కీలక నేత ఆవేదన: టీడీపీలో చేరి నష్టపోయాం, జగన్ కు ఆ ఫ్యామిలీ రిక్వస్ట్

By Nagaraju penumalaFirst Published Nov 28, 2019, 4:13 PM IST
Highlights

వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న గౌరు చరితారెడ్డి తీరా అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ప్రతిపక్షానికే పరిమితమయ్యారు. దాంతో ఆమె గత పరిచయాలతో వైసీపీలో చేరాలని భావిస్తున్నారట. ఇప్పటికే పలువురు  కీలక నేతలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. 
 

కర్నూలు: వైయస్ఆర్ ఫ్యామిలీతో ఆ కుటుంబానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఆ కుటుంబాన్ని రాజకీయాలకు పరిచయం చేసింది దివంగత సీఎం వైయస్ఆర్ రాజశేఖర్ రెడ్డి. 2004లో పిలిచి మరీ కాంగ్రెస్ టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. 

వైయస్ఆర్ మరణం అనంతరం ఆ కుటుంబం ఆయన తనయుడు వైయస్ జగన్ వెన్నంటే నడిచింది. జగన్ అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు నడిచింది. జగన్ సైతం టికెట్ ఇవ్వడంతో ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు. అయితే 2019 ఎన్నికలు వచ్చేసరికి వారిని దురదృష్టం వెంటాడిందో ఏమోగానీ జగన్ ను విడిచి టీడీపీలోకి వెళ్లిపోయారు. 

తమకు టికెట్ ఇవ్వరని తెలియడంతో తమ రాజకీయ భవిష్యత్ పై గందరగోళానికి గురైన ఆ కుటుంబం చంద్రబాబు చెంతకు చేరారు. అయితే 2019 ఎన్నికల్లో వైసీసీ బంపర్ మెజారిటీతో అధికారంలోకి రావడంతో ఇప్పుడు వైసీపీలో చేరే అంశంపై ఆ కుటుంబం ప్రయత్నాలు చేస్తోందట. 

ఇంతకీ ఎవరా కుటుంబం ఏమిటీ కథ అనుకుంటున్నారా...? ఇంకెవరు కర్నూలు జిల్లా రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గౌరు చరితారెడ్డి ఫ్యామిలీ. 2019 ఎన్నికల సమయంలో గౌరు చరితారెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిపోయారు. 

అనంతరం జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కాటసాని రామ్ భూపాల్ రెడ్డి చేతిలో ఘోరంగా ఓటమి పాలయ్యారు గౌరు చరితారెడ్డి. ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓటమి పాలవ్వడంతో అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు గౌరు చరితారెడ్డి ఫ్యామిలీ.  

ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీలో చేరితే బాగుంటుందని అభిమానులు, కార్యకర్తలు గౌరు చరితారెడ్డికి సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే గౌరు చరితారెడ్డిని రాజకీయాలకు పరిచయం చేసింది దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి. 

ఆ సాన్నిహిత్యంతోనే వైఎస్ ఆమెకు 2004లో నందికొట్కూరు టికెట్ ఇప్పించారు. ఆనాడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఓడించి రికార్డు సృష్టించారు. 2009లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎల్ వెంకటస్వామికి కేటాయించింది. ఆ ఎన్నికల్లో వెంకటస్వామి గెలుపొందారు. 

2009లో సెప్టెంబర్ 2న వైయస్ఆర్ మరణానంతరం ఆమె ఆయన తనయుడు వైయస్ జగన్ వెన్నంటి ఉన్నారు. దాంతో 2014 ఎన్నికల్లో పాణ్యం టికెట్ ఇచ్చారు జగన్. వైసీపీ అభ్యర్థిగా పాణ్యం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గౌరు చరితారెడ్డి గెలుపొందారు. 

అయితే 2019 ఎన్నికలకు ముందు కాటసాని రామ్ భూపాల్ రెడ్డి బీజేపీ నుంచి వైసీపీలో వచ్చి చేరారు. ఈసారి కాటసాని రామ్ భూపాల్ రెడ్డికి టికెట్ ఇస్తామని జగన్ చెప్పడంతో అలకబూనారు గౌరు చరితారెడ్డి. 

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కీలకమైన పదవి ఇస్తామని చెప్పినా కూడా వినకుండా తన భర్త వెంకటరెడ్డితో కలిసి సైకిలెక్కేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గౌరు చరితారెడ్డి జగన్ వేవ్ లో కొట్టుకుపోయారు. ఆమెపై కాటసాని రామ్ భూపాల్ రెడ్డి ఏకంగా 43 వేల మెజారిటీతో గెలుపొందారు. 

వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న గౌరు చరితారెడ్డి తీరా అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ప్రతిపక్షానికే పరిమితమయ్యారు. దాంతో ఆమె గత పరిచయాలతో వైసీపీలో చేరాలని భావిస్తున్నారట. ఇప్పటికే పలువురు  కీలక నేతలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. 

ఎందుకంటే గత ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. 14 అసెంబ్లీ స్థానాలతోపాటు రెండు పార్లమెంట్ స్థానాలను కూడా తన ఖాతాలో వేసుకుంది. టీడీపీకి ఒక్కస్థానంలో కూడా గెలుపొందలేదు. 

2004 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ ప్రభంజనంతో కాంగ్రెస్‌ భారీ విజయాన్ని అందుకుంది. 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ 13 చోట్ల వైసీపీ గెలవగా ఒక్కచోట టీడీపీ గెలిచింది. మళ్లీ  15 ఏళ్ల తర్వాత ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌ సారథ్యంలోని వైసీపీ రెండు పార్లమెంట్‌ స్థానాలు, 14 అసెంబ్లీ స్థానాల్లోనూ విజయఢంకా మోగించిన సంగతి తెలిసిందే. 

ఇకపోతే కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు వైసీపీ వైపు చూస్తున్నారు. ఇకపోతే తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న కేఈ ఫ్యామిలీ సైతం వైసీపీ నేతలతో టచ్ లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతుంది. అయితే గౌరు చరితారెడ్డి రీ ఎంట్రీకీ సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేక నో చెప్తారా అన్నది సస్పెన్షన్ గా మారింది. 

click me!