సీఎం జగన్ పంతమే ఫైనల్ కాదు.. న్యాయవ్యవస్థ అనేది ఒకటి ఉంటుందని గుర్తించాలి: చంద్రబాబు

Published : Aug 30, 2022, 04:39 PM IST
సీఎం జగన్ పంతమే ఫైనల్ కాదు.. న్యాయవ్యవస్థ అనేది ఒకటి ఉంటుందని గుర్తించాలి: చంద్రబాబు

సారాంశం

కొవ్వూరు కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల విషయంలో హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్టుగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన కొవ్వూరు అర్బన్ బ్యాంకు ఎన్నికలను రద్దుచేసి ఎన్నికల వ్యవస్థను సీఎం జగన్ అపహాస్యం చేశారని విమర్శించారు. 

కొవ్వూరు కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల విషయంలో హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్టుగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ఓ పోస్టు చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన కొవ్వూరు అర్బన్ బ్యాంకు ఎన్నికలను రద్దుచేసి ఎన్నికల వ్యవస్థను సీఎం జగన్ అపహాస్యం చేశారని విమర్శించారు. ఈ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు సీఎం జగన్‌కు చెంపపెట్టులాంటిదని అన్నారు. బ్యాంక్ పాలక వర్గం స్థానంలో ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ చట్ట విరుద్ధమని హైకోర్టు తీర్పు ద్వారా స్పష్టం చేసిందని అన్నారు. 

వ్యక్తులు తప్పు చేస్తే సరిదిద్దాల్సిన అధికార వ్యవస్థలను సైతం సీఎం జగన్ భ్రష్టుపట్టించారని చంద్రబాబు ఆరోపించారు. న్యాయబద్ధంగా జరిగిన ఏ ఎన్నికల ఫలితాన్ని అంగీకరించేందుకు జగన్ సిద్ధంగా లేరని మళ్లీ రుజువైందని అన్నారు. సీఎం జగన్ పంతమే ఫైనల్ కాదని.. న్యాయ వ్యవస్థ ఉందని ఆయన గుర్తించాలని అన్నారు. ఇప్పటికైనా చట్టాలకు, నిబంధనలకు లోబడి పనిచేయడం సీఎం జగన్ నేర్చుకోవాలని చంద్రబాబు అన్నారు. 

 



ఇదిలా ఉంటే.. ఏఆర్ కానిస్టేబుల్‌ ప్రకాష్‌ను సర్వీస్‌ నుంచి తొలగించడం అన్యాయమని చంద్రబాబు నాయుడు సోమవారం అన్నారు. సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వం సమస్యలపై నిలదీసిన వారిపై చర్యలు తీసుకోవడం దారుణమని విమర్శించారు. అనంతపురంలో సేవ్‌ ఏపీ పోలీస్‌ అంటూ అమరవీరుల స్మారక స్థూపం దగ్గర నిరసనకు దిగిన ఎఆర్‌ కానిస్టేబుల్‌ ప్రకాష్‌ను సర్వీసు నుంచి తొలగించడానికి అక్రమ కేసులు మోపుతారా? అని నిలదీశారు. ప్రకాష్‌పై ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరును ఖండిస్తున్నామని, ఆయనపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని, వెంటనే సర్వీసులోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే