ఎన్డిఏ మీటింగ్ లో చంద్రబాబు డిమాండ్లు ఇవే..!!

By Arun Kumar P  |  First Published Jun 5, 2024, 3:33 PM IST

దేశ రాజధాని న్యూడిల్లీలో జరిగే ఎన్డిఏ మిత్రపక్షాల సమావేశంలో చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్ కూడా పాల్గొంటున్నారు. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో వీరే కీలకం కాబట్టి ఎన్డిఏ ముందు ఈ డిమాండ్లు వుంచారట....


డిల్లీ : ఆంధ్ర ప్రదేశ్ లో భారీ విజయాన్ని అందుకుంది తెలుగు దేశం పార్టీ... ఈ విక్టరీ సౌండ్ డిల్లీలో వినిపోస్తోంది. కేంద్ర ప్రభుత్వం అండగా వుంటుందని ఎన్నికలకు ముందు బిజెపితో పొత్తు పెట్టుకుంది టిడిపి... ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. బిజెపికి ప్రభుత్వ ఏర్పాటుకు తగిన సీట్లు రాలేవు... కాబట్టి ఎన్డిఏ మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరీముఖ్యంగా ఎన్డిఏలో బిజెపి తర్వాత అత్యధిక ఎంపీ సీట్లున్నది టిడిపినే.. కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో టిడిపిది కీలక పాత్ర. దీంతో టిడిపి అధినేత ఏం చేస్తారు? ఎన్డిఏ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తారా? ఇందుకోసం ప్రభుత్వం ముందు ఎలాంటి డిమాండ్లు పెట్టనున్నారు? అనే చర్చ జరుగుతోంది.  

అయితే ఇప్పటికే నరేంద్ర మోదీని ముచ్చటగా మూడోసారి ప్రధానిని చేసే ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నారు. జూన్ 8న అంటే వచ్చే శనివారం మోదీ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు చేసారు. అంటే ఎన్డిఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం ఖాయం. దీనిపై చర్చించేందుకు ఇవాళ ఎన్డిఏ మిత్రపక్షాల సమావేశం డిల్లీలో ఏర్పాటుచేసారు... ఇందుకోసం టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిల్లీకి వెళ్లారు. 

Latest Videos

అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారిన చంద్రబాబు ఎన్డిఏ ముందు పలు డిమాండ్లు వుంచినట్లు తెలుస్తోంది. వాటిపై బిజెపి పెద్దల నుండి హామీ పొందాకే ఎన్డిఏ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తానని షరతులు పెట్టినట్లు తెలుస్తోంది. ఎలాగూ బిజెపికి మరోదారి లేదు కాబట్టి టిడిపి డిమాండ్లను అంగీకరిస్తుంది.

చంద్రబాబు ప్రధాన డిమాండ్లివే :  

1.  ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా : 

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజనతో రాజధాని హైదరాబాద్ ను కోల్పోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే విభజన తర్వాత ప్రభుత్వాలు మారిపోయాయి... దీంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక హోదా హామీ అటకెక్కింది. గతంలో ఇదే చంద్రబాబు అధికారంలో వున్నా ప్రత్యేక హోదా సాధించలేకపోయారు... ఆనాడు కేంద్రంలో బిజెపికి సంపూర్ణ మెజారిటీ వుండటంతో గట్టిగా అడగలేకపోయారు. కానీ ఇప్పుడు చంద్రబాబు సహకారం లేనిదే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు సాధ్యమయ్యే పరిస్థితి లేదు. కాబట్టే ఆయన ప్రత్యేక హోదాను ప్రధాన డిమాండ్ గా ఎన్డిఏ కూటమి ముందు వుంచనున్నారు.  

2. కేంద్ర నిధులు : 

విభజన కారణంగా ఆంధ్ర ప్రదేశ్ భారీ ఆదాయాన్నికోల్పోయింది. అయినా గత పదేళ్లలో కేంద్రం అందించిన నిధులు అంతంతమాత్రమే. పరిపాలనా అవసరాలు, ఉద్యోగుల జీతభత్యాలు, సంక్షేమ పథకాలకే సింహభాగం బడ్జట్ సరిపోతుంది. ఇక రాష్ట్ర అభివృద్దికి నిధులు సరిపోవడం లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఎక్కువగా నిధలు కేటాయించాలనేది చంద్రబాబు మరో డిమాండ్. 

3. అమరావతి అభివృద్దికి సహకారం :

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం రాజధాని లేకుండానే పాలన సాగుతోంది. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుడితే వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే మూడు రాజధానులంటూ హడావిడి చేసారు. దీంతో అమరావతి నిర్మాణం ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వచ్చారు కాబట్టి  అమరావతి నిర్మాణాన్ని పూర్తిచేయడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. కాబట్టి రాజధాని నిర్మాణానికి ఆర్థికంగానే కాదు అన్ని రకాలుగా సహకరించాలని చంద్రబాబు కేంద్రంలో ఏర్పడబోయే ఎన్డిఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. 

4. కేంద్ర కేబినెట్ చోటు..:

కొత్తగా ఏర్పడబోయే మోదీ కేబినెట్ లో ఐదు మంత్రి పదవులు కూడా చంద్రబాబు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. టిడిపి, జనసేన పార్టీలకు కలిపి 18 లోక్ సభ సీట్లున్నాయి... వీరిలో ఐదుగురికి కేంద్ర మంత్రి పదువులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. జలవనరులు, ఐటీ,  వ్యవసాయ, ఆర్థిక శాఖలతో పాటు స్పీకర్ పదవిని కూడా చంద్రబాబు కోరుతున్నట్లు తెలుస్తోంది. అలాగే మిగతా ఎంపీలకు కూడా పార్లమెంట్ కమిటీల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్నది చంద్రబాబు డిమాండ్. 

5. విభజన హామీలపైనా :  

ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్ర ప్రదేశ్ కు అనేక హామీలు ఇచ్చారు. కానీ ఈ పదేళ్లలో వాటిలో చాలా అమలుకు నోచుకోలేదు. వాటిని కూడా ఎన్డిఏ మీటింగ్ లో చంద్రబాబు ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో జాతీయస్థాయి విద్యాసంస్థల ఏర్పాటు, దుగ్గరాజపట్నం పోర్ట్ నిర్మాణం, విశాఖ, విజయవాడలకు మెట్రో రైలు, వైజాగ్, చెన్నై పారిశ్రామిక కారిడార్, విశాఖకు రైల్వే జోన్, ఏపీ అసెంబ్లీ స్థానాల పెంపు వంటి విభజన హామీల అమలుకు చంద్రబాబు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇక విశాఖ పట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు కోరనున్నట్లు తెలుస్తోంది. ఇంకా అనేక డిమాండ్లను చంద్రబాబు ఎన్డిఏ మీటింగ్ లో ప్రస్తావించి.... వాటి అమలుకు హామీ లభించిన తర్వాతే ఎన్డిఏ ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యేందుకు అంగీకరించవచ్చు. తాజాగా డిల్లీకి వెళుతూ ఏమైనా జరగొచ్చు అనేలా చంద్రబాబు కామెంట్స్ చేయడంవెనక అంతరార్థం కూడా ఇదేనని తెలుస్తోంది. 

click me!