వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఈ నెల 28 వరకు రిమాండ్ విధిస్తూ గుంటూరులోని ఆరో అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఈ నెల 28 వరకు రిమాండ్ విధిస్తూ గుంటూరులోని ఆరో అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముందుగా వైద్య పరీక్షల కోసం రఘురామను ఆసుపత్రికి తరలించాలని కోర్టు ఆదేశించింది.
తొలుత గుంటూరు జీజీహెచ్, తర్వాత రమేశ్ ఆసుపత్రికి తరలించాలని న్యాయస్థానం సూచించింది. అలాగే రఘురామకృష్ణంరాజుకు వై కేటగిరీ భద్రత కల్పించేందుకు సీఐడీ కోర్టు అనుమతించింది. ఎంపీ ఆరోగ్యం మెరుగుపడేంత వరకు జైలుకు తరలించొద్దని సీఐడీని కోర్టు ఆదేశించింది.
మరోవైపు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కోర్టును తప్పుదారి పట్టిస్తున్నారని ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. రఘురామ పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసిందని... మధ్యాహ్నం ఎంపీ కుటుంబసభ్యులు ఆయనకు భోజనం తీసుకొచ్చారని ఏఏజీ తెలిపారు.
Also Read:కాళ్ల నిండా గాయాలు.. పోలీసులు కొట్టారంటూ న్యాయమూర్తికి రఘురామరాజు ఫిర్యాదు
అప్పటి వరకు రఘురామ మామూలుగానే వున్నారని.. హైకోర్టులో పిటిషన్ డిస్మిస్ కాగానే ఎంపీ కొత్త నాటకానికి తెరలేపని పొన్నవోలు ఆరోపించారు. పోలీసులు కొట్టారంటూ సాయంత్రం కోర్టులో కట్టుకథ అల్లారని ఏఏజీ మండిపడ్డారు. రఘురామ ఆరోపణలపై న్యాయస్థానం మెడికల్ కమిటీ వేసిందని ఆయన వెల్లడించారు. రేపు మధ్యాహ్నం లోగా పరిశీలన చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించిందని సుధాకర్ రెడ్డి చెప్పారు.
కాగా, ఏపీ హైకోర్టు సీఐడీ పోలీసుల తీరును మండిపడింది. రఘురామకృష్ణంరాజు శరీరంపై నిన్న లేని దెబ్బలు ఈ రోజు ఎలా వచ్చాయని ప్రశ్నించింది. గాయాలు తాజాగా తగిలినవని తేలితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కోర్టు హెచ్చరించింది. రఘురామకృష్ణంరాజు కాళ్లపై గాయాల చిత్రాలు, దృశ్యాలను ధర్మాసనానికి ఎంపీ తరఫు న్యాయవాదులు చూపించారు.
రిమాండ్ రిపోర్టును రద్దు చేసి వెంటనే విడుదల చేయాలని కోరారు. దీనిపై డివిజన్ బెంచ్ తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఇదే సమయంలో న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో ఏం జరుగుతోందని ప్రశ్నించింది. కస్టడీలో ఉన్న వ్యక్తిని ఎలా కొడతారు? ఎంపీ రఘురామకు తగిలిన గాయాల పరిశీలనకు వైద్యుల కమిటీ ఏర్పాటు చేయాలి అని కోర్ట్ ఆదేశించింది.