీ వర్షం, ఈదురుగాలుల కారణంగా ఎన్టీఆర్ కటౌట్‌ వీఐపీ టెంట్‌పై పడింది. 

ఆదివారం తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలను ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం వణికించింది. పలు చోట్ల చెట్లు కూలిపోగా, పంటలకు భారీ నష్టం కలిగింది. ఇదిలావుండగా.. రాజమండ్రి నగరంలోని వేమగిరి సమీపంలో జరుగుతున్న టీడీపీ మహానాడు ప్రాంగణం వద్ద భారీ వర్షం కురవడంతో నేతలు, కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అంత వర్షాన్ని లెక్క చేయకుండా కార్యకర్తలు నేతల ప్రసంగాలు విన్నారు.

మరోవైపు.. భారీ వర్షం, బలమైన ఈదురుగాలుల కారణంగా మహానాడులోని సభా ప్రాంగణం వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. గాలుల ధాటికి ఓ భారీ కటౌట్ వీఐపీ టెంట్‌పై పడింది. అయితే అప్పటి వరకు నారా లోకేష్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కళా వెంకట్రావు, అశోక్ గజపతి రాజు, పంచుమర్తి అనురాధ తదితర ముఖ్యనేతలు అక్కడే వున్నారు. వీరంతా బయటకు వచ్చిన కాసేపటికీ కటౌట్‌ ఆ టెంట్‌పై పడింది. అయితే ఆ సమయంలో నేతలెవ్వరూ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అలాగే మైదానంలో వున్న ఎల్‌ఈడీలు, ఎలక్ట్రానిక్ పరికాలు వర్షంలో తడవకుండా ముందు జాగ్రత్తగా సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అటు సభా ప్రాంగణానికి వస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాన్వాయ్ భారీ వర్షం కారణంగా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. 

ALso Read: ఏపీలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలు జిల్లాల్లో గాలివాన బీభత్సం

కాగా..  తిరుపతి నగరంలోని కోరమీను గుంటలో గాలివాన కారణంగా 20కి పైగా రేకుల ఇళ్లు కూలాయి. అటు రాజమండ్రిలోనూ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం జనాన్ని వణికించింది. టీడీపీ మహానాడు ప్రాంగణంలోనూ భారీ వాన కురవడంతో టీడీపీ శ్రేణులు ఇబ్బందులు పడ్డాయి. కాకినాడ, పిఠాపురం, సామర్లకోట, పెద్దాపురం, చిత్తూరులలో గాలివాన కురిసింది. చిత్తూరు జిల్లాలోని బైరెడ్డిపల్లిలో ఈదురుగాలుల ధాటికి కోళ్ల షెడ్ నేటమట్టమైంది. అలాగే ఈ ప్రాంతంలోని వరి, టమోటా, బీర, చిక్కుడు పంటలు భారీగా దెబ్బతిన్నాయి. అకాల వర్షాలతో అన్నదాతలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

click me!