ఎంపీపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా.. పోలీసులా, గుండాలా: జగన్‌పై చంద్రబాబు విమర్శలు

Siva Kodati |  
Published : May 15, 2021, 10:03 PM IST
ఎంపీపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా.. పోలీసులా, గుండాలా: జగన్‌పై చంద్రబాబు విమర్శలు

సారాంశం

సీఐడీ కస్టడీలో వున్న నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు గాయాలపై మండిపడ్డారు టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు. పోలీస్ కస్టడీలో వున్న ఎంపీని కొట్టడం పోలీసుల దమన కాండకు నిదర్శనమన్నారు. గౌరవ ఎంపీని పోలీసులు ఏవిధంగా శారీరక హింసకు గురిచేస్తారు?  చంద్రబాబు ప్రశ్నించారు

సీఐడీ కస్టడీలో వున్న నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు గాయాలపై మండిపడ్డారు టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు. పోలీస్ కస్టడీలో వున్న ఎంపీని కొట్టడం పోలీసుల దమన కాండకు నిదర్శనమన్నారు. గౌరవ ఎంపీని పోలీసులు ఏవిధంగా శారీరక హింసకు గురిచేస్తారు?  చంద్రబాబు ప్రశ్నించారు.

రఘురామకృష్ణంరాజు నేరస్తుడు కాదని.. ప్రభుత్వ అక్రమ కేసులో నిందితుడు మాత్రమేనని స్పష్టం చేశారు. కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా గుంపులుగుంపులుగా వెళ్లి అరెస్టు చేయడమే పెద్ద నేరమని చంద్రబాబు ఎద్దేవా చేశారు. అలాంటప్పడు థర్డ్ డిగ్రీ అమలుచేయడం మరో తప్పని టీడీపీ అధినేత మండిపడ్డారు. 

పోలీసు కస్టడీలో ఉన్న సామాన్య పౌరుడిని కూడా కొట్టే హక్కు పోలీసులకు ఉండదని చట్టం చెబుతోందని.. ఏపీ పోలీసులకు చట్టం నుంచి ఏమైనా మినహాయింపు ఉందా అని ఆయన నిలదీశారు. ముఖ్యమంత్రి కళ్లలో ఆనందం చూడటానికి  కొందరు పోలీసు అధికారులు వ్యవహరిస్తున్న తీరు యావత్ పోలీస్ వ్యవస్థకే మాయనిమచ్చగా మారిందన్నారు.

ఈ చర్యలన్నీ చూస్తుంటే.. ఫ్యాక్షన్ వ్యవస్థను తలపిస్తున్నాయి తప్ప రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నట్లుగా లేదని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తిపైనే పోలీసులు ఈవిధంగా జులుం ప్రదర్శించారంటే రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆయన నిలదీశారు.

Also Read:మే 28 వరకు రఘురామకు రిమాండ్.. ఆరోగ్యం కుదటపడ్డాక జైలుకి : సీఐడీ కోర్ట్ ఆదేశాలు

జగన్మోహన్ రెడ్డి జమానాలో రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ సరికొత్త చట్టాలను అమలుచేస్తున్నట్లు కన్పిస్తోందని మండిపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా సిబిసిఐడి పోలీస్ స్టేషన్ లోనే థర్డ్ డిగ్రీ అమలుచేయడంపై సమగ్ర విచారణ జరపాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

ఇందుకు బాధ్యులైన సిబిసిఐడి  ఉన్నతాధికారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్ట్ చేయడమే కాకుండా పోలీసుస్టేషన్లోనే హింసించాలని ఏ చట్టం చెబుతోంది.

రఘురామ నడవలేని పరిస్థితులో ఉన్నారంటే ఏవిధంగా ఆయనను హింసించారో అర్థమవుతుందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు అధికారులు గూండాల్లా ప్రవర్తించడం దారుణమన్నారు.  తక్షణమే రఘురామకృష్ణంరాజుకు మెరుగైన వైద్యం అందించాలని టీడీపీ అధినేత డిమాండ్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్