అలా చేయండి... పెట్రోల్, డిజిల్ ధరలు తగ్గించవచ్చు: జగన్ సర్కార్ కు చంద్రబాబు సలహా

Arun Kumar P   | Asianet News
Published : Aug 30, 2021, 04:45 PM ISTUpdated : Aug 30, 2021, 04:47 PM IST
అలా చేయండి... పెట్రోల్, డిజిల్ ధరలు తగ్గించవచ్చు: జగన్ సర్కార్ కు చంద్రబాబు సలహా

సారాంశం

తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల పట్ల ప్రభుత్వం అవలంభిస్తున్న తీరును ఈ సమావేశంలో ఖండించారు. 

అమరావతి: ప్రజాస్వామ్య పద్ధతిలో, కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిరసన తెలిపిన టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయడాన్ని టిడిపి నేతలు ఖండించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులు భవిష్యత్ లో తగిన మూల్యం చెల్లిస్తారని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన టీడిపి నేతలు హెచ్చరించారు. 

ఏపీకి చెందిన తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతలతో ఇవాళ చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుత పరిస్థితులపై చర్చించి కింది నిర్ణయాలు తీసుకున్నారు.  
 
1. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర ధరల పెరుగుదలపై రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలను ప్రత్యేకంగా అభినందించారు. ప్రజల నిరసన చూసైనా రాష్ట్ర ప్రభుత్వం పెట్రో ధరలు తగ్గించాలని ఈ సమావేశం డిమాండ్ చేయడమైంది.

2. పెట్రోల్, డీజిల్ పై భవిష్యత్ లో వచ్చే ఆదాయాన్ని సైతం జగన్ రెడ్డి తాకట్టు పెట్టి అప్పులు తెచ్చేందుకు యత్నించడాన్ని సమావేశంలో టీడీపీ నేతలు ఖండించారు. ప్రభుత్వ స్కీమ్ ల్లో స్కామ్ లకు అడ్డుకట్ట వేసినా, దుబారా నివారించినా పెట్రోల్, డీజిల్ పై ధరలు పెంచాల్సిన అవసరం రాదు.

3. రాష్ట్రంలో కొన్ని లక్షల కేసులు పడుతున్నాయి. శాంతిభద్రతలు అదుపులో లేవు అనేందుకు ఇది నిదర్శనంగా నిలుస్తోంది. రాష్ట్రంలో నిత్యం నేర ఘటనలు, అత్యాచార ఘటనలతో పత్రికలన్నీ నిండిపోతున్నాయని సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. అరాచక పాలన వల్ల రాష్ట్రానికి రావాల్సిన రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయి. ఆర్థిక సంక్షోభానికి ఇది కూడా ఒక కారణమైంది.

4. ఉత్తరాంధ్ర అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి విస్మరించారు. ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు జగన్ రెడ్డి వద్ద ఉత్సవ విగ్రహాలుగా మారారు. విశాఖ రైల్వేజోన్, వెనుకబడ్డ ప్రాంతాల ప్యాకేజీ తీసుకురాలేక పోవడం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి లాంటి పథకాలు అటకెక్కించారు. విశాఖలో భూకబ్జాలు పెరిగిపోయి.. ప్రశాంతమైన విశాఖను అశాంతి నిలయంగా మార్చారు.

read more  చింతమనేని అరెస్ట్... డిజిపి సవాంగ్ కు టిడిపి చీఫ్ చంద్రబాబు లేఖ

5. రాష్ట్రవ్యాప్తంగా ఇసుకను అక్రమంగా తరలిస్తూ పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతున్నారు. ఇసుక అక్రమ మైనింగ్ లో ముఖ్యమంత్రి కార్యాలయం, కొందరు మంత్రులు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఉచిత ఇసుక విధానం తెచ్చి  భవన నిర్మాణ రంగాన్ని, రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించాలి. ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేయాలంటే ఉచిత ఇసుక విధానం తిరిగి తేవాలి. 

6. డ్వాక్రా మహిళల్లో అభద్రతాభావం ఉంది. మహిళల పొదుపును కూడా తాకట్టు పెట్టి జగన్  రెడ్డి అప్పులు తెచ్చే విధానాలకు తెరతీయబోతున్నారు. భవిష్యత్ లో ఇది డ్వాక్రా మహిళలకు భారంగా మారనుంది. వారే అప్పులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సమావేశంలో నేతలు నిర్ణయించారు.

7. రాష్ట్రంలో పలు జిల్లాల్లో రైతులు క్రాప్ హాలిడేలు ప్రకటించే పరిస్థితి వచ్చింది. పూడికలు తీయకపోవడం వల్ల పంట పొలాలు మునిగిపోతున్నాయి. రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. రైతు సమస్యలను పరిష్కరించడంలో జగన్ రెడ్డి విఫలమయ్యారని సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు.

8.  ఉపాధి హామీ పెండింగ్ బిల్లుల విషయంలో ప్రభుత్వ తీరు సరికాదు. పంచాయతీలకు ఆస్తులు సృష్టించి ఇచ్చిన వారిని ఇబ్బందులకు గురిచేయకుండా చెల్లింపులు చేయాలి కోర్టు ధిక్కరణ చర్యలకు దిగరాదు.ఈ కుంభకోణంపై నిరసనలు తెలపాలని తీర్మానించడమైంది. 

9.  అమరావతి విషయంలో మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలను సమావేశంలో నేతలు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు 3 రాజధానులంటూ కుట్రలు చేస్తున్నారని నేతలు అభిప్రాయపడ్డారు. అమరావతిలో రూ.2 లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తిని నిరర్థకం చేసి రాష్ట్రాన్ని అప్పులమయం చేశారు. నేటి ఆర్థిక సంక్షోభానికి కారణమయ్యారు.

ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నిమ్మల రామానాయుడు,  వర్ల రామయ్య, కాలవ శ్రీనివాసులు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, పయ్యావుల కేశవ్,  బోండా ఉమా మహేశ్వరరావు,  టీడీ జనార్థన్, పి.అశోక్ బాబు,  నల్లమిల్లి రామకృష్ణారెడ్డి,  ఆలపాటి రాజేంద్రప్రసాద్,  కొమ్మారెడ్డి పట్టాభిరాం, బీసీ జనార్థన్ రెడ్డి,  మద్దిపాటి వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు.
 
 

PREV
click me!

Recommended Stories

Deputy CM Pawan Kalyan: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సమావేశంలో పవన్ కీలక ప్రసంగం | Asianet News Telugu
CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu