తెలంగాణలో ఎకరం అమ్మితే ఏపీలో 50 ఎకరాలు కొనొచ్చు.. తప్పులను ప్రశ్నిస్తే వేధింపులు: చంద్రబాబు

Published : Jun 19, 2023, 03:30 PM IST
తెలంగాణలో ఎకరం అమ్మితే ఏపీలో 50 ఎకరాలు కొనొచ్చు.. తప్పులను ప్రశ్నిస్తే వేధింపులు: చంద్రబాబు

సారాంశం

ఏపీలోని అధికార వైసీపీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో భయంకరమైన వాతావరణం ఉందని.. ఎవరూ స్వేచ్చగా మాట్లాడే పరిస్థితి లేదన్నారు.

ఏపీ‌లోని అధికార వైసీపీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో భయంకరమైన వాతావరణం ఉందని.. ఎవరూ స్వేచ్చగా మాట్లాడే పరిస్థితి లేదన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే తప్పుడు కేసులు పెట్టడం, ఆస్తులను జప్తు చేయడం, వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేవారిని మానసికంగా దెబ్బతీసే యత్నం జరుగుతుందని అన్నారు. వైసీపీ నాయకులకు వ్యతిరేకంగా అన్యాయం జరిగిందని ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. కేసులు పెట్టడం లేదని విమర్శించారు. 

వైసీపీ ప్రభుత్వం 7 సార్లు కరెంట్ చార్జీలు పెంచిందని విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చామని చెప్పారు. కరెంట్ మిగులు సాధించామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థను పూర్తిగా  నాశనం చేశారని మండిపడ్డారు. వేసవిలో కరెంట్ కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. చెత్త పన్ను, ఇంటి పన్ను.. ఇలా ప్రతి దానితో ప్రజలను వేధించడమే వైసీపీ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని విమర్శించారు. 

ఆంధ్రప్రదేశ్‌లో భూముల విలువ పడిపోయిందని అన్నారు. ఒక్కప్పుడు ఏపీలో ఒక ఎకరం అమ్మితే, తెలంగాణలో నాలుగు ఎకరాలు కొనుక్కునే అవకాశం ఉండేదని.. ఇప్పుడు తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఏపీలో కొన్ని ప్రాంతాల్లో 50 ఎకరాలు కొనే పరిస్థితి వచ్చిందని చెప్పారు. అభివృద్ది ఆగిపోవడంతో ఏపీలో భూముల విలువలు పడిపోయాయని అన్నారు. భూముల విలువ తగ్గి.. రిజిస్ట్రేషన్ విలువ పెరిగిందని అన్నారు. 

నాసిరకం మద్యంతో పేదవారి ప్రాణాలతో సీఎం జగన్ చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. పైగా 95 శాతం మేనిఫెస్టో హామీలు అమలు చేశామని అబద్దాలు చెబుతున్నారని అన్నారు. సీఎం జగన్ మనస్సాక్షి లేని వ్యక్తి అని అన్నారు. గుడివాడలో టిడ్కో ఇళ్లు ఆరు నెలల్లో పూర్తి కావాల్సి ఇళ్లను నాలుగేళ్ల తర్వాత పంపిణీ చేశారని విమర్శించారు. ఎవరికో పుట్టిన బిడ్డను తన బిడ్డగా చెప్పుకునే వ్యక్తి జగన్ అని విమర్శలు గుప్పించారు. అసమర్థ సీఎం పాలనలో అన్నీ అవస్థలేనని అన్నారు.

సీఎం జగన్‌కు రాష్ట్రాన్ని పాలించే హక్కు లేదని చంద్రబాబు విమర్శించారు. కురుక్షేత్ర యుద్దం మొదలైందని.. కౌరవ వధ జరగాల్సిందేనని అన్నారు. 175 సీట్లలో గెలుపే తమ  లక్ష్యమని తెలిపారు. నియోజకవర్గ ఇంచార్జ్‌లు మరింత బాధ్యతగా పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుతం భయంకరమైన వాతావరణ ఉందని ఆరోపించారు. బీసీలకు పెద్దపీట వేసింది టీడీపీనేనని  అన్నారు. బీసీల కోసం ఏం చేయబోతున్నామనేది త్వరలోనే స్పష్టంగా తెలియజేస్తామని అన్నారు. టీడీపీ భవిష్యత్తు గ్యారెంటీ ప్రకటించిన తర్వాత జగన్‌కు ఏం చేయాలో తెలియడం లేదని విమర్శించారు. 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు