
ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. తిరుపతి నగరంలోని కోరమీను గుంటలో గాలివాన కారణంగా 20కి పైగా రేకుల ఇళ్లు కూలాయి. అటు రాజమండ్రిలోనూ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం జనాన్ని వణికించింది. టీడీపీ మహానాడు ప్రాంగణంలోనూ భారీ వాన కురవడంతో టీడీపీ శ్రేణులు ఇబ్బందులు పడ్డాయి. కాకినాడ, పిఠాపురం, సామర్లకోట, పెద్దాపురం, చిత్తూరులలో గాలివాన కురిసింది. చిత్తూరు జిల్లాలోని బైరెడ్డిపల్లిలో ఈదురుగాలుల ధాటికి కోళ్ల షెడ్ నేటమట్టమైంది. అలాగే ఈ ప్రాంతంలోని వరి, టమోటా, బీర, చిక్కుడు పంటలు భారీగా దెబ్బతిన్నాయి. అకాల వర్షాలతో అన్నదాతలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
అటు ఆదివారం హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం నుంచి ఆకాశం మేఘావృతమై చల్లటి గాలి వీచింది. ఆ కాసేపటికే నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఫిల్మ్ నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, కూకట్‌పల్లి, బాలానగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీయడంతో విద్యుత్ సరఫరా నిలిచింది. రోడ్ల మీదకు భారీగా వర్షపు నీరు చేరడంతో ట్రాఫిక్ స్తంభించి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత కొద్దిరోజులుగా ఎండ వేడి, ఉక్కపోతతో అల్లాడుతున్న జనం వర్షం కారణంగా కాస్త ఉపశమనం పొందారు.