సీపీఎస్ హామీ మరిచిపోయినందునే రోడ్డెక్కారు.. ఉద్యోగులపై వేధింపులొద్దు: జగన్‌పై చంద్రబాబు ఆగ్రహం

By Siva KodatiFirst Published Aug 30, 2022, 8:41 PM IST
Highlights

సీపీఎస్ ఉద్యోగులకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అండగా నిలిచారు. తాము అధికారంలోకి వస్తే.. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్ తెస్తామని జగన్ ఇచ్చిన హామీని టీడీపీ చీఫ్ గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చాక వాగ్థానాన్ని నెరవేర్చకపోవడంతో ఉద్యోగులు రోడ్డెక్కారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు

ఆంధ్రప్రదేశ్‌లో సీపీఎస్ విధానంపై ఉద్యోగులు రోడ్డెక్కిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల నిరసనలకు సైతం దిగారు. దీంతో ఉద్యోగులకు పలు రాజకీయ పార్టీలు కూడా మద్ధతుగా నిలుస్తున్నాయి. దీనిపై ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. సీపీఎస్ ఉద్యోగులపై వేధింపులు, కేసులు ఆపాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చంద్రబాబు లేఖ రాశారు. తాము అధికారంలోకి వస్తే.. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్ తెస్తామని జగన్ ఇచ్చిన హామీని టీడీపీ చీఫ్ గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చాక వాగ్థానాన్ని నెరవేర్చకపోవడంతో ఉద్యోగులు రోడ్డెక్కారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసనలు చేస్తోన్న ఉద్యోగులను కేసులతో వేధిస్తున్నారని.. ఆందోళనను వాయిదా వేసినప్పటికీ బైండోవర్ కేసులు పెడుతున్నారని ప్రతిపక్షనేత ఆరోపించారు. 

ఇదిలా ఉంటే.. ఏఆర్ కానిస్టేబుల్‌ ప్రకాష్‌ను సర్వీస్‌ నుంచి తొలగించడం అన్యాయమని చంద్రబాబు నాయుడు సోమవారం అన్నారు. సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వం సమస్యలపై నిలదీసిన వారిపై చర్యలు తీసుకోవడం దారుణమని విమర్శించారు. అనంతపురంలో సేవ్‌ ఏపీ పోలీస్‌ అంటూ అమరవీరుల స్మారక స్థూపం దగ్గర నిరసనకు దిగిన ఎఆర్‌ కానిస్టేబుల్‌ ప్రకాష్‌ను సర్వీసు నుంచి తొలగించడానికి అక్రమ కేసులు మోపుతారా? అని నిలదీశారు. ప్రకాష్‌పై ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరును ఖండిస్తున్నామని, ఆయనపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని, వెంటనే సర్వీసులోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Also Read:సీఎం జగన్ పంతమే ఫైనల్ కాదు.. న్యాయవ్యవస్థ అనేది ఒకటి ఉంటుందని గుర్తించాలి: చంద్రబాబు

మరోవైపు... కొవ్వూరు కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల విషయంలో హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈ మేరకు మంగళవారం ఆయన ట్విట్టర్‌లో ఓ పోస్టు చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన కొవ్వూరు అర్బన్ బ్యాంకు ఎన్నికలను రద్దుచేసి ఎన్నికల వ్యవస్థను సీఎం జగన్ అపహాస్యం చేశారని విమర్శించారు. ఈ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు సీఎం జగన్‌కు చెంపపెట్టులాంటిదని అన్నారు. బ్యాంక్ పాలక వర్గం స్థానంలో ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ చట్ట విరుద్ధమని హైకోర్టు తీర్పు ద్వారా స్పష్టం చేసిందని అన్నారు. 

వ్యక్తులు తప్పు చేస్తే సరిదిద్దాల్సిన అధికార వ్యవస్థలను సైతం సీఎం జగన్ భ్రష్టుపట్టించారని చంద్రబాబు ఆరోపించారు. న్యాయబద్ధంగా జరిగిన ఏ ఎన్నికల ఫలితాన్ని అంగీకరించేందుకు జగన్ సిద్ధంగా లేరని మళ్లీ రుజువైందని అన్నారు. సీఎం జగన్ పంతమే ఫైనల్ కాదని.. న్యాయ వ్యవస్థ ఉందని ఆయన గుర్తించాలని అన్నారు. ఇప్పటికైనా చట్టాలకు, నిబంధనలకు లోబడి పనిచేయడం సీఎం జగన్ నేర్చుకోవాలని చంద్రబాబు అన్నారు. 

click me!