ఏం జరిగిందో చెప్పడానికి వస్తే దాడికి దిగుతారా: వైసీపీపై బాబు ఫైర్

By Siva KodatiFirst Published Nov 28, 2019, 7:13 PM IST
Highlights

అమరావతిలో వాస్తవ పరిస్ధితులను రాష్ట్ర ప్రజలకు తెలియజేసేందుకే రాజధాని ప్రాంతంలో పర్యటించానన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

అమరావతిలో వాస్తవ పరిస్ధితులను రాష్ట్ర ప్రజలకు తెలియజేసేందుకే రాజధాని ప్రాంతంలో పర్యటించానన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. గురువారం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఆయన రాజధానిలో నిర్మాణాలను పరిశీలించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.... రైతులు భూములు త్యాగం చేసి వుండకపోతే ఈరోజు రాజధాని వచ్చేది కాదన్నారు. రాజధాని అనేది 5 కోట్ల మంది ఆంధ్రుల భవిష్యత్‌కు సంబంధించిన అంశమని.. తాను ఇచ్చిన హామీని నమ్మి రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని చంద్రబాబు గుర్తుచేశారు.

Also Read:నేలను ముద్దాడిన చంద్రబాబు: ఎన్టీఆర్ వ్యాఖ్యలతో ట్రోలింగ్

తన కోసమో, పార్టీ కోసమో, కొంతమంది వ్యక్తుల కోసమో అమరావతి నిర్మాణాన్ని ప్రారంభించలేదన్నారు. 14 సంవత్సరాలు సీఎంగా ఉన్న వ్యక్తిని, గౌరవ శాసనసభ్యులు వెళ్తున్న బస్సుపై రాళ్లు, చెప్పులతో దాడి చేయడం వెనుక వైసీపీ రౌడీలు ఉన్నారని చంద్రబాబు ఆరోపించారు.

రాళ్లు, చెప్పులతో వైసీపీ రౌడీలు విరుచుకుపడుతుంటే డీఎస్పీ అక్కడే ఉండి చూస్తున్నారని బాబు మండిపడ్డారు. ఆనాడు దేశంలోని పుణ్య నదులు, పుణ్య క్షేత్రాల నుంచి మట్టి, నీటిని తీసుకొచ్చి అమరావతి ప్రాంతాన్ని పునీతం చేశామని ఆయన గుర్తుచేశారు.

రాజధానిలో జరిగిన పనులకు... వైసీపీ నేతలు చెబుతున్న దానికి పొంతన లేదని, చాలా వరకు భవనాల నిరమాణం పూర్తయ్యాయని చంద్రబాబు తెలిపారు. నాడు హైదరాబాద్‌ను అభివృద్ధి చేసే సమయంలోనూ తనను ఎంతోమంది ఇలాగే ప్రశ్నించారని... శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు 5 వేల ఎకరాల భూమి అవసరమా అని నిలదీశారని ఆయన గుర్తుచేశారు.

అయితే ఈరోజున 16 శాతం హైదరాబాద్ అభివృద్ధికి ఆ 5 వేల ఎకరాలే కారణమైందని చంద్రబాబు తెలిపారు. హైదరాబాద్‌ అభివృద్ధిలో తన పేరు వినిపించకపోయినా.. ఆ రోజున తాను పడిన కష్టం, చొరవ తనకు జీవితాంతం తృప్తినిస్తుందని ఆయన తెలిపారు.

తాను 2004 ఎన్నికల్లో ఓడిపోయినా తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు హైదరాబాద్ అభివృద్ధిని చంపేయలేదని చంద్రబాబు గుర్తుచేశారు. అమరావతికి పైన 6 జిల్లాలు, దిగువన 7 జిల్లాలు ఉన్నాయని ఇంతకంటే రాష్ట్రానికి కేంద్ర స్థానం మరొకటి లేదని... రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో అమరావతి ఉందన్నారు.

నాడు రాజధాని కోసం కేంద్రం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీకి కూడా 52 మంది సభ్యులు అమరావతే రాజధానిగా ఉండాలని తమ అభిప్రాయాన్ని తెలియజేశారని చంద్రబాబు గుర్తుచేశారు. ల్యాండ్‌ఫూలింగ్‌‌కు సంబంధించి వైసీపీ నాయకులే కోర్టుకు వెళ్లారు గానీ ప్రజలు ఎక్కడా న్యాయస్థానాన్ని ఆశ్రయించలేదన్నారు.

రూ.9,492 కోట్లను అమరావతి కోసం నిధులు సమకూర్చామని.. ఇందులో రూ.9,060 కోట్లను ఖర్చు చేశామని, కేంద్రం మరో రూ. 1,500 కోట్లు ఇచ్చిందని చంద్రబాబు తెలిపారు.

బాండ్ల ద్వారా రూ.2 వేల కోట్లు, హడ్కో నుంచి రూ. 1,098 కోట్లు, బ్యాంకుల నుంచి రూ.1,862 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్ కింద రూ.1,103 కోట్లు కేటాయించామని టీడీపీ అధినేత గుర్తుచేశారు. అలాగే అమరావతి-ఇటుక పేరుతో రూ. 55 కోట్లు విరాళంగా లభించిందన్నారు.

Also Read:అమరావతి పర్యటన... చంద్రబాబు బస్సుపై చెప్పుతో దాడి

భూమి అమ్మకం, మౌలిక సదుపాయాల నిధి కింద రూ.543 కోట్లు, సీఆర్డీఏ బాండ్ల ద్వారా రూ.26 కోట్లు, ఫిక్సడ్ డిపాజిట్ల ద్వారా రూ.61 కోట్లు, సెక్యూరిటీ డిపాజిట్ల ద్వారా రూ.64 కోట్లు సేకరించామన్నారు. 

click me!