
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలే కాస్లీ అనుకుంటే రాజకీయ నాయకులు మరింత కాస్లీ అని తేలింది. దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ధనికుడిగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) చేపట్టిన సర్వేలో తేలింది. ఇక అత్యంత ధనిక ఎమ్మెల్యేల్లో ప్రతిపక్ష టిడిపి నాయకుడు చంద్రబాబు నాయుడు దేశంలోనే మూడోస్థానంలో నిలిచారు. ఇలా ఏపీలో అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి అధ్యక్షులు కళ్లుచెదిరే ఆస్తులు కలిగివున్నట్లు ఏడిఆర్ నివేదిక బయటపెట్టింది.
భారతదేశంలోని అన్నిరాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు సమర్పించిన ఎన్నికల అపిడవిట్లను విశ్లేషించిన ఏడిఆర్ వారి ఆస్తులపై ఓ నివేదికను విడుదల చేసింది. ఇందులో ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ప్రస్తుత సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు భారీ ఆస్తులు కలిగివున్నట్లు బయటపడింది. రూ.668 కోట్ల ఆస్తులతో చంద్రబాబు దేశంలోని అత్యంత ధనిక ఎమ్మెల్యేల్లో మూడోస్థానంలో నిలిచారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కంటే చంద్రబాబు ఆస్తుల విలువే ఎక్కువని... ఏపీలో అత్యంత ధనిక ఎమ్మెల్యే చంద్రబాబేనని ఏడిఆర్ నివేదిక వెల్లడించింది.
దేశంలోని ఎమ్మెల్యేలందరి కంటే అత్యధిక ఆస్తులు కలిగిన ఎమ్మెల్యేగా ఎన్ నాగరాజు నిలిచారు. ఆయన ఆస్తుల విలువ రూ.1,015 కోట్లుగా ఏడిఆర్ పేర్కొంది. ఆ తర్వాతి స్థానంలో డికె శివకుమార్ నిలిచారు. ఈయన ఆస్తుల విలువ రూ.840 కోట్లు. అత్యధిక ఆస్తులు కలిగిన ఈ ఇద్దరూ కర్ణాటక రాష్ట్రానికి చెందినవారే. వీరి తర్వాత రూ.668 కోట్ల ఆస్తులతో చంద్రబాబు మూడోస్థానంలో నిలిచారు.
Read More సీఎంలలో జగన్... అప్పుల్లో ఏపీ నెంబర్ వన్: జనసేన పోతిన మహేష్ ఎద్దేవా (వీడియో)
ఏడిఆర్ సంస్థ ప్రకటించిన నివేదిక ఏపీలో చర్చనీయాంశంగా మారింది. గతంలో తండ్రి వైఎస్సార్ ముఖ్యమంత్రిగా వుండగా భారీగా అక్రమాస్తులు సంపాదించిన వైఎస్ జగన్ తాను సీఎం అయ్యాక రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. కానీ ఏడిఆర్ నివేదిక మాత్రం జగన్ కంటే చంద్రబాబు ఆస్తులే ఎక్కువని ప్రకటించింది. ప్రస్తుత ముఖ్యమంత్రులందరిలో చంద్రబాబు టాప్ అయితే ఆయన కంటే ఎక్కువ ఆస్తులను మాజీ సీఎం చంద్రబాబు కలిగివున్నట్లు బయటపెట్టింది. దీంతో జగన్ అవినీతి సీఎం అంటూ ఆరోపించే టిడిపి నాయకులకు వైసిపి నాయకులు ఏడిఆర్ నివేదికతో కౌంటర్ ఇస్తున్నారు.
ఇదిలావుంటే దేశంలోని 30 మంది ముఖ్యమంత్రుల్లో 29 మంది కోటీశ్వరులేనని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నివేదిక వెల్లడించింది. ఒక్కో ముఖ్యమంత్రి సగటు ఆస్తులు రూ.33.96 కోట్లుగా ఉన్నాయని ఏడీఆర్ తెలిపింది. అందరు ముఖ్యమంత్రుల కంటే ఏపీ సీఎం జగన్ అత్యధికంగా రూ.510 కోట్ల ఆస్తులతో టాప్ లో ... అతి తక్కువగా కేవలం రూ.15 లక్షల ఆస్తులతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చివరి స్థానంలో నిలిచారు.
ఏపీ సీఎం జగన్ తర్వాత అధిక ఆస్తులను అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన పెమా ఖండూ (రూ.163 కోట్లకు పైగా) కలిగివున్నట్లు ఏడిఆర్ సంస్థ తెలిపింది. మూడో ధనిక సీఎంగా ఒడిశాకు చెందిన నవీన్ పట్నాయక్ (రూ.63 కోట్లకు పైగా) నిలిచారు. ఇక అతి తక్కువ ఆస్తులు కలిగిన సీఎంగా మమత నిలవగా ఆ తర్వాతి స్థానాల్లో కోటి రూపాయల ఆస్తులతో కేరళ సీఎం పినరయి విజయన్, కొటికి పైగా ఆస్తులతో హర్యానా సీఎం మనోహర్ లాల్ నిలిచారు.బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లు కూడా రూ.3 కోట్లకు పైగా ఆస్తులు కలిగి వున్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నివేదిక బయటపెట్టింది.