చట్టపరంగా ఏదైనా చేసుకో.. నీ దయాదాక్షిణ్యాలపై లేను: జగన్‌కు బాబు సవాల్

By sivanagaprasad KodatiFirst Published Dec 27, 2019, 4:16 PM IST
Highlights

అమరావతి ప్రాంతంలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగితే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలంటూ ముఖ్యమంత్రి జగన్‌కు చంద్రబాబు సవాల్ విసిరారు. 

అమరావతి ప్రాంతంలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగితే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలంటూ ముఖ్యమంత్రి జగన్‌కు చంద్రబాబు సవాల్ విసిరారు. చట్టపరంగా ఏదైనా చేసుకోవచ్చని.. మీ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి లేనని ఆయన స్పష్టం చేశారు. అమరావతిలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన అమరావతిని ఏదో రకంగా భ్రష్టు పట్టించాలని ఆలోచన పెట్టుకున్నారని బాబు మండిపడ్డారు.

ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఒకటి, కేబినెట్ భేటీ తర్వాత మరొకటి మాట్లాడతారని టీడీపీ అధినేత ఎద్దేవా చేశారు. 13 జిల్లాలకు ఆదాయ వనరులు సమకూర్చేది అమరావతేనని ఆయన స్పష్టం చేశారు. అమరావతికి రూ.లక్షా 9 వేల కోట్లు ఖర్చు అవుతుందని.. ఇప్పటి వరకు రూ. 5 వేల కోట్లు ఖర్చు చేశారని వైసీపీ నేతలు చెబుతున్నారని.. కానీ అమరావతికి రూ.9,597 కోట్లను తాము ఖర్చు చేశామని బాబు తెలిపారు. 

తెలంగాణ ఆదాయంలో ఒక్క హైదరాబాద్ నుంచే 65 శాతం లభిస్తుందని, అక్కడ రిజిస్ట్రేషన్ల ద్వారానే రూ.10 వేల కోట్లు వస్తుందని టీడీపీ చీఫ్ తెలిపారు. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, ముంబై నగరాలు ఆయా రాష్ట్రాలకు ఆదాయ వనరులుగా మారాయని చంద్రబాబు గుర్తుచేశారు.

Also Read:పాపం పండే రోజు వస్తే దాక్కోలేరు: చంద్రబాబుపై నాని వ్యాఖ్యలు

రాష్ట్ర విభజన తర్వాత అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మాణానికి ఖజానాలో డబ్బులు లేవని, ఏం చేయాలో అనుకున్నప్పుడు వచ్చిన ఆలోచనే ల్యాండ్ పూలింగ్ అని ఆయన తెలిపారు.

ఈ విధానం వినూత్నమైన ఆలోచన అని 29 వేల మంది రైతులు, 33 వేల ఎకరాలు భూమిని రాజధాని కోసం ఇచ్చారని బాబు గుర్తుచేశారు. అమరావతి కోసం ఎక్కువగా చిన్న, సన్నకారు రైతులే భూములిచ్చారని తెలిపారు. 

రాజధానిని మరో చోటికి తరలిస్తే హైకోర్టు, సెక్రటేరియేట్, అసెంబ్లీని నిర్మించాల్సి ఉంటుందని.. దీనికి కూడా డబ్బులు కావాలి కదా అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. అమరావతిలో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వైఎస్ జగన్ ఏడు నెలల నుంచి పరిపాలన చేశారని.. ప్రస్తుతానికి కావాల్సిన వసతులు కట్టామని, ఇవి తాత్కాలిక నిర్మాణాలు కావని బాబు సూచించారు.

అప్పుడు తాను హైదరాబాద్-సికింద్రాబాద్ చాలని అనుకున్నట్లయితే సైబరాబాద్ వచ్చేదికాదని ఆయన గుర్తుచేశారు. ఒకవేళ సైబరాబాద్ రాకపోయుంటే హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా తయారయ్యేది కాదన్నారు.

అభివృద్ధి జరిగితేనే సంక్షేమ పథకాలకు డబ్బు వస్తుందని బాబు తెలిపారు. నిన్నటి వరకు ఒకే సామాజిక వర్గానికి అమరావతి వల్ల మేలు జరిగిందన్న వైసీపీ.. ఇవాళ డబ్బులు లేనందువల్ల రాజధానిని తరలిస్తున్నామని చెబుతున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. 

Also Read:చంద్రబాబుకు షాక్: సీబీఐకి అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్?

అమరావతి ప్రాంతం ముంపునకు గురయ్యే అవకాశమే లేదని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ తెలిపిన సంగతిని బాబు గుర్తుచేశారు. ఫౌండేషన్ ఖర్చులు చెన్నై, హైదరాబాద్‌లతో పోల్చి చూసినా అమరావతిలో తక్కువ ఖర్చుతో పూర్తి చేయవచ్చని మద్రాస్ ఐఐటీ నిపుణులు చెప్పారన్నారు.

రాజధాని ఎంపికను శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహించామని.. అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో ఉన్నందునే అమరావతిని నిర్థారించామన్నారు. విశాఖపై అంత ప్రేమ ఉంటే.. అధికారంలోకి వచ్చిన వెంటనే అక్కడ ఉన్న డేటా సెంటర్‌ను ఎందుకు రద్దుచేశారని చంద్రబాబు వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు.

రూ.70 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుంటే.. హైదరాబాద్‌కు ధీటుగా విశాఖ తయారయ్యేదన్నారు. ఒక కంపెనీని తీసుకురావడం చాలా కష్టమని.. వెళ్లగొట్టడం చాలా సులభమని బాబు ఎద్దేవా చేశారు.

భోగాపురం విమానాశ్రయం, విశాఖ మెట్రోలు రాకుండా వైసీపీ నేతలు అడ్డుపడ్డారని బాబు మండిపడ్డారు. 1000 మందిని ఒక చోట పెడితే అది అభివృద్ధి కాదని, తల, మొండెం వేరు వేరు చోట్ల పెడితే అది అభివృద్ధి జరిగిపోదన్నారు.

తిరుపతిని హార్డ్‌వేర్, ఎలక్ట్రానిక్ హాబ్‌గా తయారు చేయాలని తాము భావిస్తే.. వైసీపీ ధాటికి రిలయన్స్ వెనక్కి వెళ్లిపోయిందని చంద్రబాబు గుర్తుచేశారు. ప్రపంచంలో ఎక్కడా మూడు రాజధానులు లేవని.. జగన్‌ది వితండ వాదమని... పిచ్చి తుగ్లక్‌ కన్నా 20 రెట్లు పెద్ద పిచ్చోడని ఎద్దేవా చేశారు. పదివేల కోట్లు అమరావతిలో ఖర్చు పెట్టామని.. రైతులతో ఒప్పందం చేసుకున్నామని బాబు గుర్తుచేశారు. 

click me!