మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు ఇవాళ అదుపులోకి తీసుకున్నారు.
కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరుడిగా ఉన్న గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు శుక్రవారంనాడు ఉదయం అదుపులోకి తీసుకున్నారు. కడప సెంట్రల్ జైలు ఆవరణలో ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐఅధికారులు విచారిస్తున్నారు.
కడప జిల్లాలోని తుమ్మలపల్లిలో ఉన్న యురేనియం ప్లాంట్ లో ఉదయ్ కుమార్ రెడ్డి పనిచేస్తున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు న వైఎస్ భాస్కర్ రెడ్డి నివాసంలోనే ఉదయ్ కుమార్ రెడ్డి ఉన్నట్టుగా సీబీఐ అధికారులు గుర్తించాు. గూగుల్ టేకవుట్ ద్వారా సీబీఐ ఈ విషయాన్ని నిర్ధారించారని సమాచారం.
undefined
also read:వైఎస్ వివేకా హత్యకు రూ. 40 కోట్ల లావాదేవీలు: వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ పై కీలక వాదనలు
వైఎస్ వివేకానందరెడ్డి మృతదేహనికి ఉదయ్ కుమార్ రెడ్డి తండ్రి జయప్రకాష్ రెడ్డి బ్యాండేజీ కట్టారు. పులివెందులలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జయప్రకాష్ రెడ్డి పనిచేస్తున్నాడు. వైఎస్ వివేకానందరెడ్డి మృతదేహం తరలించేందుకు అంబులెన్స్, ఫ్రీజర్ వంటి వాటిని సమకూర్చడంలో ఉదయ్ కుమార్ కీలకంగా వ్యవహరించారని సీబీఐ అధికారులు గుర్తించారని సమాచారం.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు గతంలో పలుమార్లు ఉదయ్ కుమార్ రెడ్డిని విచారించారు. గత ఏడాది ఫిబ్రవరి మాసంలో సీబీఐ ఎస్పీ రాంసింగ్ పై ఉదయ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు రాంసింగ్ పై కేసు నమోదు చేశారు.
2019 మార్చి 14వ తేదీన వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యాడు.ఈ హత్య కేసును సీబీఐ విచారిస్తుంది. వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగడంపై సుప్రీంకోర్టు ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసును విచారిస్తున్న రాంసింగ్ ను తప్పించింది సీబీఐ. మరొకరికి ఈ కేసు బాధ్యతలను అప్పగించింది.
ఈ కేసు విచారణను ఆంధ్రప్రదేశ్ లో కాకుండా తెలంగాణలో విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీతా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన తర్వాత సుప్రీంకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.