
నెల్లూరు జిల్లా వింజమూరులో విషాదం చోటు చేసుకుంది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతోన్న సాజీదా అనే చిన్నారి గుండెపోటుతో చనిపోయింది . ఎప్పటిలాగే బుధవారం స్కూల్‌కి వెళ్లిన ఆ చిన్నారి ... తరగతి గదిలోనే గుండెపోటుతో కుప్పకూలింది. వెంటనే అప్రమత్తమైన టీచర్లు, సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలిక చనిపోయినట్లు నిర్థారించారు వైద్యులు. క్లాస్ రూమ్‌లో టీచర్ ప్రశ్నలు అడుగుతుండగా విద్యార్ధినికి గుండెపోటు వచ్చినట్లు సహచరులు చెబుతున్నారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇకపోతే.. బుధవారం కాగజ్‌నగర్ కస్తూర్బా బాలికల పాఠశాల వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. విద్యార్ధిని ఐశ్వర్య మృతదేహంతో విద్యార్ధి సంఘాల నేతలు ఆందోళన చేస్తున్నారు. హాస్టల్ ఆఫీసు రూమ్‌లోకి దూసుకెళ్లి ఫర్నిచర్ ధ్వంసం చేశారు ఆందోళనకారులు. జిల్లా కలెక్టర్ వచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని బాధిత కుటుంబం తేల్చిచెబుతోంది. విద్యార్ధికి న్యాయం చేసి, నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
కస్తూర్బా పాఠశాలలో రాత్రి భోజనం చేసిన ఐశ్వర్య అనే విద్యార్ధిని నోటి నుంచి నురగ రావడంతో పాఠశాల సిబ్బంది ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటూ బాలిక మరణించింది. అంకుశాపూర్‌కు చెందిన ఐశ్వర్య ఇక్కడ 8వ తరగతి చదువుతుంది.