ఈసీపై జగన్ తీవ్ర వ్యాఖ్యలు: చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్, హింసపై వీడియోలు ప్లే

By Siva KodatiFirst Published Mar 15, 2020, 6:02 PM IST
Highlights

60 ఏళ్లు పైబడిన వారికే కరోనా వస్తుందని, బ్లీచింగ్ పౌడర్ జల్లితే పోతుందని ముఖ్యమంత్రి జగన్ బాధ్యతారాహిత్యంతో మాట్లాడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు

60 ఏళ్లు పైబడిన వారికే కరోనా వస్తుందని, బ్లీచింగ్ పౌడర్ జల్లితే పోతుందని ముఖ్యమంత్రి జగన్ బాధ్యతారాహిత్యంతో మాట్లాడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రపంచంలోని అన్ని దేశాలకు ప్రస్తుతం కరోనా వ్యాపించిందన్నారు.

ఓ తెలివిలేని వ్యక్తి, ఉన్మాదంతో వ్యవరించిన చందంగా సీఎం ప్రవర్తిస్తున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. జగన్ ఎవరు చెప్పినా వినరు అనే దానికి ఇదే నిదర్శనమని కరోనాను ప్రపంచ ఆరోగ్య సంస్థ మహమ్మారిగా చెప్పిందని ఆయన గుర్తుచేశారు. రెండు వారాల్లో 13 రెట్లు కరోనా పెరిగిందని డబ్ల్యూ‌హెచ్ఓ డైరెక్టర్ చెప్పారని చంద్రబాబు తెలిపారు.

భారత ప్రభుత్వం కరోనాను ఎదుర్కోనేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టిందని ఆయన అన్నారు. మనదేశంలోని 12 రాష్ట్రాల్లో వైరస్ వ్యాపిస్తోందని, ఇద్దరు మరణించారని చంద్రబాబు గుర్తుచేశారు. వ్యాధి తీవ్రత దృష్ట్యా ఆరు రాష్ట్రాల్లో కార్యకలాపాలను నిలిపివేశాయన్నారు.

Also Read:కరోనానే పట్టుకున్న చంద్రబాబు: చర్యలపై జగన్ వెనకంజ, కారణం ఇదే...

60 ఏళ్ల వయసున్న వారికే కరోనా వస్తుందని జగన్ చెబుతన్నారని కానీ కెనడా ప్రధాన మంత్రి భార్య వయసు ఎంతని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రపంచంలో, దేశంలో కరోనా ఇంతటి విలయం సృష్టిస్తున్నా జగన్మోహన్ రెడ్డి ఒక్క సమీక్ష గానీ, ప్రజల ముందుకు రావడం గానీ చేయలేదని వీడియో గేమ్స్ ఆడుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు.

ఆయనకు రాజకీయ ప్రయోజనాలు తప్పించి, రాష్ట్ర ప్రయోజనాలు తప్పవని ప్రజల ప్రాణాలంటే లెక్కలేదని చంద్రబాబు ఎద్దేవా చేశారు. కరోనా గురించి జగన్ ఏం అధ్యయనం చేయలేదని, ఏం తెలియదని పారాసిటమాల్ వేస్తే తగ్గుతుందంటూ వ్యాఖ్యానించడంపై చంద్రబాబు ధ్వజమెత్తారు.

కరోనా వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై తాము ముందే ఎన్నికల కమీషన్‌కు చెప్పామని టీడీపీ అధినేత గుర్తుచేశారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో సీఎస్‌ని, డీజీని ఇద్దరు ఎస్పీలను వైసీపీ ఫిర్యాదు చేసి బదిలీ చేయించిందన్నారు. ప్రస్తుతం ఎన్నికల కమీషన్ జగన్ హిట్‌ లిస్టులోకి చేరిందని చంద్రబాబు మండిపడ్డారు.

సామాజిక వర్గం పేరే పెట్టి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదని, చివరికి ఈసీని కూడా బెదిరించే స్థితికి జగన్ చేరుకున్నారని ప్రతిపక్షనేత విమర్శించారు. అరాచకాలు చేస్తూ చిన్న గొడవలంటారా..? శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులు ఏం చేస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు.

Also Read:ఈసీ రమేశ్ కుమార్‌ను వదిలేది లేదు.. ఎంత దూరమైనా వెళ్తాం: జగన్ హెచ్చరిక

టీడీపీ అభ్యర్ధుల ఇంట్లో వైసీపీ నేతలే కావాలని మద్యం బాక్సులు పెట్టి అక్రమంగా కేసులు బుక్ చేస్తున్నారని టీడీపీ అధినేత ప్రశ్నించారు. రాష్ట్రంలో పులివెందుల మార్క్ రాజకీయాలు కొనసాగుతున్నాయన్నారు. చిత్తూరు జిల్లాలో వచ్చే ఎన్నికల్లో 14 స్థానాలకు గాను 14 చోట్ల విజయం సాధిస్తామని చంద్రబాబు సవాల్ విసిరారు.

ఇష్టం వచ్చినట్లుగా ఎన్నికలు చేసుకుంటామంటే కుదరదన్నారు. తాను అనుకుంటే జగన్ ఆయన పార్టీ నేతలు పోటీ చేసేవారా అని ప్రతిపక్షనేత ప్రశ్నించారు. నామినేషన్లు వేయనివ్వరు, నామినేషన్ పేపర్లను లాక్కుకుంటున్నారని బెదిరించి 22 శాతం స్థానాలను ఏకగ్రీవం చేసుకుంటారా అని టీడీపీ అధినేత విమర్శించారు. 
 

click me!