పార్టీ ఏం చేసిందో గుర్తు చేసుకోండి: జగన్‌తో కరణం భేటీపై చంద్రబాబు స్పందన

By Siva KodatiFirst Published Mar 12, 2020, 6:09 PM IST
Highlights

చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం వైసీపీలో చేరడంపై స్పందించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చెప్పారు..? ఇప్పుడెలా ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. 

చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం వైసీపీలో చేరడంపై స్పందించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చెప్పారు..? ఇప్పుడెలా ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు.

తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వెళ్లిన ఎమ్మెల్యేలు, రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. పార్టీ మారిన నేతలంతా పార్టీ వారికి ఏం చేసిందో గుర్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

తాము చెప్పినట్లు వినకపోతే వైసీపీ నేతలు అధికారులను సైతం బెదిరిస్తున్నారని ఆరోపించారు టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు. మంళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.

Also Read:17 మంది టీడీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో: సజ్జల రామకృష్ణారెడ్డి సంచలనం

వైసీపీ నేతలు ఓటమి భయంతో రాష్ట్రవ్యాప్తంగా నామినేషన్లను అడ్డుకోవడంతో పాటు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. కుల ధ్రువీకరణ పత్రాలు, నో డ్యూ సర్టిఫికేట్లు ఇవ్వకుండా ఆ నెపంతో నామినేషన్ల పరిశీలనలో వాటిని పక్కన పెడుతున్నారని ప్రతిపక్షనేత ఆరోపించారు.

ప్రతిపక్షనేతల ఇళ్లలో మద్యం సీసాలు పెట్టి వారిని అరెస్ట్ చేస్తున్నారన్నారు. ఎన్నికల్లో ఓడిపోతామని భావించిన చోట ఎన్నికలను వాయిదా వేస్తున్నారని చంద్రబాబు తెలిపారు. వైసీపీ నేతల వేధింపులు, బెదిరింపుల వల్ల 170 మంది వరకు నామినేషన్లు వేయలేకపోయారని, అలాగే బైండోవర్ కేసులు, అక్రమ కేసులు, కిడ్నాప్‌లతో పోలీసులే వైసీపీ నేతలకు సహకరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.

మంత్రులు, రౌడీ ఎమ్మెల్యేలు ఉండే చోట పెట్రేగిపోతున్నారని ఆయన మండిపడ్డారు. ప్రతిపక్షనేతలను భయభ్రాంతులకు గురిచేసేందుకు మాచర్లలో టీడీపీ నేతలపై హత్యాయత్నం చేశారని టీడీపీ అధినేత ఆరోపించారు. ఎన్నికల సమయంలో సొంత బాబాయ్‌ని హత్య చేయించినప్పుడే జగన్ నైజం అర్థమయ్యిందన్నారు.

ఇంట్లోనే వివేకాను చంపేసి, గుండెపోటుతో చనిపోయారని ప్రజల్ని తప్పుదోవ పట్టించారని చంద్రబాబు ఆరోపించారు. వివేకానందరెడ్డి కుమార్తె పోస్టుమార్టం చేయాలని గట్టిగా పోరాటం చేయడం వల్లే అసలు భండారం బయటపడిందని ఆయన గుర్తుచేశారు. హత్య జరిగిన ఏడాది తర్వాత వివేకా హత్యపై జగన్ సీబీఐ దర్యాప్తు కోరారని చంద్రబాబు మండిపడ్డారు.

ఎంపీటీసీ ఎన్నికల్లో భాగంగా ఒక నల్ల చట్టం తీసుకొచ్చారని... దీని ప్రకారం మద్యాన్ని ఇంట్లో పెట్టుకున్నా వారిపై అనర్హత వేటుతో పాటు మూడేళ్ల జైలు శిక్షతో వదలకుండా ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా కేసులను మళ్లీ తిరగదోడేలా వ్యూహం పన్నారని చంద్రబాబు మండిపడ్డారు.

Also Read:ప్రకాశంలో బాబుకు గట్టి ఎదురు దెబ్బ: వైసీపీలోకి కరణం బలరాం..?

కోర్టులు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసిన ముఖ్యమంత్రి మాత్రం ఉన్మాదంతో ముందుకు వెళ్తున్నారని బాబు దుయ్యబట్టారు. పోలీసుల యూనిఫామ్‌లు వేసుకుని వైసీపీ కార్యకర్తలు రంగంలోకి దిగారేమోనని తనకు అనుమానంగా ఉందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. తన రాజకీయ జీవితంలో ఎన్నడూ లేనివిధంగా ఎన్నికలు జరిపించాలని పోరాటం చేయాల్సి వస్తోందన్నారు. 

click me!